మన తెలుగు ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ప్రధమ స్థానంలో నిలుస్తుంది. వినాయక చవితి వచ్చింది అంటే చాలు అప్పటి వరకు నిశబ్దంగా ఉన్న ఇళ్ళల్లో కూడ చైతన్యం వచ్చి ప్రతి ఇంటా పండుగ కళ కనిపిస్తుంది. అన్నిరకాల పూజలకు వ్రతాలకు శుభకార్యాలకు ఆద్యుడు వినాయకుడు. గణపతిని పూజించకుండా మనం ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వర్తించo. గణనాధుడుని ప్రపంచములోని మానవులే కాదు వేదాలు ఉపనిషత్తులు కూడ వినాయకుడిని స్తుతించాయి. లక్ష్మిగణపతి – విధ్యా గణపతి – సిద్ధి గణపతి – తాండవ గణపతి – సింధూర గణపతి ఇలా రకరకాల రూపాలతో వినాయకుడు చవితి నుండి ప్రారంభమయ్యే నవరాత్రులలో పూజలు అందుకుంటాడు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే తొమ్మిది రోజులలోనూ గణపతిని స్మరిస్తూ పూజిస్తే సర్వ విజయాలు కలుగుతాయని నమ్మకం.  వినాయకుడు అంటే సర్వాంతర్యామి అని అదేవిధంగా సకల విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడని పరి పూర్ణమైన నమ్మకంతో వినాయకుడికి చేసే చవితి పూజ ఈ నాటిది కాదు కొన్ని యుగాల చరిత్ర కలది. ఆధ్యాత్మిక సారంతో కూడుకున్న గణపతి తత్వాన్ని అర్ధం చేసుకోవడం సాధారణమైన విషయం కాదు. ఋషులు, యోగులు కూడ గణపతి మంత్రాన్ని అనునిత్యం స్మరిస్తూ అద్వితీయమైన శక్తిని పొందిన సందర్భాలు మన పురాణాలలో మనకు కధలుగా వినిపిస్తాయి. ఈ చవితి రోజున ప్రతి ఒక్కరూ వినాయకుడిని పూజించే ‘శుక్లాం బరధరం విష్ణు’ మ్మంటూ సాగే శ్లోకంలో వినాయకుడిని విష్ణు రూపంలో కూడా ఆరాధిస్తాం.  హైందవ మతంలో పుట్టిన ప్రతి భారతీయుడు గొప్ప, పేద అనే తారతమ్యం లేకుండా విధిగా జరుపుకునే ఏకైక పండుగ వినాయక చవితి. మాములుగా మన పూజలలో భగవంతుడికి నైవేద్యం ఎంత పెట్టాలి అన్న విషయంలో ఎటువంటి నిభందన ఉండదు. కాని వినాయకుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎవరి శక్తి మేరకు వారు ఎన్ని రకాల పదార్ధాలు చేయగలిగితే అన్ని రకాల పదార్ధాలతో గణనాధుడికి నైవేద్యం పెట్టాలి అని అంటారు. దీనికి కారణం గణపతి నైవేద్య ప్రియుడు అని మన వేదాలు చెపుతున్నాయి. అంతేకాదు గణపతికి పెట్టే నైవేధ్యంలో దోస పండు తప్పనిసరిగా పెట్టాలని అంటారు. వినాయకుడికి ఎంత ఘనంగా పూజ చేసినా పూజ చివరిన గుంజీలు తీయకుండా పూజను ముగిస్తే గణపతి అనుగ్రహించడు అని పెద్దలు చెపుతూ ఉంటారు.  వినాయకుడిని మన హిందువులు మాత్రమే ఆరాధిస్తారు అని అనుకోవడం పొరపాటు మలేషియా, నేపాల్, జపాన్, ధాయిలాండ్, అమెరికా లాంటి అనేక దేశాలలో మన బొజ్జ గణపతికి ఆలయాలు ఉన్నాయి. ఐర్లాండ్ కు చెందిన లాంగ్ హిల్స్ అనే వ్యక్తి వినాయకుడి పై ఉన్న భక్తితో ప్రత్యేకంగా రకరకాల వినాయక రూపాలతో 22 ఎకరాలలో మనదేశం నుండి శిల్పులను రప్పించి గ్రానేట్ రాయి పై రకరకాల వినాయక రూపాలను మలిచి ఒక అందమైన పార్క్ గా మార్చి తన భక్తిని చాటుకుంటున్నాడు. కేవలం ఒక్క జపాన్ దేశంలోనే దాదాపు 250 వినాయకుడి ఆలయాలు ఉన్నాయి అంటే మన గణపతి ఖ్యాతి ఏ స్థాయిలో ఉందొ అర్ధం అవుతుంది. ఆయుర్వేద శాస్త్రం రీత్యా గణపతికి మనం చేసే పత్రి పూజలో అనేక ఆరోగ్య రహస్యాలు నిఘూఢoగా దాగి ఉన్నాయి. సృష్టిలోని ప్రతి వస్తువుకు విలువ తెలియచేసే విధంగా గణపతిని గరికతో కూడ పూజ చేయడం ద్వారా మన పూర్వీకులు అనేక అర్ధాలను విలువలను ఈ వినాయకుడి పూజ ద్వారా తెలిచేసారు. అష్టాదశ శక్తీ పీఠాలు లా అష్ట వినాయక క్షేత్రాలను దర్శించు కుంటే కోర్కెలు నెరవేరుతాయని మన విశ్వాసం. ఇప్పటి వరకు సమైఖ్యాంధ్ర ప్రదేశ్ గా ఉన్న మన తెలుగు రాష్ట్రానికి వచ్చిన గణపతి తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరుణంలో మొట్టమొదటిసారి మన ఇరు రాష్ట్రాలలోను విహరించడానికి తన ఎలుక వాహనం పై ఈరోజు ప్రతి ఇంటా వినాయకుడు సందడి చేస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గణపతి సకల సంపదలను కలుగచేయాలని కోరుకుంటూ బొజ్జ గణపతికి స్వాగతం... 

మరింత సమాచారం తెలుసుకోండి: