గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పై కొందరు సన్నిహితులు ఒక విషయమై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతసంవత్సరం జరిగిన ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ అభ్యర్ధుల విజయం కోసం తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అంతా ప్రచారం చేసిన పవన్ ప్రభావం ఎంతో కొంత గత ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసింది అన్నది వాస్తవం. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో అదేవిధంగా కేంద్రంలో పవన్ ప్రచారం చేసిన పార్టీలే ప్రభుత్వాలను ఏర్పాటు చేసాయి.

రాజధాని లేని రాష్ట్రంగా అన్నివిధాల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కలిపిస్తామని అదేవిధంగా మొదటి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడే రెవిన్యూ లోటు 16 వేల కోట్లు సహాయ పడతామని భారతీయ జనతాపార్టీ ప్రచారం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని ప్రజలంతా విపరీతంగా నమ్మారు. అయితే ఆచరణలో ఈ హామీలు ఏమి అమలు జరగలేదు సరికదా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ఆర్దిక స్థితికి ఆంధ్రప్రదేశ్ చేరిపోయింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలంతా తీవ్రమైన గందరగోళంలో పడిపోతున్నారు.

అయితే ఇప్పటికే తన ‘జనసేన’ పార్టీని రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించి రాబోతున్న 2019 ఎన్నికలను టార్గెట్ చేయబోతున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి రావలసిన వాగ్దానాల అమలుకోసం తన అభిప్రాయాన్ని వెల్లడించడమే కాకుండా ఎదో ఒక స్థాయిలో ప్రశ్నిస్తే బాగుంటుంది అని పవన్ సన్నిహితులు సూచనలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్రమంతా జనసేన పార్టీ కోసం ప్రచారం చేసే పరిస్థితి ప్రస్తుతం పవన్ కు అందుబాటులో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయాల పై ప్రశ్నలు కురిపిస్తే పవన్ రియల్ హీరోగా మారే అవకాశం ఉంది అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు పవన్ కు సూచనలు చేస్తున్నట్లు టాక్.

అయితే పవన్ మాత్రం తన మనసులోని మాటలను బయట పెట్టకుండా ‘జనసేన’ పార్టీని ఎలా బలోపేతం చేస్తాడు అనే విషయం పై చాల గుంబనంగా వ్యవహరిస్తున్నాడు అని అంటున్నారు. అయితే ఈ ప్రసాంతత తుఫాన్ వచ్చే ముందు ఉండే ప్రశాంత వాతావరణమా అనే సందేహాలు కూడా ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: