మీరు పాలు తాగుతున్నారా ? అయితే...ఒక్క క్షణం ఆగండి. మీరు తాగే మిల్క్ ఎంత సురక్షితమైనవి ? ఏ మేరకు స్వచ్ఛమైనవని ? ఈ విషయంపై మీరెప్పుడైనా ఓసారి ఆలోచించారా ? ఆలోచిస్తే సరే...లేదంటే ఇప్పటికైనా ఆలోచించడం మొదలు పెట్టండి. ఎందుకంటే తెల్లనివన్నీ పాలు కాదని పెద్దవాళ్లు చెప్పిన మాట... ఇప్పుడు అక్షరాల నిజమవుతోంది. అడుగడుగునా పాలకల్తీ జరుగుతోందని ఏదో మామూలుగా చెప్పడం కంటే అది జరుగుతున్న విధానం తెలుసుకుంటే గుండెలు అదరాల్సిందే.

 

మీ చిన్నారికి ప్యాకెట్‌ పాలు పట్టిస్తున్నారా..?, స్వచ్చమైనవేనని ధైర్యంగా తాగిస్తున్నారా..?పొద్దున లేవగానే టీ, కాఫీ తాగుతున్నారా.? అలవాటైనదేగా అని లైట్‌ తీసుకుంటున్నారా..? ప్రతిరోజూ వాడేవేగా అని అనుకుంటున్నారా..? పట్టించుకోకుండా పదే పదే తాగేస్తున్నారా.? అయితే ఒక్క క్షణం ఆగండి, అసలైన నిజాలను గుర్తించండి. లేదంటే మీరు డేంజర్‌లో పడినట్లే. అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. అచ్చంగా అసలైనవే అనిపిస్తాయి. నమ్మితే రోగాల్లో ముంచేస్తాయి. చూడటానికి తెల్లగానే ఉంటాయి. అసలైన వాటిలో ఉండేవేవీ ఉండవు. అక్రమార్జన కోసం అడ్డదారులు. పాల తయారీలో కల్తీ దందాలు. చారెడు చక్కెర, దోసెడు యూరియా, సరిపడా సర్ఫ్‌, అదనంగా కాస్త ఆయిల్‌. రసాయనాలతో తయారవుతున్న పాలు. ప్రజల ప్రాణాలు తీస్తున్న వ్యాపారులు. తెల్లని పాలలో నల్లని కోణం. కనిపించని కాలకూట విషం.

 

పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తీసుకునేది పాలు. ఉదయం నిద్ర లేచింది మొదలు..రాత్రి నిద్రపోయే వరకు వివిధ సందర్భాల్లో ప్రతి ఒక్కరూ పాలు తాగుతుంటారు. అందరికీ అమృత తుల్యంలా కన్పించే పాలు ఇప్పుడు విషంలా మారిపోతున్నాయి. కాదు..కాదు అలా మార్చేస్తున్నారు. దీంతో సంపూర్ణ ఆహారం కాస్తా ప్రాణాల తీసే కాలకూట విషంలా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పాలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. కానీ, ఇలాంటి చోట పాల కల్తీ ఏ స్థాయిలో జరుగుతోందో తెలుసుకుంటే గుండె గుభేల్ మనాల్సిందే. అవును...పాలను కల్తీ చేసే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.

 

కల్తీ పాల దందాపై ఇప్పటికే ఎన్నో వార్తలు విన్నాం, చూశాం. మరెంతో మంది అక్రమార్కుల గురించి తెలుసుకున్నాం. వారు అరెస్టయిన దృశ్యాలను చూశాం. అయినా... వారిలో మార్పు రావడంలేదు. ఎంతమంది పట్టుబడినా ఇప్పటికీ అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. పాలను కల్తీ చేస్తూనే ఉన్నారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూనే ఉన్నారు. తాజాగా మరికొందరు అక్రమార్కుల గుట్టు రట్టయింది. యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో కల్తీ పాలు తయారు చేస్తున్న ఓ ముఠా పాపాల పుట్ట పగిలింది. అడ్డంగా పోలీసులకు బుక్కయింది. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...  తయారీ కేంద్రంలోని సరంజామాను చూసి స్టన్నయ్యారు. వంట నూనెతోపాటు ఇతర కెమికల్స్‌ ఉపయోగించి పాలను తయారు చేస్తున్న విధానాన్ని చూసి ఖంగుతిన్నారు.

 

ఇటు.. రాజధాని హైదరాబాద్‌లోనూ ఇలాంటి అక్రమార్కులే గుట్టుచప్పుడు కాకుండా... ఫేక్‌ మిల్క్ బిజినెస్‌ నడిపిస్తున్నారు. తెల్లగా ఉంటే చాలు అమ్మేయవచ్చంటూ... మాదన్నపేటలో నకిలీ పాలను యథేచ్ఛగా తయారు చేస్తోంది ఓ ముఠా. అయితే... పాల కల్తీకి ఈ ముఠా పాటిస్తున్న పద్ధతి మాత్రం అందరిలా లేదు. యూరియా, ఆయిల్‌, కెమికల్స్‌ వాడకుండా కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశారు. పౌడర్‌ను ఉపయోగించి వందల కొద్దీ లీటర్ల పాలను తయారు చేస్తున్నారు. అవన్నీ నిజమైన పాలేనని నమ్మిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. కానీ ఎస్‌వోటీ పోలీసుల ఎంట్రీతో వీరి దందాకి ఎండ్‌ కార్డ్‌ పడింది.

 

అయితే.. ఇది ఒక్క హైదరాబాద్‌, తెలంగాణలో మాత్రమే జరుగుతున్న తంతు అనుకుంటే పొరపాటే. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడాలేదు.. దేశవ్యాప్తంగా ఇలాంటి నకిలీ దందాలను వ్యాపారులు దర్జాగా కొనసాగిస్తున్నారు.  తెల్లనివన్నీ పాలేనని నమ్మిస్తూ నల్లని విషాన్ని ప్రజల ఒంట్లోకి చేర్చుతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: