వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం రాష్ట్ర ప్రభుత్వం జూలై 9న ఎంసెట్-2ను నిర్వహించనుంది. ఇందుకోసం శనివారం (28న) నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) మీద కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎంసెట్-2 (2016) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంసెట్-2 షెడ్యూల్ ఖరారయింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి బుధవారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఉన్నతాధికారులతో చర్చించారు. మంత్రితోపాటు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

అనంతరం ఎంసెట్-2 షెడ్యూల్‌ను మంత్రి లకా్ష్మరెడ్డి ప్రకటించారు. జూలై 9న ఎంసెట్-2 నిర్వహించనున్నారు. వచ్చే నెల 8న పరీక్ష నిర్వహణ కమిటీ సమావేశమవుతుంది. 9న ఫస్ట్ రీజినల్ కో ఆర్డినేటర్స్ మీటింగ్ ఉంటుంది. జూన్ 15న పరీక్షా కేంద్రాలు ఖరారు చేస్తారు. జూలై 2న సెకండ్ రీజినల్ కో ఆర్డినేటర్స్ మీటింగ్ ఉంటుంది. వైద్యకోర్సుల్లో ప్రవేశాలకోసమే ఈ ఎంసెట్-2ను నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్‌లో ప్రవేశాలను ఈ నెల 15న నిర్వహించిన ఎంసెట్ ప్రకారం జరుపుతారు. ఆ ప్రవేశపరీక్ష ఫలితాలను గురువారం వెల్లడించనున్నారు.



 అయితే రూ. 500 అపరాధ రుసుముతో 14వ తేదీ వరకు, రూ. వెయ్యి అపరాధ రుసుముతో 21వ తేదీ వరకు, రూ. 5 వేల అపరాధ రుసుముతో 28వ తేదీ వరకు, రూ. 10 వేల అపరాధ రుసుముతో జూలై 6 నాటికీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి లక్ష్మారెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ. 250గా, ఇతరులకు రూ. 500గా నిర్ణయించారు. జూన్ 8న పరీక్ష నిర్వహణ కమిటీ, 9న ఫస్ట్ రీజనల్ కోఆర్డినేటర్లు వేర్వేరుగా సమావేశం కానున్నారు. జూన్ 15న పరీక్ష కేంద్రాలను ఖరారు చేయనున్నారు.

 
 జూలై 2న రెండో రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం జరగనుంది. జూలై 2 నుంచి 7వ తేదీ వరకు విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూలై 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంసెట్-2 ప్రవేశ పరీక్ష నిర్వహించి అదే రోజు ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనున్నారు. జూలై 12లోగా ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు తెలుపుకోవచ్చు. జూలై 14న ర్యాంకులు ప్రకటించనున్నారు.

 



 


మరింత సమాచారం తెలుసుకోండి: