రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఎస్సీ యువత కోసం ఒక్కోటి రూ.20కోట్లతో అంబేడ్కర్‌ నైపుణ్య కేంద్రాలను నిర్మించనున్నట్లు సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు వెల్లడించారు. ఇతర సామాజికవర్గ యువత శిక్షణ కార్యక్రమాలకు సైతం అనువుగా ఉండేలా వీటిని విస్తరింపజేస్తామన్నారు. భిన్న రంగాల్లో యువతకున్న ఉపాధి అవకాశాలు, అవసరమైన నైపుణ్య శిక్షణ అంశంపై కార్యాచరణ అమలుచేస్తామన్నారు. ఇప్పటికే 4,800మంది యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉపాధి చూపామన్నారు. వారక్కడ రాణించలేక తిరిగి వచ్చేయకుండా ‘ఉద్యోగానంతర ఆసరా’ కార్యక్రమాన్ని అమలుచేయనున్నామని తెలిపారు. శుక్రవారం(జ‌న‌వ‌రి 20) మంత్రి రావెల వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సాంఘిక సంక్షేమ, ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ అధికారులతో సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాల గురించి వెల్లడించారు.


Image result for kishore babu ravela

ఉపాధి కల్పన సంస్థలు, నిరుద్యోగులు, వారికి అవసరమైన శిక్షణ ఇవ్వగల సంస్థలు ఈ ముగ్గురినీ ఒకే వేదికపైకి తెచ్చేలా యువ బాట (యూత్‌ వే) పేరుతో గవాక్షాన్ని ఏర్పాటుచేసినట్లు ప్రకటించారు. ఇందులో నమోదు చేసుకున్న నిరుద్యోగులకు వారి అర్హతలను బట్టి ఉపాధి మార్గాలను చూపుతామన్నారు. ప్రతి జిల్లాలోనూ జాబ్‌మేళాలు నిర్వహిస్తామని, సివిల్‌ ఇంజినీరింగ్‌ చేసిన గిరిజన నిరుద్యోగులకు గుత్తేదారు అభివృద్ధి కార్యక్రమం కింద శిక్షణనిస్తామని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ రూ.10లక్షలలోపు నిర్మాణ పనులు కేటాయించేలా ఏర్పాట్లుచేస్తామన్నారు. దళిత నిరుద్యోగ యువతకు రుణాల ద్వారా బస్సులను సమకూర్చి, వాటిని ఆర్టీసీ మంచి ఆదాయ మార్గంలో నడిపేలా చూస్తామని చెప్పారు. రుణాల పంపిణీలో బినామీలు లేకుండా చూస్తాం.. ఎస్సీ ఆర్థిక సంస్థ, ముద్ర రుణాలు, స్టాండప్‌ ఇండియా రుణాలనిచ్చే బ్యాంకులను ఒకే వేదికపైకి తేవడం ద్వారా కచ్చితమైన వారికే లబ్ధి అందేలా చూస్తామన్నారు. కేంద్రప్రభుత్వ సంస్థలు వస్తు, సేవలను 24% చిన్నతరహా పరిశ్రమలు.. అందులోనూ 4% దళితుల పరిశ్రమల నుంచే సేకరించాలని కేంద్రం జీఓ జారీచేసిన నేపథ్యంలో..అలాంటి పరిశ్రమలను ఏర్పాటుచేసుకునే దళిత నిరుద్యోగులకు సాయమందిస్తామని మంత్రి రావెల వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: