ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికా నాసా అంతరిక్ష పరిశోధనా సంస్థ పోటీల్లో ఎవరికైనా ప్రపంచంలోనే ద్వితీయ స్థానం దక్కితే? ఆ అరుదైన ఘనత, గౌరవం రాష్ట్ర విద్యార్థిని, మెదక్‌కు చెందిన రమ్యకు దక్కింది. మే 25న అమెరికాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు రమ్మంటూ ఆమెకు ఆహ్వానం కూడా అందింది. సర్వత్రా ప్రశంసల జల్లుతో రమ్య ఉబ్బి తబ్బిబ్బవుతున్నా.. తాను ఆమెరికాకు వెళ్లగలనా? అనే ఆందోళన ఆమె మదిని తొలిచివేస్తోంది. కారణం.. రమ్య పేదింటమ్మాయి కావడమే! అమెరికా వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు, సదస్సులో ఇవ్వనున్న ప్రదర్శన కోసం డబ్బులు లేక ఆ కుటుంబం ఆవేదన చెందుతోంది. మెదక్‌ పట్టణంలోని పిట్లంబే్‌సకు చెందిన జ్యోతి, జీవన్‌గౌడ్‌ దంపతుల రెండో కుమార్తె రమ్య నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీలో బీటెక్‌ కంప్యూటర్‌సైన్స్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది.



అంతరిక్షానికి వలసలు... మానవ ఆవాస యోగ్యత, స్పేస్‌ సెటిల్‌మెంట్‌ (నాసా ఎయిమ్స్‌) అంశాలపై విహాన్‌ ప్రాజెక్టు పేరిట కళాశాలకు చెందిన వెంకటేశ్‌, రమ్య (మెదక్‌), విష్ణుప్రియ (ఖమ్మం), ప్రణయ్‌ (వరంగల్‌), ఆకాశ్‌తో కూడిన బృందం పరిశోధనలు జరిపింది. థీమ్‌ తయారు చేసి నాసాకు ప్రాజెక్టు రిపోర్టును కళాశాల ద్వారా పంపారు. ఈ బృందానికి గైడ్‌గా ఫిజిక్స్‌ ఉపాధ్యాయుడు రాకేశ్‌ రోషన్‌ వ్యవహరిస్తున్నారు. నాసా పోటీల్లో 150 దేశాల నుంచి విద్యార్థులు పాల్గొనగా.. మార్చి 28న వెల్లడించిన ఫలితాల్లో బాసర ట్రిపుల్‌ ఐటీ నుంచి విహాన్‌ ప్రాజెక్టుకు ద్వితీయ స్థానం లభించింది. దీంతో అమెరికాలో జరిగే సదస్సులో ఈ విద్యార్థులకు పాల్గొనే అవకాశం దక్కింది. అయితే సదస్సులో పాల్గొనడానికి వీరికి పేదరికం అడ్డు వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని నాసాకు వెళ్లడానికి ప్రయాణ ఖర్చులు, సదస్సులో ప్రదర్శనకు అయ్యే వ్యయం భరించుకోవాలని రమ్య కోరుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: