భారతదేశం ప్రస్తుతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడుతోంది. ఇటీవల కాలంలో భారత్‌లో జరుగుతున్న ఆవిష్కరణలు, ఉత్పత్తులకు అమెరికా సహా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఆదరణ లభిస్తోంది. ఒక వ్యవస్థగా దేశానికి, వ్యక్తుల స్థాయిలో విద్యార్థులకు, పారిశ్రామికవేత్తలకు లక్ష్య నిర్దేశనకు ఇదే సరైన సమయం. నేటి తరం యువత స్వల్ప కాలిక లక్ష్యాలు.. డిగ్రీ పట్టా చేతికందుతూనే ఉద్యోగం పొందడం అనే ఆలోచనకు స్వస్తి పలకాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులు ‘దీర్ఘకాలిక లక్ష్యాలతోనే సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది’ అనే వాస్తవాన్ని గుర్తించాలంటున్నారు నిపుణులు. 



మేనేజ్‌మెంట్ డిగ్రీతో కార్పొరేట్ కొలువు సొంతం చేసుకుందాం అనే మూస విధానానికి విద్యార్థులు స్వస్తి పలకాలి. ‘ఇన్నోవేటివ్’గా ఆలోచించాలి. కోర్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ పరంగా రిమోట్ ఆధారిత రోబోటిక్ సేవలు ఎన్నో అందుబాటులోకి వస్తున్నాయి. ఉదాహరణకు రిమోట్ కంట్రోల్ అంటే రెండు దశాబ్దాల క్రితం టీవీలకే పరిమితం. కానీ, ఇప్పుడు మొబైల్ ఫోన్‌ను సైతం రిమోట్ కంట్రోల్‌గా మార్చుకుని ఆఫీస్ నుంచే ఇంట్లో పనులు చక్కబెట్టుకోవడం అనేది సరికొత్త ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే ఒక రంగంలో ఒక కొత్త ఉత్పత్తి రూపకల్పనతో అయిపోయింది అనే పరిస్థితులు మారాయి. ఒక కొత్త ఉత్పత్తి రూపకల్పన జరిగితే భవిష్యత్తులో ఆ ఉత్పత్తిని రూపొందించిన సంస్థ సుస్థిరత కోణంలో అభివృద్ధిపై దృష్టిసారిస్తోంది. దీనికి ఆవిష్కరణలు ఉపయోగపడుతున్నాయి. విద్యార్థులు వీటిపై దృష్టిసారించాలి.



ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో తరగతి గది బోధనకు పరిమితం కావడమంటే తమ అభివృద్ధికి తామే అడ్డంకులు సృష్టించుకుంటున్నట్లుగా చెప్పొచ్చు. క్లాస్‌రూం బయటకు రావాలి. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలి. లెక్చర్స్ ద్వారా తెలుసుకున్న అంశాల ప్రాక్టికాలిటీపై దృష్టి పెట్టాలి. ఈ విధానమే నేటి పరిస్థితుల్లో అసలైన విజయాలను అందించే సాధనం.



ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో కొందరే రాణించడానికి కారణం ఆయా వ్యక్తుల్లో భవిష్యత్తు సుస్థిరత గురించి సరైన ఆలోచన లేకపోవడం. దీనికి పరిష్కారం మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని ముందడుగు వేయాలి. స్టార్టప్ పరంగా అప్పటికే నిర్దేశిత రంగంలో ఉత్పత్తులు, సేవలు అందించే సంస్థలు ఉంటే వాటికంటే తాము మరింత మెరుగ్గా వ్యవహరించే విధంగా కదలాలి. సదరు రంగంలో సేవలు, ఉత్పత్తుల పరంగా ఉన్న లోపాలపై దృష్టిసారించాలి. వాటిని తమ స్టార్టప్స్‌లో లేకుండా చూసుకోవాలి. అప్పుడు కచ్చితంగా అంతిమ వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తుంది.



మేనేజ్‌మెంట్ డిగ్రీలు చదువుతున్న విద్యార్థులు ముఖ్యంగా రెండు సవాళ్లను స్వీకరించేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలి. అవి.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై ఆసక్తి ఉంటే కొత్త వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలనే విషయంలో సరైన వ్యూహం ఉండాలి. ఇక ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుంటే తాము అడుగు పెట్టనున్న పరిశ్రమ లేదా సంస్థ సుస్థిర కాలం కార్యకలాపాలు నిర్వహించే విధంగా తమను తాము మలచుకోవాలి. ఈ క్రమంలో సమర్థమైన నిర్వహణ నైపుణ్యాలను తరగతి గదిలో ఉన్నప్పుడే అందిపుచ్చుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: