వెండితెర పై హీరోలకు ఎన్నో వేల పాటలు పాడిన మనో బుల్లితెర పై పాడటమే కాకుండా ఆడతాడు. ఐదు పదుల వయసు దాటిపోయినా సినిమా ఫంక్షన్స్ లో, రియాలిటీ షోలలో ఆడుతూ పాడుతూ హడావిడి చేసే మనో ఉరఫ్ నాగూర్ బాబు పుట్టినరోజు సందర్భంగా అనేక ఆశక్తికర విషయాలను ఒక ప్రముఖ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.  తనకు 19 ఏళ్ల వయస్సులో జమీలా అనే ముస్లిమ్ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నానని చెపుతూ ఆ పెళ్ళి తెనాలిలో ముస్లిమ్ సాంప్రదాయ పద్దతిలో జరిగిందని అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు మనో. అయితే ఆ ప్రేమ వివాహానికి ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, తనగురువు చక్రవర్తి వచ్చి సాక్షి సంతకాలు చేస్తే కానీ తన వివాహం పూర్తి కాలేదు అని తన వివాహ విషయాలు గుర్తుకు చేసుకున్నాడు మనో.  అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తాను ఈరోజు దేశంలోని 14 భాషలలో పాటలు పాడిన స్థాయికి ఎదిగినా ఏనాడు తాను తన గతం గురించి తన చిన్ననాటి స్నేహాల గురించి మరిచిపోలేదు అని అంటూ మరొక ఆశ్చర్యకర విషయం తెలియ చేసాడు మనో.  తన జీవితంలో తనకు ఉన్న అత్యంత ఆత్మీయమైన మిత్రులలో తనతో చిన్నప్పుడు చదువుకున్న ఒక రిక్షా కార్మికుడు కూడా ఉన్నాడు అని చెపుతూ తాను ఎప్పుడు విజయవాడకు వెళ్ళినా అతడు తను ఉండే హోటల్ కు వచ్చి నేరుగా తన మంచం మీద కూర్చుని “ఏరా నాగూర్” అంటూ పలకరిస్తాడని చెపుతూ జీవితంలో తాను ఎంత ఎదిగినా తన గతం మరిచిపోలేదని చెపుతూ తన నిరాడంబరతను చాటుకున్నాడు. జీవితంలో ఎంత గొప్ప వ్యక్తికైనా సద్దు బాటు అవసరం అనీ ఆ సద్దుబాటు లేకుండా మన ప్రవర్తనలో తేడా చూపిస్తే ఏ వ్యక్తి రాణించలేడు అని అంటూ విజయం సాధించడానికి సమర్ధతతో పాటు శాoతం కూడా ఎoతో అవసరం అనే విజయ సూత్రాన్ని నేటి యువతకు తెలియచేసాడు మనో... 

మరింత సమాచారం తెలుసుకోండి: