రూ.251కే స్మార్ట్ ఫోన్ అంటూ కొద్ది నెలల కిందట 'రింగ్స్ బెల్స్' కంపెనీ చేసిన హడావుడి మరచిపోక ముందే.. అదే స్లోగన్ తో మరో కంపెనీ తెరపైకి వచ్చింది. కాకపోతే.. రింగ్ బెల్స్ కంపెనీ రూ.251కే స్మార్ట్ ఫోన్ అంటే.. కొత్త కంపెనీ మాత్రం కాస్త రేటు పెంచింది. రూ.501కే రింగ్ బెల్స్ కంపెనీ ప్రకటించిన దాని కంటే మెరుగైన సదుపాలతో స్మార్ట్ ఫోన్ అందిస్తామని జోధ్ పూర్ కు చెందిన 'ఛాంపియన్ వన్' కంపెనీ ముందుకు వచ్చింది. 'ఛాంపియన్ వన్ సీ1' మోడల్ ఫోన్ ఖరీదు రూ.6,999వేల రూపాయలని, దానిని కేవలం రూ.501కే అందిస్తామని ప్రకటించింది. సెప్టెంబర్ 2న ఫస్ట్ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తామని, వినియోగదారుల్లో నమ్మకం కలిగించేందుకు క్యాష్ ఆన్ డెలివరి సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది.


రూ.501 'ఛాంపియన్ వన్ సీ1' ఫోన్‌ ప్రత్యేకలు
ఛాంపియన్ వన్ సీ1లో 5 అంగుళాల హెచ్‌డీ(720గీ1280) ఐపీఎస్‌ డిస్‌ప్లే, ఎంటీ6735 1.3 గిగాహెర్జ్స్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్, డ్యూయల్‌ సిమ్‌, 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టం, వెనుక 8 మెగాపిక్సెల్‌,  ముందు 5 మెగా పిక్సెల్‌ కెమెరా, 2 జీబీర్యామ్‌, 16జీడీ ఇంటర్నల్ మెమరీ, 3.5ఎంఎం ఆడియో జాక్‌, మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌, లిపో 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్విక్‌ చార్జ్‌ సదుపాయాన్ని ఫోనులో పొందుపరచింది. 


అప్పట్లో రూ. 251 కే స్మార్ట్ ఫోన్ పై దుమారం
రూ. 251కే అన్ని సదుపాయాలున్న స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని రింగింగ్ బెల్స్ సంస్థ సీఈఓ మోహిత్ గోయల్ ప్రకటించిన వేళ, టెక్ ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అంత తక్కవ ధరకు ఫోన్ ఇవ్వడం అసాధ్యమని, కేవలం ప్రచార ఆర్భాటానికి మాత్రమే ఈ ఎత్తుగడ వేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఫోన్ కు అమిత ఆదరణ రాగా, గంటల వ్యవధిలో 7 కోట్ల బుకింగ్స్ వచ్చాయి. సర్వర్స్ డౌన్ అయిందంటూ బుకింగ్స్ నిలిపేయడంతో రింగింగ్ బెల్స్ చిక్కుల్లో పడింది. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. 251 రూపాయలకే ఫోన్‌ ఇస్తామంటూ మోసపూరిత ప్రకటనలు చేస్తున్న కంపెనీ బండారం బయటపెట్టాలని ICA డిమాండ్ చేసింది. రింగింగ్‌ బెల్స్‌ కంపెనీ ఆఫర్‌ వెనుక దాగున్న నిజానిజాలు కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాసింది.


రింగ్స్ బెల్స్ ప్రకటించిన ఫ్రీడం ఫోన్ ప్రత్యేకతలు
ఫోర్‌ ఇంచ్‌ టచ్‌ స్క్రీన్‌. 1జీబీ ర్యామ్‌. 8జీబీ ఇంటర్నల్‌ మెమరీ. 3.2 మెగాపిక్సెల్‌ రియర్‌, 0.3 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా. ఇవే ఎక్కువనుకుంటే 1.3 గిగాహెర్ట్జ్‌ క్వాడ్ కోర్‌ ప్రాసెసర్‌ విత్‌ త్రీజీ సపోర్ట్‌. ఆండ్రాయిడ్‌ లాలీపాప్‌ వెర్షన్‌ తో పాటు 1450 MAH బ్యాటరీ. ఇన్ని ఫీచర్లున్న ఫోన్‌ రేట్‌ కనీసం 3 వేలు ఉంటుంది. కానీ, రింగింగ్‌ బెల్స్‌ కంపెనీ మాత్రం 251 రూపాయలకే అందిస్తామంటూ పెద్ద దుమారం రేపింది. ఫోన్‌ తో పాటు ఛార్జర్‌, హెడ్‌ ఫోన్‌, డేటా కార్డు కూడా ఫ్రీ అంటూ ప్రకటించిన కంపెనీ.. అమలు చేయడంలో విఫలమైంది.


ఆఫర్స్ అనగానే అమితోత్సాహం చూపే భారతీయులు.. 'ఛాంపియన్ వన్ సీ1' పట్ల ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫ్రీడమ్ రూ.251 నిరుత్సాహపరచడంతో తాజా ఆఫర్ ను లైట్ తీసుకుంటురా.. లేక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా..?  'ఛాంపియన్ వన్' కంపెనీ ప్రకటించిన ప్రకారం రూ.501కే వినియోగదారులకు స్మార్ట్ ఫోన్ అందించే దానిపై స్పష్టత రావాలంటే.. సెప్టెంబర్ 2 ఫ్లాష్ సేల్ వరకు ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: