మెదక్ లోకసభ ఉప ఎన్నికల బరిలో భారతీయ జనతా పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి నిలబడుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన వెంటనే పవన్ కళ్యాణ్ రాజకీయ అస్త్రం బయటకు వచ్చింది అంటూ వార్తల ఊహాగానాలు ఊపు అందుకున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ కు వీర విధేయుడిగా కొనసాగిన జగ్గారెడ్డికి భారతీయ జనతాపార్టీ టికెట్ రావడం వెనుక పవర్ స్టార్ చరిష్మా బాగా కలిసి వచ్చింది అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తన ‘జనసేన’ ఆవిర్భావానికి సంబంధించి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తనకు నచ్చిన నాయకులలో జగ్గారెడ్డి ఒకరు ని బహిరంగంగా చెప్పడమే కాకుండా ఆమధ్య జగ్గారెడ్డి పవన్ ను కలిసినట్లుగా వార్తలు వచ్చిన నేపధ్యంలో జగ్గారెడ్డి పవన్ తొలి రాజకీయ అస్త్రంగా మారతాడా? అంటూ ఊహాగానాలు వచ్చాయి.  ఇప్పుడు ఆ ఊహగానాలకు బలం ఇస్తూ భారతీయ జనతాపార్టీ జగ్గారెడ్డిని మెదక్ అభ్యర్ధిగా ప్రకటించడం వెనుక పవన్ రాజకీయ ఎత్తుగడ ఉన్నది అని అంటున్నారు. రాబోతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల రణరంగానికి తన ‘జనసేన’ ను సిద్ధం చేస్తున్న నేపధ్యంలో పవన్ జగ్గారెడ్డి కోసం డ్రస్ రిహార్సల్ గా జనం ముందుకు వచ్చి భారతీయ జనతాపార్టీ విజయానికి ముఖ్యంగా జగ్గారెడ్డి గెలుపుకు కృషి చేస్తాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ‘గోపాలా గోపాలా’ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ తన సినిమాలను మానుకుని మరోసారి ఈ రాజకీయ ఊబిలోకి రాడు అనే ప్రచారం కూడ ఉంది. పవన్ ప్రత్యక్షంగా మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో పాల్గొనకపోయినా పవన్ రాజకీయ అస్త్రం మాత్రం బయటకు వచ్చింది అనే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: