గురుకుల టీజీటీ, పీజీటీ, పీడీ ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులకు ఈనెల 31న స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. హెచ్‌ఎండీఏ పరిధితో పాటు, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ వెబ్‌సైట్‌ ద్వారా సోమవారం (15వ తేదీ)లోగా పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఎ.వాణిప్రసాద్‌ సూచించారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రం మార్పుకు అనుమతించబోమని ఆమె స్పష్టం చేశారు. అదే విధంగా పరీక్షా కేంద్రంపై అభ్యర్థుల ఎంపిక ఎలా ఉన్నా, టీఎస్‌పీఎస్సీదే తుది నిర్ణయమని కార్యదర్శి పేర్కొన్నారు. కాగా, కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్ల భర్తీ కోసం ఆన్‌లైన్‌ సీబీఆర్‌టీ పరీక్షను ఆదివారం విజయవంతంగా నిర్వహించినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 26 పోస్టులకు 16708 అభ్యర్థులు, హెచ్‌ఎండీఏ పరిధిలో ఏర్పాటు చేసిన 49 కేంద్రాల్లో పరీక్ష రాశారని వాణిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: