తమిళనాడులో తమకు నచ్చిన సినిమా సెలెబ్రెటీలను దేవుళ్ళుగా మార్చి గుడులు కట్టే సాంప్రదాయం ఉంది. అయితే ఇటువంటి క్రేజ్ మన తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారికి ఇంత వరకు రాలేదు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి చరిత్ర సృస్టించిన మహానటులకు ఎందరో వీరాభిమానులు ఉన్నా వారు జీవించి ఉండగానే వారి శిలా విగ్రహాలు తయారు చేసి ఆవిష్కరించిన సందర్భాలు లేవు.  అయితే పవన్ నామస్మరణతో పులకరించిపోతున్న కొంతమంది పవన్ వీరాభిమానులు చేస్తున్న సాహసం ఇప్పుడు మీడియాకు సంచలన వార్తగా మారింది. పశ్చిమగోదావరి జిల్లాలలోని పెనుమంట్ర మండలం తాడేపల్లి రహదారిపై హీరో పవన్‌కళ్యాణ్‌ విగ్రహావిష్కరణకు అభిమానులు సన్నాహాలు చేపట్టారు అనే వార్తలు వస్తున్నాయి. దాదాపు 2 లక్షల ఖర్చుతో పవన్‌ విగ్రహాన్ని తయారు చేశారు అని టాక్.  ఈ విగ్రహాన్ని తాడేపల్లి గూడెంకు చెందిన డాక్టర్‌ అరుణ్ ప్రసాద్‌ అనే పవన్ వీరాభిమాని నిర్మిస్తూ ఉంటే ప్రముఖ శిల్పికరుణాకర్‌ ఉడియార్‌ రూపకల్పన చేశారు అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ శిలా విగ్రహ నిర్మాణం పూర్తి కావడంతో ఈ శిలా విగ్రహ ఆవిష్కరణ సభకు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ఆహ్వానించే ఆలోచనలో ఈ కార్యక్రమ నిర్వాహకులు ఉన్నారని తెలుస్తోంది.  అయితే పబ్లిసిటీ, పొగడ్తలు అంటే చాలా దూరంలో ఉండే పవన్ తన వీరాభిమానులు తన విగ్రహం పెడుతున్న విషయం పై ఎలా ప్రతిస్పందిస్తాడు అన్న విషయoపై అనేక అనుమానాలు ఉన్నాయి. సహాయంచేయడంలో, సేవ చేయడంలో భిన్నమైన వ్యక్తిత్వం గల పవన్ ఇటువంటి శిలా విగ్రహాల కార్యక్రమాలను ప్రోత్సహించి తాను కూడా ఈ పొగడ్తల మాయలో పడిపోతాడా లేదంటే తన విభిన్నమైన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటాడ అనే విషయం పై మరి కొద్ది రోజులలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: