మధుమేహం నడకపెరటి చెట్టు వైద్యానికి పనికి రాదన్నది సామెత! ఇది ‘నడక’కు చక్కగా వర్తించేలా ఉంది! నిజానికి నడక చక్కటి వ్యాయామం. ఎంతో సహజమైన వ్యాయామం. ప్రత్యేకమైన జంజాటాలేవీ లేకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా చెయ్యటానికి వీలైన, తేలికైన వ్యాయామం. అన్నింటినీ మించి.. ఎన్నో రకాల ప్రయోజనాలను మోసుకొచ్చే బహుళార్థ సాధక వ్యాయామం. అందుకే నడక అందరికీ మంచిది, మధుమేహులకు మరీ మంచిదని వైద్యరంగం స్పష్టంగా నొక్కి చెబుతోంది. నడక.. చాలా తేలికైన, చవకైన.. అందరికీ అందుబాటులో ఉండే.. అందరూ చేయదగిన వ్యాయాయం.

 

ఇది మధుమేహులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజానికి ఈ విషయం తెలియక కాదు, పొద్దున లేవటానికి బద్ధకించటం వల్లనే చాలామంది నడకకు దూరంగా ఉండిపోతున్నారు. ఆఫీసులో పనిచేసి అలసిపోయి వచ్చినవారు సేద తీరటానికి కాసేపు టీవీ చూడటంలో తప్పులేదు గానీ అదే పనిగా గంటల తరబడి కూచోవటంతోనే ఇబ్బంది. పైగా టీవీ చూసేటప్పుడు మధ్యమధ్యలో చిరుతిళ్లూ తింటుంటారు. సీరియల్స్‌, సినిమాలు, ఆటల వంటి కార్యక్రమాలు చూసి.. భోజనం చేసి నిద్రపోవటానికి ఆలస్యమవుతుంది. ఉదయం నిద్రలేవటమే ఆలస్యం.. ఉరుకులు పరుగులు. నడవాలనే ఆలోచన మదిలోకి రాగానే ‘రేపటి నుంచి తప్పకుండా’ అనుకోవటం. ఇదీ వరస. దీంతో శరీరానికి శ్రమ తగ్గి రకరకాల సమస్యలకు దారితీస్తుంది. మధుమేహులకైతే రక్తంలో గ్లూకోజు స్థాయులు శ్రుతిమించుతాయి.

 

మధుమేహం.. దీర్ఘకాలిక సమస్య. కాబట్టి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ.. రక్తంలో గ్లూకోజు మోతాదులను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఇందుకోసం ఆహార నియమాలు శ్రద్ధగా పాటించాలి. మాత్రలు, అవసరమైతే ఇన్సులిన్‌ కూడా వాడుకోవాలి. వీటితో పాటు నిత్యం కొంత వ్యాయామం అవసరం. ఇవన్నీ తెలిసినా కూడా చాలామంది మధుమేహ నియంత్రణలో వెనకబడి సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. రకరకాల దుష్ప్రభావాల బారినపడుతున్నారు. ముఖ్యంగా మధుమేహాన్ని నిర్లక్ష్యం చేసిన కొద్దీ గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల జబ్బులు.. వీటన్నింటినీ మించి చూపు దెబ్బతినటం వంటి తీవ్ర సమస్యలు మొదలవుతాయనీ తెలిసినా ఎందుకు వెనకబడుతున్నారన్నది కీలకమైన ప్రశ్న. దీనికి ఒకటే సమాధానం.


చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను గుర్తుంచుకుని ఆహారం, మందులు, వ్యాయామం.. మూడింటికీ పూర్తి ప్రాధాన్యం ఇవ్వటం అవసరం.మొదలుపెట్టేముందునడకను ఎవరైనా, ఎప్పుడైనా మొదలుపెట్టొచ్చు. 45 ఏళ్ల లోపు వారికి ఎలాంటి పరీక్షలు అవసరం లేదు కూడా. అయితే 45 ఏళ్లు దాటినవారు.. అలాగే నడిస్తే ఆయాసం, గుండెనొప్పి, అధిక రక్తపోటు వంటి సమస్యలు గలవారు మాత్రం ముందుగా డాక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: