ఆ కళ్లల్లో నిర్లిప్తత తప్ప.. ఆ చూపుల్లో యాంత్రికపు కదలికలు తప్ప ఎలాంటి జీవం లేదు.

అంతా అర్థమైపోయింది.. మనుషులందరూ అర్థమైపోయారు.. ఎవరెప్పుడు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తారో కూడా ముందే చెప్పేయగలుగుతున్నాం. అందర్నీ కేటగరైజ్ చేసేశాం. మన expectationsకి తగ్గట్లే మనుషులూ, సమాజం నడుస్తోంది. ఇంకా ఎక్కడి నుండి వస్తుంది కళ్లల్లో క్యూరియాసిటీ, ఆలోచనల్లో ఆసక్తీ?

చిన్న పిల్లలు ప్రతీదీ ఆశ్చర్యంగా చూడడం చూసి… మనమూ కాసేపు వాళ్లల్లో లీలమైపోతాం. అలా చిన్నప్పటి నుండి జీవితంలో చూడాల్సినవి అన్నీ చూసేసి లైఫ్ అంటే ఆసక్తి చచ్చిపోయే ఉంటుంది చాలామందికి!
జీవితంలో మనమేం సాధించామో లెక్కలేసుకుంటూ ఉంటాం గానీ.. ఇప్పటివరకూ ఏం కోల్పోయామో ఎప్పుడూ ఆలోచనకి కూడా చిక్కదేమో! ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ ఛెక్ చేసుకునీ.. కావలసిన వస్తువులన్నీ కొనేసుకునీ జీవితం నదిలా ప్రవహిస్తోందన్న భ్రమలో ఉంటున్నాం గానీ అది ఎప్పుడో కదలని నిశ్చలమైన తటాకమై మురికి పట్టిపోయిందని గమనించనే లేకపోతున్నాం.

సాయంత్రానికి కొంత సంతృప్తి మూటగట్టుకుంటే ఈరోజు హాపీనే అనేసుకుంటే.. అంతకన్నా మనం explore చెయ్యలేకపోవడం వల్ల మరుగునపడిపోయిన ఆనందం గురించి ఎలా తెలుస్తుంది? మొనాటనీ లైఫ్‌లో అలాంటి చాలానే ఆనందాలు కనుమరుగైపోయినా మనకు స్పృహ కూడా ఉండకపోవడంలో ఆశ్చర్యం కూడా ఉండదనుకోండి…

“జీవితం అంటే ఇదీ” అని నాబోటి వాడు కష్టపడమని చెప్పీ.. మరొకడు డబ్బు సంపాదించి మంచి పొజిషన్‌లో ఉండమని చెప్పీ.. ఎవరికి వారు స్వంత డెఫినిషన్లు, లైఫ్ స్ట్రేటజీలు ఫాలో అవుతూ విశాలమైన జీవితాన్ని కొన్ని ప్రీ-డిఫైన్డ్ ఆలోచనల బంధీఖానాలో బంధిస్తున్నప్పుడు ఇంకా జీవితం అంతకన్నా ఏం వికసిస్తుంది?

చిన్న వయస్సులోనే ప్రతీ దానిపై నాలెడ్జ్ వచ్చేస్తుంది.. అన్నింటిపై రెడీ‌మేడ్ అభిప్రాయాలకు కొదవే లేదు. ఇంకా తెలుసుకోవలసిందేముంది… తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కడ ఉంది.. తెలుసుకునే సంస్కారం అస్సలు మిగిలుంటేగా.. మనం మేధావులం.. అన్నీ తెలుసు.. ఈ భ్రమలోనే జీవితం పట్ల ఆసక్తీ చాలావరకూ చచ్చిపోయింది.

మనిషిని చూస్తే.. కళ్లు, ముక్కూ, భుజాలు, శరీరం.. మెడికల్ నాలెడ్జ్ వల్ల ఆ శరీరం వెనుకాల ఉండే ఫ్లష్, రక్తమాంసాలూ, రకరకాల ఆర్గాన్లూ, వాటి పనితీరు, హార్మోన్ల imbalance వల్ల వచ్చే ఎమోషనల్ ఛేంజెస్.. లైఫ్ స్టైయిల్ సక్రమంగా లేకపోవడం వల్ల వచ్చే క్రానిక్ డిసీజెస్.. ఇలా మనిషి భౌతికంగానూ, మానసికంగానూ మన నాలెడ్జ్‌కి మించి అర్థం కాకపోయినప్పుడు అస్సలు మనుషులు మాంసపు ముద్దలుగానే కొన్నిసార్లు కన్పిస్తారేమో.. అలాగే “ఎవరి పిచ్చి వారికానందం” అని నవ్వుకుంటూ మెంటల్ పేషెంట్లగానూ ట్రీట్ చేస్తావేమో! కొన్నిసార్లు అన్పిస్తుంది “మనకు ఇంత లాజిక్, నాలెడ్జ్ అవసరమా” అని!

జ్ఞానం మాటున జీవితం ఆసక్తి కోల్పోవడం చాలా కొద్దిమందికే అర్థమవుతుంది. ఎందుకు జీవితం కొత్తగా లేదో, మనుషులు అతి కాజువల్‌గా కన్పిస్తున్నారో అర్థం అవడానికి ఇంత లోతుగా ఆలోచించే తీరికా, వేవ్‌లెంగ్త్ లేకపోవడం వల్ల జీవితాలు అలా మెకానికల్‌గానే ముగిసిపోతున్నాయి!!

మరింత సమాచారం తెలుసుకోండి: