మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు అత్యంత ఆవశ్యకమైన లక్షణం.. లక్ష్యంపై స్పష్టత ఉండటం! అది ఉంటేనే ఇన్‌స్టిట్యూట్ స్థాయి ఎలాంటిదైనా.. ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ ఏదైనా భవిష్యత్తులో బెస్ట్ లీడర్స్‌గా ఎదుగుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేనేజ్‌మెంట్ విద్యార్థులకు అత్యంత అవసరమైన అంశం.. గ్లోబల్ థింకింగ్! క్లాస్‌రూంలో చెప్పే పాఠాలను వినడం లేదా స్థానికంగా మార్కెట్ పరిస్థితులను తెలుసుకోవడమే కాకుండా.. వాటిని అంతర్జాతీయ దృక్పథంతో చూడాలి. నిర్దిష్టంగా ఒక రంగంలో మార్పులకు, అంతర్జాతీయంగా జరుగుతున్న మార్పులకు మధ్య భేదాలు, పోలికలను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. అంతేకాకుండా కొన్ని రంగాల్లో అంతర్జాతీయ మార్పులు స్థానికంగా కూడా ఆయా రంగాల పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలో వాటికి గల కారణాలు? అవి చూపుతున్న ప్రభావం స్థాయి, వాటి వల్ల మన మార్కెట్‌లో నిర్దిష్టంగా సంబంధిత రంగంలో సంభవించనున్న పరిణామాలను బేరీజు వేసే విధంగా క్రిటికల్ థింకింగ్ అలవర్చుకోవాలి.



మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరే విద్యార్థులను రెండు (బై ఆప్షన్, బై ఛాయిస్) రకాలుగా పేర్కొనొచ్చు. వీటిలో మొదటి రకం (బై ఆప్షన్) విద్యార్థులు ఎప్పటి నుంచో మేనేజ్‌మెంట్ విద్యను లక్ష్యంగా చేసుకుని, అడుగులు వేస్తారు. వీరు అకడమిక్‌గానూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు దూసుకెళ్తారు. రెండో రకం (బై ఛాయిస్) విద్యార్థులు.. రెండు, మూడు లక్ష్యాలు పెట్టుకుని, బై ఛాయిస్‌గా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశిస్తారు. ఇలాంటి విద్యార్థులు కోర్సులో ప్రవేశించాక ఎలా వ్యవహరించాలో తెలియక ఇబ్బంది పడతారు. అయితే ఆ ఇబ్బందులను తొలి రోజుల్లోనే అధిగమించేందుకు ప్రయత్నించాలి. దీనికి ఫ్యాకల్టీ మెంటారింగ్‌ను ఉపయోగించుకోవాలి. సీనియర్ల సలహాలు తీసుకోవడం, కచ్చితంగా క్లాస్‌లకు హాజరుకావడం వంటివి చేస్తే వీరు కూడా బై ఆప్షన్‌గా చేరిన వారికి దీటుగా రాణించగలుగుతారు.



భవిష్యత్తుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్ ఆలోచన, లక్ష్యం ఉన్న విద్యార్థులు దానికి సంబంధించి ఎంబీఏలో చేరినప్పటి నుంచే అడుగులు వేయాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ‘ఆలోచన’కు ప్రస్తుత మార్కెట్ ఎలా ఉంది? రెండేళ్ల తర్వాత ఎలా ఉంటుంది? సుదీర్ఘ కాలంలో ఎలా రాణించొచ్చు? తదితరాలపై దృష్టిసారించాలి. వీటిపై అవగాహన పెంపొందించుకున్న తర్వాత తమ ఆలోచనకు రూపమిచ్చే మార్గాల గురించి అన్వేషించాలి. అందుబాటులో ఉండే వనరులు (ఇంక్యుబేషన్ సెంటర్స్, ఈ-సెల్స్)ను వినియోగించుకోవాలి. ఇటీవలి కాలంలో మంచి ఐడియాలతో రూపొందిన స్టార్టప్స్ కూడా విఫలమవడానికి కారణం దీర్ఘకాలిక మార్కెట్ పరిస్థితులు, అందుకు తగిన వ్యూహాలపై ముందస్తు అంచనాలు లేకపోవడమే.



మేనేజ్‌మెంట్ విద్యార్థులకు అవసరమైన మరో ప్రధాన అంశం.. నాయకత్వ లక్షణాలు. ఇవి ఉంటేనే భవిష్యత్తులో ఉద్యోగంలోనైనా, స్వయం ఉపాధి పరంగానైనా ముందుకెళ్లగలరు. ఇవి సొంతం కావాలంటే ప్రాథమికంగా, వ్యక్తిగత స్థాయిలో అవసరమైన లక్షణం చొరవ. నలుగురితో మాట్లాడగలగడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం, కొత్త విషయాలు తెలుసుకునేందుకు సంబంధిత రంగాలకు చెందిన నిపుణులతో బిడియపడకుండా వ్యవహరించడం వంటివి అవసరం.


మరింత సమాచారం తెలుసుకోండి: