ఎన్టీఆర్ నటన ,సినిమాటోగ్రఫీ ,బ్రహ్మానందం కామెడీ ,ప్రణీత మరియు సమంతల అందాలు ఎన్టీఆర్ నటన ,సినిమాటోగ్రఫీ ,బ్రహ్మానందం కామెడీ ,ప్రణీత మరియు సమంతల అందాలు ఫైట్స్ ,గ్రాఫిక్స్ ,ఎడిటింగ్ ,పాత రోటీన్ కథ ,పరిపఖ్వత లేని కథనం ,ఊహించదగ్గ నేరేషన్

కార్తీక్(ఎన్టీఆర్) అమెరికాలో చదువుకొని తిరిగి వచ్చిన ఒక యువకుడు అతనికి పెళ్లి చెయ్యాలని ఆలోచిస్తున్న సమయంలో కార్తి తల్లి(జయసుధ)కార్తీక్ ని ఒక కోరిక కోరుతుంది అదేంటి అంటే హైదరాబాద్ లో ఉన్న ధనంజయులు(శయాజీ షిండే) కూతురు, తనకి మేనకోడలు అయిన చిట్టి/ఇందు(సమంత) ని ఎలాగయినా తనకి కోడలిగా తీసుకురమ్మని అడుగుతుంది. ఆ పని మీదనే హైదరాబాద్ చేరుకున్న కార్తీక్, ఇందు అనుకొని భాగ్యం(ప్రణీత సుభాష్)ని ప్రేమలో పడేస్తాడు. ఇదిలా నడుస్తుండగా పెద్ది రెడ్డి(జయప్రకాశ్ రెడ్డి)మరియు అతని కొడుకు ఓబుల్ రెడ్డి (అజయ్) కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటారు. అసలు కార్తీక్ ని వాళ్ళు ఎందుకు వెతుకుతూ ఉంటారు? కార్తీక్ ఇందుని ప్రేమలో పడేలా చేసాడా ? వీరి ప్రేమని ధనంజయులు ఒప్పుకున్నాడా? అన్నదే మిగిలిన కథ ...

ఎన్టీఆర్ , నటనాపరంగా ఈ నటుడి లో ఏ చిత్రంలోనూ లోపం కనపడలేదు ఈ చిత్రంలో కూడా తన పూర్తి స్థాయి నటన కనబరిచారు తన కామెడీ టైమింగ్ మరియు డైలాగ్ డెలివరీ తో చాలా ఆకట్టుకున్నారు పతాక సన్నివేశాల వద్ద వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలలో చాలా బాగా నటించారు. సమంత చిత్రంలో ఈ పాత్ర చాలా సేపు కనిపించినా ప్రాముఖ్యత మాత్రం చాలా తక్కువ సన్నివేశాలలో కనిపిస్తుంది. ఆ సమయంలో నటించి మిగిలిన సన్నివేశాలలో అందంగా కనిపిచడంలో ఈ నటి సఫలం అయ్యింది అనే చెప్పాలి..ఇక మరో కథానాయిక పాత్రలో కనిపించిన ప్రణీత ఉన్నదే కాసేపు అయినా తన అందాలతో చాలా బాగా ఆకట్టుకుంది. ఈ నటి గురించి చెప్పుకోడానికి ఇంతకన్నా ఏమి లేదు.. బ్రహ్మానందం పండించిన కామెడీ చిత్రానికి హైలెట్ అందులోనూ ఎన్టీఆర్ తో కలిసి చేసిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి.షాయాజీ షిండే, జయప్ర్రకాష్ రెడ్డి , నాజర్, అజయ్, నాగినీడు పాత్రకి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రఘుబాబు మరియు అలీ అక్కడక్కడా నవ్వించారు. బ్రహ్మాజీ, పృథ్వి , తనికెళ్ళ భరణి , నందు, సురేఖవాణి ఉన్నంతలో పర్వాలేదనిపించారు. జయసుధ మరియు సీత వంటి నటులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. మిగిలిన అందరు నటీనటులు అల కనిపించి వెళ్ళిపోయినా వారే...

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కథ , కథనం మరియు మాటలు కూడా తనే చూసుకున్నారు కాని ఇందులో ఒక్క విభాగంలో కూడా సఫలం కాలేకపోయారు. కథ విషయానికి వస్తే ఇది పూర్తి స్థాయి కథ కాదు చాలా గజిబిజిగా ఉంటుంది అంతే గజిబిజిగా ముగుస్తుంది. సగం ఉడికిన కూర లాంటిది ఈ కథ .. ఇక కథనం విషయానికి వస్తే చాలా ప్లాట్స్ ఓపెన్ చేసేయ్యడంతో ఏ ప్లాట్ ని ఎలా కదపాలో తెలియని దర్శకుడి గందరగోళానికి నిలువెత్తు తార్కాణం ఈ చిత్ర కథనం. మొదటి అర్ధ భాగం అయిపోగానే రెండవ అర్ధ భాగం ఎలా కదపాలో తెలియక కొత్త కథను ఒకటి ఎంచుకున్నారు.. రెండవ అర్ధ భాగంలోని కథకు మొదటి అర్ధభాగంలోని కథకు చాలా బలహీనమయిన బంధాన్ని పెట్టేసి చేతులు దులిపేసుకున్నారు. డైలాగ్స్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి అక్కడక్కడ ఒకటి లేదా రెండు మాత్రమే బాగున్నాయి మిగిలిన డైలాగ్స్ అంతగా ఆకట్టుకోలేదు...సినిమాటోగ్రఫీ అందించిన శ్యాం కే నాయుడు లొకేషన్లను చాలా అందంగా చూపించారు. సినిమాటోగ్రఫీ చాలా బాగా కుదిరింది ఈ చిత్రానికి.. తమన్ అందించిన సంగీతంలో మూడు పాటలు వినడానికి బాగుండగా అన్ని పాటలు చూడటానికి బాగున్నాయి కాని సన్నివేశానికి అనుగుణంగా లేకపోవడంతో ఆకట్టుకోలేకపోయాయి.. నేపధ్య సంగీతం విషయంలో తమన్ దారుణంగా విఫలం అయ్యారు అని చెప్పుకోవచ్చు అతని నేపధ్య సంగీతం ఒక్క సన్నివేశానికి కూడా బలం చేకూర్చలేకపోయింది అంటే ఆశ్చర్యం లేదు.. ఎడిటింగ్ చేసిన కోటగిరి వెంకటేశ్వర రావు మరిన్ని సన్నివేశాలను కత్తిరించి ఉండాల్సింది చిత్రంలో చాలా సన్నివేశాలు చిత్రానికి అవసరం లేకపోయినా ఉన్నాయి అందులో కొన్ని నవ్వించాయి కాని కొన్ని మాత్రం బాగా చిరాకు పెట్టాయి..

ఇదే కాకుండా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో రెండు విభాగాలు ఉన్నాయి అందులో ఒకటి ఫైట్స్ ఈ చిత్రానికి ప్రధాన మైనస్ ఫైట్ లు.. కార్ లు ఎగిరిపోవడం , టైర్లు విరిగిపోవడం , మనుషులు తిరిగిపోవడం ... ఇలా వర్ణించలేని ఫీట్ లు చేసి అవే ఫైట్ లు అనేసారు ఇది సరిపోదని దీనికి విజువల్ ఎఫెక్ట్స్ జత చేసారు అవి అసలే దారుణంగా ఉన్న ఈ ఫైట్స్ ని ఇంకా దారుణంగా తయారు చేసాయి.. ఈ రెండు విభాగాలు కలిసి ఈ చిత్రానికి చేసినంత నష్టం మిగిలిన అన్ని విభాగాలు కలిసి కూడా చెయ్యలేకపోయాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి చిత్రం రిచ్ గా కనిపిస్తుంది...

ఒక చిత్రానికి అన్ని సరిగ్గా కుదిరితేనే హిట్ అవుతుంది "రభస" చిత్రానికి చాలా విభాగాలు సరిగ్గా కుదరలేదు. ముఖ్యంగా కథనం దారుణం ఎందుకంటే ఈ చిత్రం మొదలు అయినప్పటి నుండి మొదటి అర్ధ భాగం సగం పూర్తయ్యే వరకు అనవసరమయిన సబ్ ప్లాట్స్ పది వస్తాయి ఇది సరిపోదు అని మొదటి అర్ధ భాగంలో అసలు పరిచయం అయినా లేని ఒక పాత్రతో రెండవ అర్ధ భాగాన్ని అంతా నడిపించేయాలని అనుకోవడం. కందిరీగ చిత్రాన్ని అద్భుతంగా హేండిల్ చేసిన దర్శకుడేనా ఈ చిత్రాన్ని తీసింది అనిపిస్తుంది ఎందుకంటే ఇటు కామెడీ పూర్తిగా పండలేదు అటు హీరోఇజం పూర్తిగా ఎలివేట్ కాలేదు.. కీలక సన్నివేశాల వద్ద దర్శకుడి తడబాటు పూర్తిగా బహిర్గతం అయిపోయింది. హీరో ని ఎలివేట్ చెయ్యాల్సిన సన్నివేశంలో చెత్త ఫైట్ ఒకటి పెట్టేసి ఉసూరుమనిపించారు ...

ఇక సెంటిమెంట్ సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయి కాని వర్క్ అవుట్ అవ్వలేదు ముఖ్యంగా చివర్లో అజయ్ నిజాన్ని గుర్తించే సన్నివేశం వద్ద పండాల్సిన సెంటిమెంట్ పూర్తిగా పండలేదు. అమ్మ సెంటిమెంట్ చెల్లి సెంటిమెంట్ నాన్న సెంటిమెంట్ ఇలా ఏదీ కూడా సరిగ్గా పండలేదు అన్ని సగం ఉడికిన చిక్కుడుకాయలు గా మిగిలిపోయాయి.. పది సబ్ ప్లాట్స్ ఓపెన్ చేసినా అన్నింటినీ ముగించాడు కాని అన్నింటినీ ముగించాలన్న హడావిడి లో చిత్ర ఫ్లో ని అసలు పట్టించుకోలేదు అన్ని చివర్లోనే ముగించాలన్న దర్శకుడి నిర్ణయం ప్రేక్షకుడి మీద చాలా ప్రభావం చూపింది. ఇక ఈ చిత్రం ఇప్పటికే చూసిన పలు తెలుగు చిత్రాలను పోలి ఉంటుంది..ఎన్టీఆర్ కూడా ఒక్క పాటలోనే తన స్టెప్ లతో ఆకట్టుకోగలిగారు. ఈ చిత్రాన్ని చూస్తే ఎన్టీఆర్ మరియు బ్రహ్మానందం కోసమే చూడాలి... ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానుల కోసమే తెరకెక్కించిన చిత్రం. మీరు ఎన్టీఆర్ అభిమాని అయితే వెంటనే థియేటర్ కి వెళ్ళిపొండి.. మాములు ప్రేక్షకుడు అయితే బ్రహ్మానందం కామెడీ కోసం ఒక్కసారి ప్రయత్నించ దగ్గ చిత్రం..

Jr. NTR,Samantha,Santosh Srinivas,Bellamkonda Suresh,S. Thaman.చివరగా : ఎన్టీఆర్ + బ్రహ్మానందం - మొదలుగునవి = రభస

మరింత సమాచారం తెలుసుకోండి: