ఈమధ్య కాలంలో చాలమంది సూప్ లు తాగడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.  అయితే మనం తీసుకునే సూప్ లలో కొన్ని గోంగూర ఆకులు వేసి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసి మనకు ఎటువంటి మలబద్ధ సమస్య ఉండదు అని చెపుతున్నారు.  గోంగూరలో ఉండే పీచు పదార్ధం మన గుండెకు ఎంతో మేలుచేస్తుంది.  శరీరంలోని కొవ్వును కూడ నియంత్రిస్తుంది ఈ గోంగూర.  ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండటం వలన రక్త ప్రసరణ సక్రమంగా ఉండటమే కాకుండా మన శరీరంలోని రక్తపోటును కూడ అదుపులో ఉంచడానికి ఈ గోంగూర సహకరిస్తుంది.  

ఈ గోంగూరలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వలన మన కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యల నుండి కూడ ఈ గోంగూర మనలను రక్షిస్తుంది. తెలుగువాళ్లకు ఏంతో ప్రీతికరం అయిన  నోరూరించే ఈ గోంగూర పచ్చడి లేకుండా ఆంధ్రుల భోజనం పూర్తి కాదు. గోంగూరతో ఊరగాయపట్టినా, పప్పు చేసినా, కూరల్లో వేసినా, మటన్ లో గోంగూర తగిలించినా ఆ రుచి అమోఘంగా ఉంటుంది. గోంగూర ఇష్టపడని తెలుగు వాడు ఉండడు. 

అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ గోంగూరలో అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేసే సత్తా ఉంది. ఈ గోంగూరలో విటమిన్ సి, ఎ, బి6 తో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు రకరకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే శక్తి పుల్లపుల్లని గోంగూరలో ఉంది అని పరిశోధనలు తెలియ చేస్తున్నాయి. 

గోంగూరలో క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి రోజు వారీ ఆహారంలో గోంగూర ఉండేలా జాగ్రత్త పడితే ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగడానికి గోంగూర సహకరిస్తుంది. గోంగూరను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకు కూడా గోంగూర అలవాటు చేయడం మంచిది. 

రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, షుగర్ లెవెల్స్ ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు గోంగూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ అత్యధికంగా ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను నివారించడానికి గోంగూర సహాయపడుతుంది. 

దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలి అంటే ఈ గోంగూర ఆకు మన ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..



మరింత సమాచారం తెలుసుకోండి: