వేల మైళ్ల దూరం.. ఖరీదైన ప్రయాణం.. దాతలు సహకరిస్తే తప్ప దరి చేరని కూలీ జీవితం. వలస వెళ్లి కూలీనాలి చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్న పేద దంపతుల బిడ్డ వినయ్‌కుమార్‌ రోబో టెక్నాలజీలో ప్రతిభ కనబరుస్తున్నాడు. అమెరికాలోని మిచగానలో జరగనున్న రోబో ఫెస్ట్‌వరల్డ్‌ ఛాంపియన పోటీలకు ఎంపికైన వినయ్‌ తన ప్రతిభ చాటాడు. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేటకు చెందిన సాయిలు, పోచమ్మ దంపతులు పూట గడవక మియాపూర్‌ వచ్చి కూలీ పని చేస్తూ పొట్ట నింపుకుంటున్నారు.



కొడుకు వినయ్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతూ విద్యలో రాణిస్తున్నాడు.రోబో టెక్నాలజీపై ఆసక్తి పెంచుకుని పలు ఎగ్జిబిట్‌లు రూపొందించాడు. ఈ క్రమంలో ఇటీవల సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీలో జరిగిన ఒక కార్యక్రమంలో నలుగురు స్నేహితులతో కలిసి రోబో ప్రదర్శన ఇచ్చాడు. ఆ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుని ఉత్తమంగా ఎంపికైంది. దీంతో అమెరికాలోని మిచిగాన లారెన్స టెక్నాలజీ యూనివర్సిటీలో నిర్వహించబోయే రోబో ఫెస్ట్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ పోటీలకు వారి ప్రాజెక్టు ఎంపికైంది. జూన 1న జరిగే పోటీలకు హాజరు కావాలని ఆహ్వానం అందింది. అయితే ఆర్థిక ఇబ్బందులతో విదేశీ ప్రయాణం వినయ్‌కు భారంగా మారింది. లక్ష్మీ కటాక్షం కరువైన సరస్వతీ పుత్రుడు ఇప్పుడు సహాయం చేసే వారి కోసం ఎదురుచూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: