సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను హైకోర్టు తప్పుబట్టింది. దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం జారీ చేసిన ప్రకటనను కోర్టు కొట్టేసింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను అనుమతిస్తూ సింగరేణి యాజమాన్యం గత డిసెంబర్‌లో ప్రకటన వెలువరించింది. దీంతో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన వారి వారసులకు ఉద్యోగం ఇచ్చేలా మార్గదర్శకాలు వెలువరించింది. అయితే దీనిపై గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో సవాల్‌ చేశారు.



ఈ ప్రకటన వల్ల సుమారు 30వేల ఉద్యోగాలు వారసులకు వెళ్లిపోతాయని.. దీంతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ తరపున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. స్వచ్ఛంద పదవీ విరమణకు కేవలం 5వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని.. వాటివల్ల నిరుద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదని కోర్టుకు స్పష్టం చేశారు. అయితే అడ్వకేట్‌ జనరల్‌ వాదనతో విభేదించిన హైకోర్టు వారసత్వ ఉద్యోగాల ప్రకటనను కొట్టివేసింది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: