మహేష్ బాబు నటన,పాటల చిత్రీకరణ,కొన్ని కామెడీ సన్నివేశాలు.మహేష్ బాబు నటన,పాటల చిత్రీకరణ,కొన్ని కామెడీ సన్నివేశాలు.పాత కథ,అంతే పాతది అయిన కథనం,అసలు పండని కామెడీ సన్నివేశాలు,మోతాదుకు మించి అనవసరమయిన ప్రాసలో ఉన్న పంచ్ డైలాగ్స్,ఎడిటింగ్, దర్శకత్వం

బుక్కాపట్నం అనే ఊర్లో దామోదర్(సోను సూద్) ఆగడాలు ఎక్కువ అయిపోతుంటాయి పోలీస్ లు కూడా ఆపలేని పరిస్థితి వచ్చిన తరుణంలో ఆ ఊరికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వస్తాడు శంకర్(మహేష్) , ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన శంకర్ ఆ ఊరికి రాగానే దామోదర్ కి చెందిన ఒక్కొక్క వ్యాపారాన్ని దెబ్బతీయడం మొదలుపెడతాడు. అదే సమయంలో సరోజ(తమన్నా)ని చూడగానే ప్రేమలో పడిపోతాడు శంకర్, కాని సరోజ కి పోలీస్ లు అంటే గిట్టదు అంతే కాకుండా అమెరికా లో సెటిల్ అయిన కుర్రాడిని పెళ్లి చేసుకొని వారి సరోజ స్వీట్స్ ని అమెరికా లో కూడా పెట్టాలనేది సరోజ లక్ష్యం.. ఇదిలా సాగుతుండగా దామోదర్ కి ఒక డ్రీం ప్రాజెక్ట్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ కి అడ్డు వస్తున్నాడు అని కలెక్టర్ (అజయ్) ని చంపించేస్తాడు. తనతో గేమ్స్ ఆడుతూ ఒక్కొక్క వ్యాపారాన్ని మూయిస్తున్న శంకర్ ని నిందల పాలు చేస్తాడు దామోదర్.. శంకర్ ఎలాగయినా దామోదర్ ప్రాజెక్ట్ ని ఆపేస్తానని ఛాలెంజ్ చేస్తాడు.. శంకర్ కి కలెక్టర్ కి ఉన్న సంభంధం ఏంటి? సరోజ, శంకర్ ని ప్రేమించిందా? దామోదర్ డ్రీం ప్రాజెక్ట్ ని శంకర్ ఎలా ఆపాడు? అన్నదే మిగిలిన కథ ... ఈ కథలో డిల్లి సూరి(బ్రహ్మానందం) ఎవరు? అనేది తెర మీద చూడాల్సిందే...

మహేష్ బాబు ఎప్పటిలానే ఆకట్టుకున్నారు నిజానికి విషయం చాలా తక్కువగా ఉన్న ఈ చిత్రం మొత్తాన్ని భుజం మీద వేసుకొని మోశారు, కథనాన్ని వెనకుండి తోసారు ఇలా చాలా చేసారు. గోదావరి యాసలో ఆయన చెప్పిన డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. తమన్నా, అందం పరంగా ఆకట్టుకున్నా కూడా నటించడానికి వీలయినన్ని సన్నివేశాలు ఈ నటికి దక్కలేదు మొదటి అర్ధ భాగంలో రెండు మూడు సన్నివేశాలలో నటించడానికి ప్రయత్నించినా పాత్ర పండకపోవడంతో గుర్తించే అవకాశం లేకుండా పోయింది కాని పాటల్లో డాన్స్ మరియు అందాల ప్రదర్శన విషయంలో నూటికి నూరు మార్కులు స్కోర్ చేసింది... సోను సూద్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనపడటానికి ప్రయత్నించినా ఈ నటుడి బాడీ లాంగ్వేజ్ అయితే పవర్ ఫుల్ గానే ఉంది కాని పాత్రలో అంత బలం లేదు, బాగా తేలిపోయింది అని చెప్పుకోవాలి.. రావు రమేష్ ఉన్న రెండు సన్నివేశాలు కూడా అతని స్థాయి నటన కనబరిచారు... నాజర్ చేత చేయించాలని ప్రయత్నించిన కామెడీ బొత్తిగా బాలేదు.. ఆయన పాత్రకి ప్రాముఖ్యత లేకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది.. రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ళ భరణి , హర్ష వర్ధన్, వెన్నెల కిషోర్ , రఘుబాబు లాంటి నటులు నటించారు పేపర్ మీద బాగా బలంగా కనిపిస్తున్న ఈ నటవర్గం లో ఒక్కరి పాత్ర కూడా బలంగా లేదంటే అతిశయోక్తి కాదు .. ఇంకా శ్రీను వైట్ల కి వజ్రాయుధం లాంటి బ్రహ్మానందం పాత్ర కూడా తేలిపోయింది ఆయన చేసిన కామెడీ కూడా ఆకట్టుకోలేదు...

కథాపరంగా ఇది గతంలో చూసిన చాలా చిత్రాలను పోలి ఉంటుంది అంతే కాకుండా మహేష్ మరియు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన దూకుడు చిత్రంలా కూడా అక్కడక్కడా అనిపిస్తుంది కాబట్టి కథాపరంగా కొత్తది కాదు.. కథనం పరంగా చూసుకుంటే కూడా చెప్పుకునేంత కొత్తదనం ఏమీ కనపడదు మొదటి అర్ధ భాగంలో సన్నివేశాలు అలా వచ్చి వెళ్తుంటాయి కాని ఒక్కదానికి సరయిన అర్ధం ఉండదు అంతే కాకుండా ఇలాంటి చిత్రాలలో కీలక పాత్ర పోషించేది హీరో ఎలివేషన్ సన్నివేశాలు ఈ చిత్రంలో అవి అసలు కనపడలేదు.. ఇంకా డైలాగ్స్ విషయానికి వస్తే ఎవరో అన్నట్టు ఏదయినా మితంగా తీసుకుంటే ఔషధం అతిగా చేస్తే విషం .. ఈ చిత్రంలో అదే జరిగింది ప్రతి డైలాగ్ లో పంచ్ ఉండాలి ప్రతి డైలాగ్ లో ప్రాస ఉండాలి అని రచయితలు పడ్డ కష్టంలో కాస్తయిన కథనంలో పెట్టి ఉంటె చిత్రం బాగా వచ్చి ఉండేది.. దర్శకత్వం విషయంలో కూడా శ్రీను వైట్ల విఫలం అయ్యారు సన్నివేశాలకు ప్రాముఖ్యత లేనప్పుడు సన్నివేశం ఎంత బాగున్నా కూడా ఆకట్టుకోదు అన్న చిన్న సూత్రం మరిచిపోయారు.. సినిమాటోగ్రఫీ అందించిన కెవి గుహన్ పనితనం చాలా బాగుంది ముఖ్యంగా పాటల్లో వచ్చే లొకేషన్లను చాలా అందంగా తెరకెక్కించారు.. తమన్ అందించిన సంగీతంలో మూడు పాటలు తెర మీద కూడా చాలా అందంగా ఉన్నాయి.. కొన్ని సన్నివేశాలకి ఆయన ఇచ్చిన నేపధ్య సంగీతం బాగున్నా కూడా కొన్ని సన్నివేశాలలో ఆయన గతంలో ఇచ్చిన నేపధ్య సంగీతాన్నే తిరిగి ఇందులో ఇచ్చారు.. ఎడిటర్ ఎం కే వర్మ సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలను కత్తిరించడం మరిచిపోయారు.. 14 రీల్స్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి...

శ్రీను వైట్ల, మహేష్ బాబు ల కాంబినేషన్ అనగానే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి కాని ఆ అంచనాలను చేరుకునే స్థాయిలో మాత్రం చిత్రం లేదు. చిత్రంలో చెప్పుకోవాల్సిన ప్రధాన లోపం డైలాగ్స్ మోతాదుకి మించి పదే పదే పంచ్ ల కోసం ప్రాసలో వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోకపోగా చిరాకు పెట్టించాయి.. మొదటి అర్ధ భాగం అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలు వర్క్ అవుట్ అయ్యి లాక్కోచ్చినా రెండవ అర్ధ భాగం మొదటికే మోసం అయ్యింది. కామెడీ కోసం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి, అసలు ఇంత పాత కథను అంతే పాత విధానంలో చెప్పాలన్న ఆలోచన ఎలా వర్క్ అవుట్ అవుతుంది అనుకున్నారో దర్శకుడు గారు.. ఇందాక చెప్పినట్టు డైలాగ్స్ గురించి మరొకసారి మాట్లాడుకుంటే కొన్ని డైలాగ్స్ బాగున్నాయి కాని సన్నివేశానికి సంబంధం ఉంటె బాగుండేది సెకను కి పది పంచ్ లు అన్న ఫార్ములా ప్రేక్షకుడు మహేష్ బాబు ఎం మాట్లాడుతున్నాడు అని అనుకునేంత స్థాయికి చేరుకుంది. అసలు ఒక డైలాగ్ రిజిస్టర్ చేసుకునేలోపు ఇంకొక పంచ్ డైలాగ్ పడిపోతుంది.

ఇక క్లైమాక్స్ అయితే దారుణం అని చెప్పుకోవాలి బ్రహ్మానందం పాత్రతో చేయించిన డాన్స్ లు బాగున్నా కూడా వాడిన గ్రాఫిక్స్ బొత్తిగా నప్పలేదు.. తమన్నా పాత్ర ఫస్ట్ హాఫ్ లో రెండు సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో మూడు రెండు పాటలు అన్నట్టు సాగింది. శృతి హాసన్ చేసిన ఐటెం సాంగ్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం ఏ మాత్రం బాగుంది అనిపించినా అది ఒక్క మహేష్ బాబు వల్లనే ఎందుకంటే ఈ పాత్ర ఒక్కటే చిత్రంలో బలంగా కనిపించేది.. మొత్తానికి ఆగడు చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది మహేష్ ఫాన్స్ మీద ఆధారపడి ఉంటుంది.. మీరు మహేష్ అభిమాని అయితే ఒక్కసారి చూడదగ్గ చిత్రం ఇది..

Mahesh Babu,Tamanna Bhatia,Srinu Vytla,Anil Sunkara,Ram Achanta,S Thaman.ఆగడు - ఇంతకముందే చూసేసిన కొత్త చిత్రం ...

మరింత సమాచారం తెలుసుకోండి: