మనిషి పరిపూర్ణమైన శాశ్వత ఆనందం పొందాలి అంటే యోగాకు మించిన సాధనం మరొకటి లేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి చూపించిన ఈ యోగాసనాల ప్రక్రియ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనం బయట పడవచ్చు. అయితే ఈ యోగాసనాలు వేసేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అన్న విషయం చాలామందికి తెలియదు. 

ప్రతి రోజు యోగాకు గంట సమయం కేటాయించాలి. దానిలో అరగంట ఆసనాలకు, పది నిమిషాలు ప్రాణాయామం, ఇరవై నిమిషాలు ధ్యానంకు కేటాయించుకున్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి.  యోగాను చేస్తున్నాము కదా అని మన అనారోగ్యానికి సంబంధించి వాడుతున్న మందులను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఈయోగాసనాలు ఎనిమిది నుంచి 60 సంవత్సరాల వాళ్లు మాత్రమే  చేయాలి. తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాతే యోగాసనాలు వేయాలి. ఆసనాలు వేసే ముందుగా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. తెల్లవారుజామునే ఆసనాలు వేయడం వలన ఆ సమయంలో గాలిలో ప్రాణ శక్తి ఎక్కువగా వుంటుంది కాబట్టి ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. 

గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకుని యోగాసనాలు వేయడం మంచిది అని అంటారు. అంతేకాదు శబ్దాలు, గోలలు లేకుండా వుండే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. పలుచటి బట్ట నేలపై పరిచి పద్మాసనం లేదా సుఖాసనం వేయడం ద్వారా యోగా అభ్యసించడం మంచిది.  ఈ యోగా ఆసనాలు వేస్తున్నప్పుడు ప్రశాంతంగా కనులు మూసుకోవాలి. అంతేకాదు ధ్యాస శ్వాసమీదే నిలపాలి. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలకు, పీల్చినపుడు ముందుకు వస్తుందో లేదో గమనించాలి.  ఆసన ప్రారంభ సమయంలో పద్మాసనం, వజ్రాసనం ఏదైనా వేయవచ్చు.

ఆసనం ఎప్పుడూ నెమ్మదిగా వేయాలి. ఏమాత్రం తొందర పడకూడదు. వేసిన ఆసనంలో కొద్ది సెకన్ల పాటు అలాగే వుండాలి. ఆసనం వేసేటపుడు ఎంత నెమ్మదిగా వేస్తామో అంతకంటే నెమ్మదిగా మామూలు స్థానంలోకి రావాలి. గాలి పీల్చటం, వదలటం వంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలటం, పీల్చటం చేయకూడదు. ప్రతిదీ నెమ్మదిగా, సరళంగా ప్రశాంతంగా చేయాలి. ఏ ఆసనం అయినా సరే రొప్పుతూ, ఆయాస పడుతూ చేయకూడదు. యోగాసనాలు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అవి సక్రమంగా వేయకపోతే అనేక దుష్ఫలితాలు ఏర్పడతాయి. అందువల్ల యోగాసనాలు వేసేవారందరూ ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..


మరింత సమాచారం తెలుసుకోండి: