అందాల ఆర"బూతు" అందాల ఆర"బూతు" చిత్రంలో ఏమి లేకపోవడం (ఏమీ లేకపోవడం)

ఆత్మ న్యూనత భావం అనే రోగంతో బాధ పడుతున్న ఆకాష్(రాహుల్) జీవితం ఈ చిత్రం, ఆకాష్ సెల్కాన్ కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తుంటాడు. బయటకి ఎంతో ధీమాగా కనపడే ఆకాశ్ లోలోపల ఆత్మ న్యూనత (అదేనండి Insecurity ) తో బాధ పడుతూ ఉంటాడు అలాంటి ఆకాష్ జీవితంలోకి అనుకోకుండా తనకు పూర్తి వ్యతిరేకంగా ఉండే మీనాక్షి (శ్రావ్య) ప్రవేశిస్తుంది అనుకోకుండా కలిసిన మీనక్షితో ఆకాష్ అనుకోకుండా ప్రేమలో పడతాడు వీరు పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నించగా అనుకోని పరిస్థితులలో ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు.

పెళ్లి అవ్వగానే ఆకాష్ కి అనుకోకుండా మేనేజర్ గా ప్రమోషన్ వచ్చి హైదరాబాద్ లో పోస్టింగ్ ఇస్తారు. ఇక్కడికి వచ్చిన ఆకాష్ మరియు మీనాక్షి ఆనందంగా గడపడం మొదలుపెడతారు. రోజు ఇంట్లో ఒక్కటే ఉంటె తోచట్లేదు తను కూడా ఉద్యోగానికి వెళతానన్న మీనాక్షి కోరికను ఆకాష్ అంగీకరిస్తాడు. ఇలా వారి జీవితాలు సంతోషంగా గడిచిపోతుండగా మీనాక్షి వేరొకరితో చనువుగా ఉండటం మొదలు పెడుతుంది. ఈ విషయాన్నీ గ్రహించిన ఆకాష్ మీనాక్షి మీద అనుమానం పెంచుకుంటాడు. మీనాక్షి ఎవరితో చనువుగా ఉంటుంది? ఆకాష్ అనుమానం దేనికి దారితీసింది? మరియు దర్శకుడు చెప్పాలనుకున్న మరి కొన్ని "అంశాలు" కలుపుకొని మిగిలిన చిత్రం..

నటీనటులు అనగానే ఎవరి గురించి చెప్పాలో అర్ధం కావట్లేదు ఈ చిత్రం లో ఉండే కీలక పత్రాలు రెండు, ఒకటి రాహుల్ చేసిన ఆకాష్ ఇంకొకటి శ్రవ్య చేసిన మీనాక్షి పాత్ర ఇటు రాహుల్ అటు మీనాక్షి ఇద్దరు వారి వారి పాత్రలకు న్యాయం చెయ్యలేకపోయారు. రాహుల్ నటన గురించి చెప్పాలంటే ఏదయినా కొత్తగా ప్రయత్నించడానికి ప్రయత్నించాడు కాని అయన నటనకు సబ్ టైటిల్ వంటివి జత చేసుంటే ప్రేక్షకుడికి మరింత "క్లియర్" గా అర్ధం అయ్యేవి. అసలు సన్నివేశానికి అయన హవభావానికి సంభంధం లేకుండా నటించడమే కొత్తదనం అనుకున్నారేమో మరి ...

శ్రావ్య, ఈ పాత్రా క్లియర్ గా ఉండదు అలానే ఈ అమ్మాయి నటనా క్లియర్ గా ఉండదు. నటనలో "అ ఆ" లు కూడా చూపించుకోలేని ఈ అమ్మాయి అందాల ఆరబోత లో "అం 'ఆః' " వరకు చూపించేసింది. ఈ అమ్మాయి ఈ చిత్రానికి చేసిన హెల్ప్ కూడా అదే, ఈ అమ్మాయి చేసిన "ఆరబోత" ను చూడటానికి అయినా కొంతమంది చిత్రానికి వచ్చే అవకాశం ఉంది. మిగిలిన నటులందరు తెర మీదకు రాగానే "ప్రెజెంట్ సార్" అని వెళ్ళిపోయారు. కొన్ని పాత్రలు అయితే రెండొందల అడుగులు ముందుకేసి ప్రేక్షకుడికి మూడవ డిగ్రీ హింసని పరిచయం చేసారు..

బూతుకి కథ ఎందుకు అనుకోని ఉన్నా బాగుండేది లేదు కథ కావాలి అనుకున్నారు పోనీ కథకు కథనం ఉండాలి అనుకోని ఉన్నా మరోలా ఉండేది కాని కథ ఉందిగా కథనం తో పనేంటి అనుకున్నారు. డైలాగ్ లందు బూతు డైలాగ్ లు వేరయా అని ఏరి మరీ బూతు డైలాగ్ లు ఉంచారు. బూతు ఉందిగా దర్శకత్వంతో పనేముందిలే అనుకున్నారేమో. ఇలా బూతు కి ఇచ్చిన ప్రాధాన్యత వీటిలో ఏ ఒక్కదానికి ఇచ్చి ఉన్నా కూడా చిత్రం ఎలా ఉండేదో చెప్పలేం కాని ప్రేక్షకుడికి మాత్రం పాట్లు తప్పేవి.

గోవర్ధన్ (గోవి) అందించిన కథ , కాస్త కొత్తగానే ఉంది ఎక్కడా చూడలేదు అని కాదు కాని "ఆత్మ న్యూనత" (అదేలెండి Insecure ) ఫీలింగ్ ఉన్న ఒక మనిషిలోని అతి ప్రేమను(పొసెసివ్ నెస్) చూపించాలన్న కోణం బాగుంది కాని దాన్ని చూపించడానికి అయన ఎంచుకున్న మార్గం బాగోలేదు చివర్లో చెప్పాలనుకున్న విషయానికి సన్నివేశాలు నిచ్చెన లా ఉండాలి కాని ఒకదానితో ఒకటి సంబంధం లేని సన్నివేశాలు ప్రేక్షకుడిని చిరాకు పెట్టిస్తాయి. బలహీనమయిన డైలాగ్స్ బలహీనమయిన కథనాన్ని మరింత బలహీనం చేసింది. దర్శకత్వం గురించి చెప్పి మీ సమయం వృధా చెయ్యాలని అనుకోవట్లేదు. సినిమాటోగ్రఫీ పరవాలేదు ఉన్న రెండు లొకేషన్లనే అందంగా చూపించారు. అవసరం లేకపోయినా జేబీ నేపధ్య సంగీతంతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు అవసరం ఉన్నా తన పాటలతో ఆకట్టుకోలేకపోయాడు మహిత్ నారాయణ. ఎడిటర్ చెయ్యల్సింది చాలా ఉన్నా చేసినా ఉపయోగం లేదని అనుకున్నారేమో ఏదో అలా అలా కానిచ్చేసారు .. నిర్మాణ విలువలు జస్ట్ యావరేజ్ ...

ఏదయినా ఒక చిత్రం ఒక గమ్యంతో మొదలవుతుంది అది చేరుకోగానే ముగుస్తుంది ఈ మధ్యన వస్తున్న చిత్రాలు "బూతు" తో మొదలయ్యి అది ఉపయోగపడే అవకాశం ఉన్న సన్నివేశాలు అయిపోగానే ముగుస్తున్నాయి. ఇది కూడా అలాంటి చిత్రమే కొన్ని బూతు సన్నివేశాలను రాసేసుకొని వాటిని తెర మీద చూపించాలనే "తపన" తో ఏదో ఒక కథను ఎంచుకొని దానిలో వీటిని దూర్చేసి ఇరికించేసి పెట్టేసారు. ఒక వర్గం దర్శకులు మొత్తం ఏదో ఒక వర్గాన్ని ఎంచుకొని దాన్ని ఎందుకంత దారుణంగా చూపిస్తారో ఎవ్వరికి అర్ధం కాని ప్రశ్న, ఈ చిత్రంలో సాఫ్ట్ వేర్ జీవితాలను చూపించిన తీరు లేని అపోహలను సృష్టింస్తుంది లేని ఆలోచనలను అందిస్తుంది.

ఇలా ఒక వర్గాన్ని కించపరచడం లో వీరికి ఉన్న ఆనందం ఎవరికీ అర్ధం కాని విషయం పోనీ అది కథానుగుణంగా చెబుతున్నారా అంటే కథకు ఈ "తిక్క" కు మూడు వేల కిలోమీటర్ ల దూరం ఉంటుంది. ఈ చిత్రంలో మరో విచిత్రం ఏంటంటే చిత్రం మొదలయ్యేది హీరో "ఆత్మ న్యూనత(ఈసారి కూడా Insecurity నే)" దగ్గర కాని చిత్రం ముగిసేలోపు కథానాయిక షెర్లాక్ అయిపోయి మొరియారిటి లాంటి విలన్(క్లైమాక్స్ లో మాత్రమే వస్తాడు) ని పోలీసు లకి పట్టించేసి ప్రమాద వశాత్తు బిల్డింగ్ మీద నుండి పడిపోయి హాస్పిటల్ లో చేరిపోయి ......ఆగండి హీరోకి ఆత్మ న్యూనత (పైన చెప్పిన విధంగా Insecurity ) ఉంది కదూ అరెరె దర్శకుడు ఈ విషయాన్ని మరిచిపోయినట్టు ఉన్నారు.

నిజానికి పొసెసివ్ నెస్ అన్న అంశం చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాల్సింది ఇక్కడ ప్రాబ్లం గురించి మాట్లాడితే అసలు మీనాక్షి మరియు ఆకాష్ కి మధ్యలో ఉన్న ప్రేమ ని చూపెట్టలేదు శ్రుతి మించిన శృంగారాన్ని చూపెట్టి అదే ప్రేమ అన్నట్టు చూపించారు వారి మధ్య బంధాన్ని చూపించకుండా హీరో పడే బాధను అర్ధం చేసుకోమనడం ప్రేక్షకుడికి విసుగెత్తించే వ్యవహారం .. కథలో చెప్పిన మిగిలిన "అంశాలు" ఏవిటంటే బూతు , ఆరబోత , అమ్మాయిలను తిట్టడం ఒక వర్గాన్ని కించపరచడం మొదలగునవి.. అన్నిటికన్నా హాస్యాస్పదం అయిన విషయం ఏంటంటే ఈ చిత్రంలో ఐ టి ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడి వారికోసం ప్రత్యేకంగా ప్రీమియర్ వెయ్యడం... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే "బూతు" లు వస్తాయి .. ఈ చిత్రాన్ని "బూతు" కోసమే చూడాలి, "బూతు" కోసమే అయితే చాలా మార్గాలు ఉన్నాయి వాటిని ప్రయత్నించండి .. లేదు నేను ఈ చిత్రాని నేను చూడాలి ... చూస్తాను అంటారా .. మీ ప్రాణాలు మీ భాద్యత ........

Rahul,Sravya,Govi,Vallabh,Mahith Narayan లవ్ యు బంగారం - బూతు భాండాగారం

మరింత సమాచారం తెలుసుకోండి: