అదేపనిగా ఆలోచిస్తూ నిద్రను దూరం చేసుకోవడం ఒత్తిడిగా ఉన్నప్పుడు చాలామంది చేసే పని. నిద్రలేమి దీనిపై ఇంకా ప్రభావం చూపిస్తుంది. సరిగ్గా నిద్రపోకపోతే దేనిమీదా ఏకాగ్రత కుదరదు. పొరపాట్లు ఎక్కువగా చేస్తాం. వీటన్నిటితో ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. అందుకే దాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాలి. అవసరం అనుకుంటే నిపుణుల సలహాతో ఉపశమనం పొందే పద్ధతుల్ని ఆచరణలో పెట్టాలి.

 

తీసుకునే ఆహారం మన మనసుపై ప్రభావం చూపుతుంది. ఇది ఒత్తిడికీ వర్తిస్తుంది. చికాగ్గా, ఒత్తిడిగా ఉన్నప్పుడు చక్కెరా, కెఫీన్‌ ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. శీతల పానీయాలు తాగడం, చిప్స్‌ తినడం, అతిగా స్వీట్లు తినేయడం అసలు చేయకూడదు.ఏదయినా సమస్య వచ్చి, ఒత్తిడికి గురయినప్పుడు స్నేహితులతో మాట్లాడటం అనేది మంచి ప్రయత్నమే. అయితే సమస్య గురించే చర్చిస్తూ ఉంటే ఆందోళన ఎక్కువవుతుంది. పరిష్కారం దిశగా మాటలు కొనసాగాలి. అప్పుడే ప్రయోజనం.

 

సాధారణంగా పనులతో సతమతమవుతున్నప్పుడే ఒత్తిడి ఆవరిస్తుంది. దీన్ని గ్రహించకుండా పనులు చేసుకుంటూ పోతే సమయం మిగలకా, విశ్రాంతి దొరక్క ఒత్తిడి కోరల్లోనే ఉండిపోతాం. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురవుతోంటే వెంటనే కొన్ని పనుల్ని తగ్గించుకోవాలి. కొన్ని పనులు వాయిదా వేయండి. సంగీతం, ధ్యానం వంటివి రోజువారి జీవితంలో భాగం చేసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: