పవన్ కళ్యాణ్ నటన , కామెడీ , సినిమాటోగ్రఫీపవన్ కళ్యాణ్ నటన , కామెడీ , సినిమాటోగ్రఫీమ్యూజిక్ , రొటీన్ స్టోరీ
ఏళ్లు పైబడినా సరే పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడడు కాటమరాయుడు (పవన్ కళ్యాన్). తన నలుగురు తమ్ముళ్ల కోసం తాను పెళ్లి చేసుకోకూడదని అనుకుంటాడు. అంతేకాదు ఆడవాళ్ల మీద ఓ రకమైన అయిష్టతతో ఉంటాడు కాటమరాయుడు. కాని తమ్ముళ్లు మాత్రం కాటమరాయుడు చెప్పిన మాటలేవి పట్టించుకోకుండా ప్రేమలో పడతారు. తమ ప్రేమని గెలిపించుకోవాలంటే అన్నయ్య కాటమరాయుడిని ప్రేమలో పడేయాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో తన చిన్ననాటి ప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని కాటమరాయుడు ఇష్టపడే శృతి హాసన్ ను కాటమరాయుడు ప్రేమలో పడేలా చేస్తారు. శృతి హాసన్ మాత్రం తనకు గొడవలు పెట్టుకునే వాళ్లు నచ్చరని చెప్పేస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్.. శృతి హాసన్ ఫ్యామిలీ ఆపదలో ఉంటుంది. విలన్ శృతి ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. అప్పుడు కాటమరాయుడు ఆ విలన్ ను ఢీ కొడతాడు. అసలు శృతి హాసన్ ఫ్యామిలీకి వచ్చిన కష్టం ఏంటి..? కాటమరాయుడు విలన్ ను ఎలా ఢీ కొట్టాడు..? కాటమరాయుడు లవ్ స్టోరీ ఏమైంది అన్నది అసలు కథ. 



పవర్ స్టార్ సినిమా అంటే అందులో పవన్ యాక్టింగ్ వన్ మ్యాన్ షోగా ఉంటుంది. కాటమరాయుడులో కూడా అంతే.. ఉండటానికి కాస్టింగ్ చాలా పెద్దదిగా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ మాత్రమే అందరికి కనిపిస్తాడు. ఫ్యాన్స్ ను ఉత్సాహ పరచే ఎన్నో సన్నివేశాలు సినిమాలో ఉండటం విశేషం. పవర్ స్టార్ స్పెషల్ గా పంచె కట్టుతో కనిపించిన తీరు అద్భుతం. ఇక సినిమాలో శృతి హాసన్ చాలా గ్లామర్ గా కనిపించింది. పాత్రకు తగ్గట్టు చక్కనైనా కట్టు బొట్టుతో అమ్మడు అదరగొట్టింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ శృతి హాసన్ ల పెయిర్ కాటమరాయుడు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక కాటమరాయుడు తమ్ముళ్లుగా నటించిన నలుగురు తమ్ముళ్లు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఆలి కామెడీ బాగుంది. విలన్ గా నటించిన తరుణ్ అరోరా కూడా బాగానే ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక కాటమరాయుడు టెక్నికల్ టీం విషయానికొస్తే.. కోలీవుడ్ మూవీ వీరం రీమేక్ గా వచ్చిన కాటమరాయుడు కిశోర్ పార్ధసాని డైరక్షన్ లో వచ్చింది. పవర్ స్టార్ ను కొత్తగా చూపించడంలో డాలి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా సాంగ్స్, ఫైట్స్ లో కెమెరా వర్క్ చాలా బాగుందనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఓకే. అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడంలో అనూప్ ఫెయిల్ అయ్యాడు. మిర మిరా మీసం సాంగ్ తప్ప మిగతావన్ని మాములుగానే అనిపిస్తాయి. గౌతం రాజు ఎడిటింగ్ ఓకే. రామ్ లక్ష్మన్ ఫైట్స్ బాగున్నాయి. శరత్ మరార్ నిర్మాణ విలువలు సినిమాకు రిచ్ నెస్ తీసుకువచ్చాయి. 

సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీరం సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే సినిమా అని చెప్పొచ్చు. సినిమాలో పవర్ స్టార్ వన్ మ్యాన్ షో చేశాడు. కెరియర్ లో మొదటిసారి అన్నయ్యగా నటించిన పవన్ కళ్యాణ్ తన స్టైల్.. డైలాగ్స్ అన్నిటిలో చాలా ప్రత్యేకతను చూపించాడు. 

సినిమా అంతా ఎంటర్టైనింగ్ మోడ్ లోనే సాగుతుంది. కాని సినిమా కథ రొటీన్ గానే అనిపిస్తుంది. తమ్ముళ్ల కోసం తాను పెళ్లి చేసుకోకుండా ఉన్న కాటమరాయుడు.. హీరోయిన్ శృతి హాసన్ ను చూడగానే తన పట్టింపులన్ని పక్కనబెట్టి ఆమె ప్రేమలో పడాలని ప్రయతించడం రొటీన్ గానే అనిపిస్తుంది. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ లో ఢోకా లేకుండా చేసుకున్న పవన్ కళ్యాణ్ విలన్ తో చెప్పే డైలాగులు కూడా చాలా బాగున్నాయి. 

ప్రత్యేకంగా పవర్ స్టార్ లుక్ సినిమాలో కొత్తగా ఉంటుంది. ఫ్యాన్స్ కు మాత్రం సినిమా మంచి ఎంటర్టైనింగ్ ఇస్తుంది. ఫ్యామిలీ మొత్తం చూసే చక్కని సినిమాగా కాటమరాయుడు ఉంది. కామెడీ కూడా కితకితలు పెట్టేలా చేస్తుంది. మొత్తానికి సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత కాటమరాయుడుగా వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రేక్షకులు మెచ్చే సినిమా తీశాడని చెప్పొచ్చు.  
Pawan Kalyan,Shruti Haasan,Kishore Kumar Pardasani,Sharrath Marar,Anup Rubensఫ్యాన్స్ పండుగ చేసుకునే 'కాటమరాయుడు'

మరింత సమాచారం తెలుసుకోండి: