ప్రపంచంలోనే అతి చౌకైన స్మార్ట్‌ఫోన్‌ ‘ఫ్రీడమ్‌ 251’ను శుక్రవారం నుంచి వినియోగదారులకు అందించనున్నట్లు రింగింగ్‌ బెల్స్‌ వెల్లడించింది. తొలి విడతలో 5,000 ఫోన్లను డెలివరీ చేయనున్నట్టు వెల్లడించింది. గురువారంనాడిక్కడ కంపెనీ కొత్త ఫోన్లు, ఎల్‌ఇడి టీవీని ఆవిష్కరించిన సందర్భంగా రింగింగ్‌ బెల్స్‌ డైరెక్టర్‌ మోహిత గోయెల్‌ విలేకరులతో మాట్లాడారు. రూ.251కే విక్రయిస్తామని గత ఫిబ్రవరిలో ఈ సంస్థ ప్రకటించడంతో, 7 కోట్ల మంది పేర్లు నమోదు చేసుకోగా, 30,000 మంది డబ్బులు కూడా చెల్లించారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారిలో 5,000 మందికి తొలివిడతగా ఫోన్లు అందించనున్నట్లు రింగింగ్‌ బెల్స్‌ డైరెక్టర్‌ మోహిత్‌ గోయెల్‌ తెలిపారు. 



ఈ ఫోన్‌ కోసం 7 కోట్ల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. వీరిలో రెండు లక్షల మందికి మాత్రమే ఫోన్లను డెలివరీ చేయనున్నారు. లాటరీ ద్వారా కస్టమర్లను ఎంపిక చేయనున్నట్టు గోయెల్‌ తెలిపారు. ఒక్కో ఫ్రీడమ్‌ ఫోన్‌పై తమకు 930 రూపాయల నష్టం వస్తుందని, అసలు ఈ ఫోన్‌ వ్యయం 1,180 రూపాయల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. యాప్స్‌ ద్వారా 300 రూపాయలు పొందినా ఇంకా 630 రూపాయల నష్టం వస్తుందని తెలిపారు. కంపెనీ లాభాల్లో 95 శాతం దాతృత్వం కోసం వినియోగిస్తామని చెప్పారు. 



ఈ ఫోన్‌ డెలివరీ తీసుకునే వారు ఫోన్‌ ధర 251 రూపాయలతోపాటు 40 రూపాయల డెలవరీ చార్జీని చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. రెండు లక్షల ఫ్రీడమ్‌ ఫోన్లను 251 రూపాయల ధరకే అందించడానికి సిద్ధంగా ఉందని, అయితే తమకు ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తేనే ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి సహకారం లభించకపోయినా తాము మాట ఇచ్చినట్టుగా రెండు లక్షల ఫోన్లను డెలివరీ చేస్తామని, అయితే దీనికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: