ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మలి విడుత పదవిలో కొనసాగుతారా..? లేదా..? అన్న చర్చకు ఎట్టకేలకు తెరపడింది. మరో టర్మ్ గవర్నర్‌గా కొనసాగదలుచుకోలేదని స్వయంగా ఆయనే ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4న తన పదవీకాలం ముగియగానే మళ్లీ తనకిష్టమైన అధ్యాపక వృత్తినే చేపట్టనున్నట్లు ఆర్‌బీఐలోని సహోద్యోగులకు రాసిన లేఖలో రాజన్ స్పష్టం చేశారు.  ఇదిలా ఉంటే తదుపరి ఆర్‌బీఐ గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ‘రాజన్‌ మంచి పనితీరును ప్రదర్శించారు. ప్రతిభావంతమైన వ్యక్తినే తదుపరి ఆర్‌బీఐ గవర్నర్‌గా ఎంపిక చేస్తాం’ అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే.



అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) వంటి ప్రతిష్ఠాత్మక ఏజెన్సీలో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేసిన రాజన్‌కు 2008 ఆర్థిక మాంద్యంపై అందరికంటే ముందుగా హెచ్చరించిన ఘనత రాజన్‌దే. 53 ఏండ్ల రాజన్ ఐఎంఎఫ్ నుంచి బయటికొచ్చాక యూనివర్సిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా ఆర్థిక పాఠాలు బోధించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపు మేరకు తన మాస్టారు ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి సెప్టెంబర్ 4, 2013న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 23వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. భారీగా పతనమైన రూపాయి, బలహీన వృద్ధిరేటు, కొండెక్కిన ధరల సూచీ వంటి తీవ్ర సమస్యలతో ఆర్థిక వ్యవస్థ సతమతమవుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ పగ్గాలు చేపట్టిన రాజన్.. తనదైన శైలి నిర్ణయాలు, విశ్లేషణలతో అనతికాలంలోనే క్యాపిటల్ మార్కెట్ వర్గాల మన్ననలు పొందగలగడంతోపాటు ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకుల దృష్టిని ఆకర్షించగలిగారు. 



గవర్నర్‌గా రాజన్‌ను మరింతకాలం కొనసాగించాలంటూ ఇంటర్నెట్‌లో జరుగుతున్న సంతకాల సేకరణ ప్రక్రియకు కూడా నెటిజన్ల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తున్నది. కానీ ఈమధ్య ఆయనపై జరిగిన రాజకీయదాడి నేపథ్యంలోనే మరోమారు గవర్నర్‌గా కొనసాగేందుకు రాజన్ ఇష్టపడటం లేదని తెలుస్తున్నది. గతంలో ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్య నిధి)లో ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేసిన రాజన్ తిరిగి ఉపాధ్యాయ వృత్తిలోకి వెళతానని సందేశమిచ్చారు. తొలి అడుగు వేశామని, రెండు తదుపరి పరిణామాలు పూర్తి కావాల్సి ఉందని.. ద్రవ్య విధాన కమిటీ, బ్యాంకుల ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తుల)లను ఉద్దేశించి రాజన్ అన్నారు. ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, గవర్నర్ పదవీకాలం ముగిసిన తర్వాత విద్యాంరంగంలోకి వెళ్లాలనుకున్న విషయాన్ని సిబ్బందితో పంచుకోవాలని అనుకున్నానని రాజన్ తెలిపారు. అవసర మైనప్పుడు దేశానికి సేవలందించేందుకు తానెప్పుడూ అందుబాటులో ఉంటానని, తన తర్వాత వచ్చే వారసుడు ఆర్‌బిఐని సరికొత్త శిఖరాలకు చేర్చగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.



ఈ నేపథ్యంలో నూతన ఆర్‌బీఐ గవర్నర్‌గా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌లు ఉర్జిత్‌ పటేల్‌, రాకేశ్‌ మోహన్‌, ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్‌ అరుంథతీ భట్టాచార్య, ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ సుబిర్‌ గోకర్ణ్‌, మాజీ ఆర్థిక సలహాదారు అశోక్‌ లాహిరి, జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఛైర్మన్‌ అశోక్‌ చావ్లా, ప్రముఖ ఆర్థికవేత్త విజయ్‌ కేల్కర్‌లు ఉన్నారు.



వీరిలో ఉర్జిత్‌ పటేల్‌, అరుంథతీ భట్టాచార్యలు ముందు వరుసలో ఉన్నట్లు బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం. ఉర్జిత్‌ పటేల్‌ ప్రస్తుతం రాజన్‌తో కలిసి పనిచేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు తీసుకునే నిర్ణయాల్లో ఈయనది కూడా కీలక పాత్రే. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, ధరల నియంత్రణ, ద్రవ్యపరపతి సమీక్ష సందర్భంగా తీసుకున్న పలు సంస్కరణల్లో ఈయన పాత్ర కూడా ఉంది. దీంతో ఉర్జిత్‌ పేరు ప్రముఖంగా వినపడుతోంది.
మరి వీరిలో ఆర్‌బీఐ గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్‌ పదవీకాలం సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు ఉన్న విషయం విదితమే.


మరింత సమాచారం తెలుసుకోండి: