సరైన ఆహారం శక్తివంతమైన దేహాన్ని నిర్మిస్తుంది. మానవ జన్మనిస్తూనే భగవంతుడు చక్కని ఆహారాన్ని ధాన్యాలు తృణ ధాన్యాల రూపంలో "శతాయుష్మాంభవః లేదా ధీర్ఘాయుష్మాంభవః' అంటూ బహుమానంగా పంటలుగా పండించుకొని కష్టించి వృద్ధిలోకి రమ్మంటూ బహుమానంగా ఇచ్చాడు. గరీబు ఆ ఆహారాన్ని కష్ఠపడుతూ పండిస్తూ చిరాయువుగా రోగాలు లేకుండా జీవిస్తున్నాడు.       

Image result for grains

మనిషి మనుగడ కోసం ఒక నాడు గరీబులు మాత్రమే తిన్నట్టి తిండికి నేడు నవాబుగిరీ రేటింగ్  దక్కుతుంది. వరిగలు, ఆర్క లంటే అసహ్యించుకున్న వాళ్లు, కొర్రలు, సామలను చిన్న చూపు చూసిన వాళ్లు సైతం వాటి కోసం ఆరాట పడే పరిస్థితి నెలకొంది. అంబలి తాగటం నామోషీగా ఫీలైన వాళ్లు సైతం తైదల కోసం తంటాలు పడుతుంటే, రొట్టెల రుచిని ఆస్వాదించలేకపోయిన ఎందరో ఇప్పుడు సద్దలు, జొన్నల కోసం ఎగబడుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఆరోగ్యం. ఆరోగ్యాన్ని అందించే ఎన్నో రకాల చిరుధాన్యాలు గ్లోబల్ మాయలో చిన్న చూపుకు గురై కనుమరుగైపోయాయి. 


Image result for grains with names

నేటి అనారోగ్యాలకు అవే ఔషధాలని తెలియటంతో మళ్లీ వెనక్కి చూడాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. దీంతో ఆలోచనలకు కూడా అందకుండా పోయిన చిరుధాన్యాలను గూర్చి గూగుల్‌లో వెతికి మరీ దొరకబుచ్చుకునేందుకు మనిషి ఆరాటపడు తున్నాడంటే వాటి గొప్పతనం ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రోజుకు గుప్పెడు మందు బిళ్లలు మింగినా నయంకాని రోగాలకు సహజసిద్ధ ఆహారమే దివ్యౌషధమని వైద్యులే స్వయంగా సలహా లు ఇస్తుండటంతో కాణీకి కూడ చెల్లవని విస్మరించిన వాటినే క్యూకట్టి మరీ కొనాల్సి వస్తుండటం ఊహించని పరిణామం. అంతలా అందరినీ ప్రభావితం చేసిన ఆ చిరు ధాన్యాలేంటో, వాటి ఉపయోగాలేమిటో, అందులో ఉండే సహజసిద్ధ పోషక విలువలేమిటో ఒకసారి చూద్దాం. 

Image result for grains with names

బోలెడు లాభాలు: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ఆహారం గింజ ధాన్యాలు. అందులో వరి , గోధుమలను ధాన్యాలని. కొర్రలు, అర్కలు, సామలు, వరిగలు, తైదలు, సజ్జలు, జొన్నలను చిరుధాన్యాలని పిలుస్తారు. చిరు ధాన్యాలలో వరి, గోధుమ కంటే అధిక రెట్లు పోషక విలువలు ఉంటాయి. మన శరీర అవసరాలకు సరిపడా పోషక శక్తిని అందిం చటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వరిలో కంటే కూడా ప్రోటీన్లు, పీచు పదార్థాలతో పాటు కాల్షియం, ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు విటమిన్లు అధికం గా ఉంటాయి. చిరు ధాన్యాలలో పీచు పదార్థం అధికం గా ఉండటం వలన నెమ్మదిగా జీర్ణం కావటంతోపాటు అదే స్థాయిలో శక్తిని విడుదల చేస్తాయి. అధికంగా శ్రమించే శక్తిని సైతం అందిస్తాయి.

 

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూడటంలో ఇవి కాపాడతాయి. వరితో పోలిస్తే సామలలో ఐరన్ 13 రెట్లు అధికంగా ఉండగా, రాగులలో 5రెట్లు ఎక్కువగా ఉంటుంది. చిరుధాన్యాలు వాడటం వలన షుగర్, ఒబేసిటీ (అధిక బరువు), గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి నయం కానీ రోగాలు దరి చేరటానికి కూడా సాహసం చేయక పోగా, రోగనిరోధక శక్తిని పెంచి , రక్త హీనతను తగ్గిస్తుండటం ఓ మిరాకిల్‌గా చెప్పవచ్చు. గ్లాసెడు రాగులలో ఉండే క్యాల్షియం రెండు గ్లాసుల పాలతో సమానంగా ఉంటుంది. దీంతో ఎముకలు, దంతాలు దృఢంగా అవుతాయి. అంతేగాక చిరుధాన్యాలు రక్తప్రసరణను నియంత్రిస్తాయి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. 

Image result for grains with namesకొర్రలతో షుగర్ కంట్రోల్: దాదాపు నలభై ఏళ్ల క్రితం వరకు పేదవాడి క్షుద్బాధను తీర్చిన కొర్రలు కాలక్రమేణా కనుమరుగయ్యాయి. వరికి , వాణిజ్య పంటలకు మనుగడ పెరగటంతో దాదాపుగా అంతరించిన ఈ కొర్రలు ప్రస్తుత తరుణంలో మార్కెట్‌ను పాలిస్తున్నాయి. కొర్రలను అన్నం, జావ, పాయసంలాగ వండుకుని తింటారు. ఇవి కొంచెం వగరుగా, గరుకుగా ఉంటాయి. వీటిలో వేడి స్వభావం ఉంటుంది కాబట్టి మజ్జిగతో కలిపి భుజించడం శ్రేయస్కరం. మధుమేహాన్ని అదుపులో ఉంచే ప్రధాన లక్షణం ఉండటంతోపాటు వాపు, కఫం తగ్గించటం, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని దరి చేరనివ్వకుండా చూస్తుంది. వంద గ్రాముల కొర్రల్లో 12.3 గ్రాముల ప్రోటీన్లు, 8 గ్రా ఫైబర్, 4.8 గ్రా కొవ్వు, 2.8  గ్రా ఇనుము, 3.3 గ్రా మినరల్స్, 31 గ్రా కాల్షియం, 473 గ్రా కాలరీస్ ఉంటాయి.

Image result for grains with names

బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సజ్జలు: జొన్నలతోపాటు సాధారణంగా పండించే పంటల్లో సజ్జలు ఒకటి. సజ్జ పిండితో సంక్రాంతి రోజు రొట్టెలు చేసుకోవటం తెలుగువాళ్ల ఆనవాయితీ. తినటానికి రుచిగా ఉండే సజ్జలు స్త్రీలలో సంక్రమించే బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించటంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. టైప్ 2 షుగర్‌ను నియంత్రించటంలోనూ, ఎముకలకు గట్టితనాన్ని ఇవ్వటంలోనూ ఉపకరిస్తుంది. ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఉంటాయి. అదే విధంగా క్యాల్షియంకూడా అధికంగా ఉంటుంది. వీటిలో కార్బోహైడ్రేడ్స్ 67గ్రా, ప్రోటీన్లు 11.8గ్రా, కొవ్వు 4.8గ్రా, మినరల్స్ 2.2గ్రా, పీచు పదార్థం 2.3గ్రా, క్యాల్షియం 42మి.గ్రా, ఐరన్ 11మి.గ్రా, క్యాలరీస్ 363 గ్రాముల చొప్పున ఉంటాయి.


Image result for grains with names


సామలతో దీర్ఘాయుష్: ప్రకృతి సహజంగా లభించే చిరుధాన్యాలలో సామలు ఒకటి. సామలను తినటం వలన నిత్య నూతనంగా, ఉత్తేజంగా ఉంటారని ప్రతీతి. వెనకటి రోజుల్లో ఇవి తిన్నవాళ్లు ఇప్పటికీ బలంగా ఉండటంతోపాటు దీర్ఘాయుష్యుతో జీవిస్తున్నారు. పళ్లు ఊడటం, జుట్టు నెరవటం, ఎంత వయసొచ్చిన కాళ్లు చేతులు దృఢంగా ఉండటం వంటి లక్షణాలను గమనించ వచ్చు. సామలతో వండే అన్నం చూడ్డానికి చమురుగా , తింటుంటే తియ్యగా కాస్త వగరుగా ఉంటుంది. వీటితో పరమాన్నం చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంపొందించటంలో సామలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో పీచు పదార్థం, ఖనిజ లవణాలు అధికంగా ఉండటం వలన నరాల బలహీనత, క్యాన్సర్ వంటి రోగాలను దరి చేరనివ్వవు. కఫం, పైత్యం హరించే లక్షణాలతోపాటు మలబద్దక సమస్యను సైతం పరిష్కరించే గుణం సామలకు ఉంటుంది. నిరు పేదలకు భగవంతుడు అందించిన ప్రసాదంగా భావించే ఈ సామలలో ప్రోటీన్లు 7.7గ్రా, ఫైబర్ 7.6గ్రా, కొవ్వు 5.2గ్రా, ఇనుము 9.3గ్రా, మినరల్స్ 1.5గ్రా, కాల్షియం 17గ్రా, క్యాలరీస్ 207గ్రాముల చొప్పున ఉంటాయి.

Image result for grains with names


వరిగలతో కొలెస్ట్రాల్‌కు : అధిక కొవ్వు, బరువుతో సతమతం అ య్యే వారికి వరిగలు ఒక వరం. చిరుధాన్యాలలో వరిగలది ప్రత్యేక రుచి. వరి , గోధుమలతో పోలిస్తే వరిగలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. పిండి పదార్థం చాలా తక్కువగా, ఫాస్పరస్ అధికంగా ఉండటంతోపాటు క్యాల్షియం, ఐరన్ సమానంగా ఉంటాయి. తినటానికి ఎంతో రుచికరంగా ఉండే ఈ వరిగలకు జ్వరాలు రాకుండా చేసే గుణంతో పాటు మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా ఆపటంతోపాటు మరెన్నో వ్యాధులు రాకుండా చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వరిగల్లో ప్రోటీన్లు 12.5గ్రా, ఫైబర్2.2 గ్రా, కొవ్వు 2.9గ్రా, ఐరన్ 0.8గ్రా, మినరల్స్ 1.9 గ్రా, క్యాల్షియం 14 మిల్లీ గ్రా, క్యాలరీలు 356 గ్రాముల చొప్పున ఉంటాయి.


Image result for grains with names

వీర్యవృద్ధి, దేహపుష్టికి : పేదోడి ఆకలిదప్పులను తీర్చటంలో తైదల(రాగులు)ది నేటికి కూడా ప్రత్యేక స్థానమే. మిగతా చిరుధాన్యాలు కాలక్రమంలో కనుమరుగు అయినప్పటికీ తైదలు నేటికీ గ్రామీణుల ఆహారపుటలవాట్లలో ప్రాధాన్యత పొందుతూ వస్తుంది. తైదలతో అంబలి, రొట్టెలు చేసుకోవటంతోపాటు ప్రస్తుతం జావగా కాసుకుని టీ మాదిరిగా తాగుతున్నారు. తైదలు కేవలం ఆకలిదప్పులను తీర్చటమేగాక వీర్యవృద్ధి, దేహపుష్టిని కలిగిస్తాయి. అంతేగాక బరువు తగ్గించటంలో, ఎముకలకు బలాన్ని చేకూర్చటంలో ప్రధానంగా ఉపకరిస్తుంది. వెంట్రుకలకు బలాన్ని ఇస్తుంది. రక్తహీనత ,మలబద్దకాన్ని దరిచేరనివ్వదు. మూత్రనాళాలను శుభ్రపరుస్తుంది. రుచి కోసం అంబలిలో మజ్జిగ కలుపుకుని సేవించడం గానీ, చక్కెర వేసుకుని జావ కాసుకుని తాగటం బాగుంటుంది. చలువ కావటంతో కేవలం వేసవి కాలంలోనే తైద వంటకాలకు పల్లెల్లో ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రతి వంద గ్రాముల తైదల్లో ప్రోటీన్లు 7.3గ్రా, కార్బోహైడ్రేడ్స్ 72గ్రా, కొవ్వు 1.3గ్రా, మినరల్స్ 2.7గ్రా, పీచు పదార్థం 3.6గ్రా, క్యాల్షియం 344మి.గ్రా, ఫాస్పరస్ 283మి.గ్రా, ఐరన్ 3.9మి.గ్రా, క్యాలరీస్ 336గ్రాముల చొప్పున ఉంటాయి.

Image result for grains with names

త్వరిత శక్తికి అర్కలే ఔషధం: గ్లూకోజ్ మాదిరిగా తిన్న వెంటనే శరీరానికి శక్తిని అందించటంలో ఆర్కల(అరికెలు) అన్నం ప్రధాన పాత్ర పోషిస్తుంది.వీటిని జావలా చేసుకుని తినాలి. అర్కల్లో అమైనోఆసిడ్‌లు అధికంగా ఉంటాయి. దీంతో రక్తనాళాలు పూడుకు పోయిన సందర్భంలో రక్తంలోని కొవ్వును కరిగించటంలో ఆర్కలు ఔషధంగా పని చేస్తాయి.ఇందులో ప్రోటీన్లు 8.3గ్రా, కార్బోహైడ్రేడ్స్ 65.9గ్రా, కొవ్వు 1.4గ్రా, మినరల్స్ 2.6గ్రా, ఫైబర్ 5.2గ్రా, క్యాల్షియం 35 మిల్లీ గ్రా, ఫాస్పరస్ 188మి.గ్రా, ఐరన్, 1.7మి.గ్రా, క్యాలరీస్ 353 గ్రాములు ఉంటాయి.


Image result for grains with names

శ్రమజీవుల ఆహారం జొన్న: పల్లె పట్టణం తేడాలేకుండా శ్రమజీవులు నిత్య ఆహారపు అలవాట్లలో జొన్నరొట్టెది ప్రత్యేక పాత్ర. వ్యవసాయ పనులకు వెళ్లే వారు ఉదయం రొట్టెలు , కొంచెం అన్నం తిని ఎంతో పని చేస్తుంటారు. జొన్నలు బలాన్ని , వీర్యవృద్ధిని కలిగించటంతోపాటు గుండె జబ్బులు ఉన్నవారికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. బియ్యం, గోధుమల మాదిరిగానే చాలామంది జొన్నలను అధికంగా వినియోగిస్తుండటం గమనార్హం. జొన్నల్లో ప్రోటీన్లు 10.4గ్రా, కొవ్వు 3.1గ్రా, పీచు పదార్థం 2గ్రా, ఐరన్ 5.4గ్రా, మినరల్స్ 1.6గ్రా, క్యాల్షియం 25మి.గ్రా, క్యాలరీస్ 329గ్రాములు ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: