తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఆయా రాష్ట్రాభివృద్ది కోసం దేశీయ,విదేశీయ పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రులు పలుమార్లు భేటీ కావడం..విదేశీ పర్యటనలు చేసిరావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా శ్రీసిటీలో రూ.1000 కోట్లతో 134 ఎకరాల్లో క్యాడ్‌బరీ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ము్ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాడ్‌బరీ సంస్థ ప్రతినిధులు కలిశారు.

ఆ సంస్థ ఉత్పత్తులైన చాక్లెట్లు, బిస్కట్లు, గమ్‌ అండ్‌ క్యాండీ, బేవరే జెస్‌, క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్‌, క్యాడ్‌బరి సెలబ్రేషన్స్‌, సీడీఎం సిల్క్‌, బోర్నవిటా, పెర్క్‌, పైవ్‌ స్టార్‌ చాక్లెట్లు, జెమ్స్‌ క్యాబ్‌బరి బోర్నవిల్లే తదితర ఉత్పత్తుల కోసం ప్లాంట్‌ నిర్మాణం చేయనున్నారు.సీఎస్‌ఆర్‌ ప్రోగ్రామ్‌ కింద శుభ్‌ ఆరంభ్‌ పేరుతో ప్లాంట్‌ నిర్మాణం ఏర్పాటు కానుంది. చుట్టుపక్కల ప్రాంతాలలో కమ్యూనిటీ అభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

 క్యాడ్‌బరీ సంస్థ ప్రతినిధులతో భేటీ ముగిసిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో క్యాడ్‌బరీ ప్లాంటు ఏర్పాటుతో కోకో పంట సాగుకు ప్రాధన్యం పెరిగిందన్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో దాదాపు 10వేల ఎకరాలలో వున్న సాగును మరింత పెంచేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఉన్న కొబ్బరి, పామాయిల్‌ తోటల్లో ప్రథమంగా అంతర్‌ పంటగా కోకో సాగును చేపట్టాలని సూచించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: