సినిమా స్టార్టింగ్ , అక్కడక్కడా బాగా పేలిన కొన్ని కామెడీ సీన్స్ , వైభవ్ కామెడీ టైమింగ్ , సోనమ్ బజ్వా గ్లామర్ ట్రీట్ సినిమా స్టార్టింగ్ , అక్కడక్కడా బాగా పేలిన కొన్ని కామెడీ సీన్స్ , వైభవ్ కామెడీ టైమింగ్ , సోనమ్ బజ్వా గ్లామర్ ట్రీట్ మూవీ రన్ టైం (151నిమిషాలు) , స్క్రీన్ ప్లే - స్లో నెరేషన్ , ఊహాజనితంగా సాగే కథ , సాంగ్స్ ప్లేస్ మెంట్ , సరిగా కనెక్ట్ చెయ్యని ఎమోషన్స్ , అవసరం లేని ఓ యాక్షన్ ఎపిసోడ్

తమిళంలో సక్సెస్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్ చేయడం కొత్తేమీ కాదు.. తాజాగా గత ఏడాది చివర్లో తమిళంలో రిలీజ్ అయ్యి విజయం అందుకున్న 'కప్పల్' సినిమాని తెలుగులో 'పాండవుల్లో ఒకడు' అనే టైటిల్ తో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఇక కథలోకి వెళితే.. ఓపెన్ చేస్తే ఆ ఊరి పేరు తడ(ఆంధ్ర - తమిళనాడు బార్డర్), ఆ ఊర్లో చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగిన వాసు(వైభవ్), కనకరాజు(కరుణాకరన్), కార్తీక్ సుబ్బరాజు(అర్జునన్), పట్టాభి(వెంకట్ సుందర్), వెంకటేశ్వర్లు(కార్తీక్)లు బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నవయసులోనే వీరి మధ్యలోకి ప్రేమ లేదా పెళ్లి రూపంలో అమ్మాయి వస్తే వారి స్నేహం చెడిపోతుందని పెళ్ళే చేసుకోకూడదు అని ఒట్టు పెట్టుకుంటారు. కానీ చిన్నప్పటి నుంచే ఆమ్మాయిలపై ఆసక్తి, ప్రేమపై మక్కువ ఉన్న వాసు దీనికి ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పిస్తారు. ఇక అక్కడి నుంచి వాసు ఏ అమ్మాయిని చూసిన ఈ ఫ్రెండ్స్ చెడగొడుతూ ఉంటారు. దాంతో వాసు విసిగిపోయి ఉద్యోగం వంకతో చెన్నై చేరతాడు. అక్కడ దీపిక(సోనమ్ బజ్వా)ని చూసి ప్రేమలో పడతాడు. కొన్నాళ్ళకి ఇద్దరూ లవర్స్ అవుతారు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న టైంలో వాసు లైఫ్ లోకి ఫ్రెండ్స్ ఎంటర్ అవుతారు. వాసు ప్రేమని తెలుసుకొని ముప్పు తిప్పలు పెడతారు. వీరి నుంచి తప్పించుకొని వాసు దీపికతో తన ప్రేమని కంటిన్యూ చేసాడా.? లేదా.? ఫ్రెండ్స్ అనుకున్నట్టుగానే వాసు - దీపికలని విడగొట్టి వాసుని మళ్ళీ ఒంటరి వాన్ని చేసేసారా.? అన్న విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.. 

వైభవ్ తెలుగులో చేసింది మూడు నాలు సినిమాలే అయినా తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకూ తెలుగులో అన్నీ మాస్ పాత్రలే చేసిన వైభవ్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ ట్రై చేసాడు. కామెడీని పండించడంలో వైభవ్ సక్సెస్ అయ్యాడు. వైభవ్ నటన, హావ భావాలు ఆకట్టుకుంటాయి. సోనమ్ బజ్వా పెర్ఫార్మన్స్ బాగుంది. అంతకంటే మించి తన గ్లామర్ ట్రీట్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యిందని చెప్పాలి. సినిమాలో రిచ్ కిడ్, మోడ్రన్ లుక్ అనే ఫార్మాట్ లో బాగానే ఎక్స్ పోజింగ్ చేసింది. విటివి గణేష్ సీన్స్ మరియు అతని పంచ్ డైలాగ్స్ బాగానే నవ్విస్తాయి. కరుణాకరన్, అర్జునన్, వెంకట్ సుందర్, కార్తీక్ లు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ లో బాగానే చేసారు. కానీ వీరందరూ తమిళ వారే కావడం వలన తెలుగు ప్రేక్షకులు తొందరగా కనెక్ట్ కారు. 

సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన కార్తీక్ జి క్రిష్ ఈ సినిమాతో దర్శకుడయ్యాడు. దర్శకుడిగా చేయనున్న మొదట ప్రయత్నంలో పెద్ద రిస్క్ తీసుకోకుండా ఓ సింపుల్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని నవ్విద్దాం అనే ప్రయత్నం చేసాడు. అందుకనే కాస్త కేర్ తీసుకొని సందర్భానుసారంగా వచ్చే కామెడీని రాసుకున్నాడు. ఆ విషయంలో కొంతవరకూ కార్తీక్ సక్సెస్ అయ్యాడు. ముందుగా కార్తీక్ ఎంచుకున్న కథ విషయానికి వస్తే.. ఇదేమీ కొత్త కథ కాదు.. 5మంది ఫ్రెండ్స్ పెళ్లి వద్దు అనుకుంటారు కానీ అందులో ఒకడు ప్రేమలో పడడం వారిని విడగొట్టడానికి మిగతా ఫ్రెండ్స్ ట్రై చెయ్యడం. ఇలాంటి కాన్సెప్ట్ ని ఇది వరకే చూసున్నాం. చెప్పాలంటే ఇటీవలే తమిళం నుంచి తెలుగుకు డబ్ అయిన 'చిరునవ్వులతో చిరుజల్లు' సినిమా కూడా ఇదే ఫార్మాట్ లోనే ఉంటుంది. ఇకపోతే కథ పరంగా ఇక్కడ చేసిన తప్పు అంటే కథలోని అసలు పాయింట్ ఏంటి అనేది మొదటి 15 నిమిషాల్లోనే చెప్పేయడం. ఆ తర్వాత కథ పరంగా చెప్పడానికి ఏమీ లేదు, ఆ తర్వాత కథ ఎలా వెళ్తుంది అనేది ఆడియన్స్ ఊహించిందే ఉంటుంది. ఇక్కడ కార్తీక్ స్క్రీన్ ప్లే పరంగా కేర్ తీసుకోవాల్సింది. ఎప్పుడైతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుందో, అప్పుడే ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. అలా జరగలేదు అంటే ఆడియన్స్ బోర్ ఫీలవుతారు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. కథ ఏంటి అనేది తేలిపోవడం, స్క్రీన్ ప్లే పరంగా ఒక్క ట్విస్ట్ ని కూడా రాసుకోకపోవడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. అలాగే కార్తీక్ నేరేషన్ పరంగా, రన్ టైం పరంగా కూడా కేర్ తీసుకోలేదు. దాని వల్ల సినిమా చాలా చోట్ల బోరింగ్ గా సాగుతుంది. చాలా చోట్ల ఈ సీన్స్ అవసరం లేదు, ఇక్కడ అసలు ఈ పాట అవసరం లేదు బాబోయ్ అనే ఫీలింగ్ కి ఆడియన్స్ వెళ్ళిపోతారు. అంతలా సాగాదీసేసారు. ఇకపోతే సినిమాలో ఫ్రెండ్షిప్ అండ్ లవ్ అనే రెండు సూపర్బ్ ఎమోషన్స్ ని డీల్ చేస్తున్నాడు. కానీ ఒక్క చోట కూడా బలమైన ఎమోషన్స్ ని పలికించలేదు. సినిమా చివర్లో ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకునే సీన్ సినిమాకిఉంది. చాలా కీలకం.. కానీ ఆ సీన్ సరిగా లేదు, ఆ ఎమోషన్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయాడు. అప్పటి వరకూ నో లవ్ నో మ్యారేజ్ అన్న ఫ్రెండ్స్ సింపుల్ గా చేంజ్ అయిపోవడం అనేది సిల్లీగా అనిపిస్తుంది. కార్తీక్ సక్సెస్ అయ్యింది ఒకే ఒక్క విషయంలో.. అది ఎక్కడ అంటే.. సినిమాలో ఎక్కువ భాగం సందర్భానుసారంగా వచ్చే కామెడీ రాసుకోవడం, దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం. సినిమా స్లోగా సాగదీస్తున్నా ఆడియన్స్ నవ్వుకునే కొన్ని కామెడీ సీన్స్ మాత్రం అందరినీ నవ్విస్తాయి. ఈ సినిమాకి మేజర్ హైలైట్ ఇదే. ఇకపోతే డైరెక్టర్ గా ఓకే అనిపించుకున్న కార్తీక్ సినిమాలో లాజిక్స్ ని ఎలా పడితే అలా వదిలేసాడు. నాకు కామెడీ కావలి అది వస్తే చాలు లాజిక్స్ నాకు అవసరం లేదు అని వదిలేసాడు. అందుకే లాజికల్ గా సినిమాలో చాలా లూప్ హోల్స్ దొరుకుతాయి.     


ఇక మిగతా టెక్నికల్ టీం విషయానికి వస్తే.. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్ గా ఉంది. కామెడీ ప్లస్ తమిళ ఫ్లేవర్ కొట్టొచ్చేలా తీసాడు. నటరాజన్ శంకరన్ మ్యూజిక్ లో వచ్చిన ఆడియోని తెలుగులోకి డబ్ చేసారు, కానీ ఒక్క పాట కూడా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కామెడీ సినిమాకి తగ్గట్టుగానే ఉంది. కామెడీ సీన్స్ లో తను వాడిన మ్యూజిక్ బిట్స్ ఎక్కడో విన్నట్టు కూడా ఉంటాయి. ఆంథోనీ ఎడిటింగ్ అస్సలు బాలేదు. అంత సీనియర్ ఎడిటర్ అయ్యుండి లాగ్స్ ని కట్ చేయకుండా వదిలేసాడు. శేషు తమిళ డైలాగ్స్ ని యాజిటీజ్ గా తెలుగులోకి అనువదించాడు. అందులో కొన్ని మాత్రం పరవాలేధనిపిస్తాయి. మారుతి డబ్బింగ్ మేకింగ్ వాల్యూస్ డీసెంట్ అనిపిస్తాయి. 

చాలా సింపుల్ అండ్ రెగ్యులర్ కాన్సెప్ట్ తో తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమా 'పాండవుల్లో ఒకడు'. డెబ్యూ డైరెక్టర్ కార్తీక్ జి క్రిష్ ఈ సినిమాతో వీలైనంత నవ్వించాలి అనుకున్నాడే తప్ప కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండాలి, అలా ఉంటేనే ఆడియన్స్ కి ఇంకా ఎక్కువగా సినిమా కనెక్ట్ అవుతుందనే విషయాన్ని మిస్ అయ్యాడు. అందుకే సందర్భానుసారంగా వచ్చే కామెడీ పార్ట్ నే ఎక్కువగా రాసుకున్నాడు. అందుకే సినిమాకి కథా - కథనాలు మైనస్ అయినా, ఆడియన్స్ నవ్వుకోవడానికి మాత్రం కొన్ని కామెడీ సీన్స్ ఉండడం సినిమాకి హెల్ప్ అయ్యింది. చాలా చోట్ల డైరెక్టర్ డబుల్ మీనింగ్ కామెడీ వైపు కూడా మొగ్గు చూపాడు. ఇకపోతే ఓవరాల్ గా పాండవుల్లో ఒకడు సినిమాలో కంటెంట్ లేదు కానీ అక్కడక్కడా నవ్వుకోవడానికి కామెడీ మాత్రం ఉంది. కావున చివరగా నేను చెప్పేది ఏమిటి అంటే.. అక్కడక్కడా బాగానే నవ్వు తెప్పించే కామెడీ సీన్స్ కోసం మేము రెండున్నర గంటల సమయాన్ని కేటాయించగలం అనుకునే వారు ఈ సినిమాకి వెళ్ళచ్చు, వెళ్లి నవ్వుకోవచ్చు. జస్ట్ కొన్ని కామెడీ సీన్స్ తప్ప మిగతా ఏమన్నా ఆశిస్తే మాత్రం ఈ సినిమాకి దూరంగా ఉండచ్చు, ఎందుకంటే అలా ఆశించి వెళితే మీరు బాగా నిరుత్సాహపడతారు. ఇకపై మీ ఇష్టం.. 

Vaibhav,Sonam Bajwa,Karthik G. Krish,Maruthi,Natarajan Sankaranపంచ్ లైన్ : పాండవుల్లో ఒకడు - జస్ట్ కొన్ని నవ్వులు మాత్రమే.!

మరింత సమాచారం తెలుసుకోండి: