జూనియర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘టెంపర్’ సినిమా పై రామ్ గోపాల్ వర్మ ప్రభావం ఉంది అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మాఫియా కథలను పోలీస్ పాత్రలతో నింపి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగల శక్తి దర్శకుడు పూరీకి ఉంది అన్న విషయం గతంలో చాల సార్లు రుజువు చేయబడ్డాయి. అయితే ఈసారి జూనియర్ కెరియర్ కు జీవన్మరణ సమస్యగా మారిన ‘టెంపర్’ మూల కథ ఒక రియల్ పోలీసు ఆఫీసర్ జీవిత కథ అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు పొంది ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో సీనియర్ పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసిన దయా నాయక్ జీవిత కథనే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి పూరి ‘టెంపర్’ గా మార్చాడని టాక్. దాదాపు 85 మంది కరడుగట్టిన క్రిమినల్స్‌ని ఎన్‌కౌంటర్ చేసిపారేసిన చరిత్ర దయా నాయక్‌ది.

ఇతడి గురించి ఇప్పటికీ ముంబాయ్ లో కథలు కధలుగా చెప్పుకుంటారు. ఇతని జీవితాన్ని ఆధారంగా తీసుకుని పూరి జగన్నాథ్ గురువు రామ్ గోపాల్ వర్మ గతంలో బాలీవుడ్ లో ‘అబ్‌తక్ చప్పన్’ మూవీ తీశాడు. అదే సినిమా తెలుగులో జగపతి బాబు హీరోగా ‘సిద్ధం’ పేరిట రీమేక్ అయింది. అప్పట్లో ఈ సినిమా జగపతి బాబుకు పెద్దగా కలిసిరాలేదు.

అయితే ఇప్పుడు అదే కథను కొద్దిగా మార్పులు చేర్పులు చేసి పూరి 'టెంపర్' గా మార్చాడా? అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ‘టెంపర్’ సినిమాలో జూనియర్ పాత్ర పేరు దయా కావడం అని అంటున్నారు. ఏది ఏమైనా అనుకోకుండా పూరి తన గురువు రామ్ గోపాల్ వర్మ ప్రభావంలోకి నిజంగా ‘టెంపర్’ విషయంలో ఉంటే మటుకు ఫలితాలు తారుమారు అవుతాయని విశ్లేషకుల అంచనా..

మరింత సమాచారం తెలుసుకోండి: