గ్రూప్‌-2పై ఓయూ నిరసనలు పెల్లుబుకాయి. పరీక్షను రద్దు చేయాలని విద్యార్థులు చేపట్టిన నిరసనలతో ఓయూ క్యాంపస్‌ అట్టుడికింది. విద్యార్థుల అరెస్టులు, నిరసనలతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగళవారం ఓయూలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అవకతవకలు చోటు చేసుకున్న గ్రూప్‌-2 పరీక్షను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఓయూలో విద్యార్థులు ప్రధాన లైబ్రరీ నుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.



ఆర్ట్స్‌ కళాశాల వద్ద వినూత్న తరహాలో గుండుగీయించుకొని నిరసన తెలిపేందుకు పూనుకున్నారు. ఇంతలోనే రంగప్రవేశం చేసి ఓయూ పోలీసులు మానవతారాయ్‌, భీమ్‌రావ్‌, మరికొందరు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాయ్‌ మాట్లాడుతూ పోటీ పరీక్షను సక్రమంగా నిర్వహించకుండా నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోందని, ప్రభుత్వంలోని పెద్దలు తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు నిరుద్యోగులను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంజి శ్రీనివాస్‌, మస్కాపురం నరేష్‌, బూసిపల్లి లచ్చిరెడ్డి, రామకృష్ణ, యుగేందర్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: