తప్పుడు సమాధానం గుర్తిస్తే ఒక్కో ప్రశ్నకు 1/3 మార్కు చొప్పున తగ్గించనుంది. యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ తరహా విధానాన్ని అనుసరించనుంది. సరైన సమాధానాలు రాకున్నా కొందరు అభ్యర్థులు తెలియని వాటికి కూడా ఏదో ఒక ఆప్షన్ సమాధానాన్ని గుర్తిస్తూ అదృష్టవశాత్తు అది కరెక్టు అయితే అధిక మార్కులు పొందుతున్నారు. దీనివల్ల నిజంగా కష్టపడి చదివినవారు నష్టపోతున్నారు. దీన్ని నిరోధించడానికి నెగటివ్ మార్కుల విధానాన్ని ఎంచుకోవాలని మంగళవారం జరిగిన ఏపీపీఎస్సీ బోర్డు సమావేశం నిర్ణయించింది. చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు సీతారామరాజు, ప్రొఫెసర్ జి.రంగజనార్దన్, ప్రొఫెసర్ కె.పద్మరాజు, గుర్రం సుజాత, కె.విజయకుమార్, రూప, కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి పాల్గొన్నారు.



సమావేశానంతరం చైర్మన్, ఇతర సభ్యులు మీడియాతో మాట్లాడుతూ బోర్డు తీసుకున్న పలు కీలక నిర్ణయాలు వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగిన 1999 గ్రూప్-2 మెరిట్ జాబితా తయారీ, 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాల వెల్లడిపై చ ర్చించారు. 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను రెండునెలల్లోపు విడుదల చేయనున్నారు.ప్రభుత్వం అనుమతించిన 4,009 ఖాళీ పోస్టులలో 748 ఏఈఈ పోస్టులకు ఇటీవల నోటి ఫికేషన్ వెలువరించినా ఇతర పోస్టులకు సంబంధించి చర్యలువేగిర పర్చాలని నిర్ణయించారు.




ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం గతంలో జీఓ ఇచ్చింది. ఆ వయోపరిమితి గడువు ఈ నెలాఖరు తో ముగియనుంది. గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులకు ఇంకా నోటిఫికేషన్లు జారీచేయాల్సి ఉన్నందున ఆ నోటిఫికేషన్లు విడుదల జాప్యమైతే వయోపరిమితి పెంపు జీఓను మరో ఏడాది పొడిగింపునకు రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు. గ్రూప్-2 పోస్టులు 750, గ్రూప్-3లో పంచాయతీ కార్యదర్శుల పోస్టులు 1,056 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్లు ఆలస్యమై మరో ఏడాది సమయం పట్టే పక్షంలో ప్రస్తుతం వయోపరిమితి మించి పోయేవారు కూడా ఆపోస్టులకు దరఖాస్తు చేసుకొనేలా అర్హత కల్పిస్తూ కొత్త ఉత్తర్వుల కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనివల్ల ఈ నెలాఖరుతో 40 ఏళ్లు నిండిపోయే వారికి రానున్న ఏడాదిలో విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లకు అర్హత కల్పించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: