చిరంజీవి , నేపధ్య సంగీతం , సినిమాటోగ్రఫీ , చరణ్ డాన్సు , రకుల్ అందాలు చిరంజీవి , నేపధ్య సంగీతం , సినిమాటోగ్రఫీ , చరణ్ డాన్సు , రకుల్ అందాలు సెకండ్ హాఫ్ , ఊహాజనితం అయిన నేరేషన్ , చప్పగా సాగే కథ , ఎడిటింగ్ , గురి తప్పిన కామెడీ , పాత చింతకాయ పచ్చడి కథ

తన కొడుకు కార్తిక్(చరణ్) ని ఎలాగయినా కలెక్టర్ ని చెయ్యాలి అనుకుంటాడు రామచంద్ర (రావు రమేష్) కాని అక్క కావ్య(కృతి ఖర్భంద) కోసం తనకి వచ్చిన అవకాశాన్ని వదులుకొని కావ్యాని కలెక్టర్ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు కార్తిక్. డేంజర్ డేవిడ్(జయప్రకాశ్) దగ్గర స్టంట్ మాన్ గా పని చేస్తూ తన అక్కకి కావలసిన అవసరాలను తీరుస్తుంటాడు. ఇలా నడుస్తున్న అతని జీవితం లో కి రియా(రకుల్ ప్రీత్ సింగ్) ప్రవేశిస్తుంది. అప్పటి నుండి కార్తిక్ తనకు తెలియకుండానే దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) తో వైరం ఏర్పరుచుకుంటాడు. ఇదిలా ఉండగా రామచంద్ర పని చేస్తున్న కంపెనీ అధినేత జయరాజ్(సంపత్) మరియు వసుంధర(నదియ) వారి కొడుకుకి కావ్య తో పెళ్లి చేద్దాం అని నిర్ణయించుకుంటారు. ఇదిలా నడుస్తుండగా దీపక్ తన వ్యాపారాలన్నీ దెబ్బ తీసిన కార్తిక్ మరియు వారి కుటుంబాన్ని హతమార్చాలని అనుకుంటాడు. తన కుటుంబం కోసం ఏదయినా చేసే బ్రూస్ లీ దీపక్ రాజ్ నుండి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది తెర మీద చూడవలసిందే..

చిరంజీవి , పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో కనిపించింది కాసేపే అయినా ఆ కాసేపు చిత్రానికి ఊపిరి , అయన తెరమీద కనపడిన కాసేపు ప్రేక్షకులను మైమరిపించేసారు. ఎన్నో రోజుల తరువాత తెర మీద కనిపించినా తన పట్టు తగ్గలేదని చాటి చెప్పారు. చరణ్ ఈ చిత్రంలో చాలా పరిపఖ్వత తో కూడిన నటన కనబరిచారు. ఒక ఫైటర్ కి కావాల్సిన ఆహార్యం ఆటిట్యూడ్ అదిరిపోయింది. ఇంకా పాటల్లో అతని డాన్సు మాటల్లో అతని పంచ్ చాలా బాగున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ నటన బాగుంది అభినయం అవసరం లేని ఈ పాత్రలో అందాలను పోసి ప్రేక్షకుడి కనులను మనసుని నింపేసింది ఈ ముద్దుగుమ్మ. అరుణ్ విజయ్ పాత్ర అన్ని చిత్రాలలో ఉండే మాములు డాన్ పాత్రే అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆ పాత్రను మరో స్థాయికి తీసుకెళ్ళారు ఈ నటుడు. కృతి కర్భంద నటన పాత్రకు సరిపోయేలా ఉంది. సంపత్ మరియు రావు రమేష్ వారి పాత్రలకు అనుభవాన్ని జోడించి ప్రాణం పోశారు. నదియ పాత్ర మరియు పవిత్ర లోకేష్ పాత్రలు ఆకట్టుకున్నాయి. తనికెళ్ళ భరణి , పృథ్వీ రాజ్ ఉన్నాం అనిపించారు. బ్రహ్మానందం పాత్ర చిత్రంలో బాగా ఉపయోగపడింది కాని నవ్వించాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. జయప్రకాశ్ రెడ్డి మరియు ఇతర నటీనటులు అక్కడక్కడా నవ్వించారు..

కథ , ఈ చిత్రంలో కథ కొత్తదేమీ కాదు ఇప్పటికే పలుమార్లు చుసిన కథనే, కథనం కూడా కొత్తదేమీ కాదు కాని ఎక్కడా బోర్ కొట్టనివ్వలేదు రచయితలు మొదటి అర్ధ భాగం అంతా వినోదం తో నింపేసి రెండవ అర్ధ భాగం దగ్గర పూర్తిగా తడబడ్డారు చెప్పాల్సిన సెంటిమెంట్ అంశాలు ఎక్కువ అయిపోవడంతో ప్రతి మూడు సన్నివేశాలకు ఒక సెంటిమెంట్ సన్నివేశాన్ని రాసుకుంటూ వచ్చారు దీనివలన ప్రేక్షకుడు చివరి వరకు వచ్చేసరికి నీరసించి పోయారు. చివర్లో చిరంజీవి గారిని జొప్పించడం అనే ఆలోచన ఎవరిదో కాని వారే ఈ చిత్ర విజయానికి తొంభై శాతం కారణం అవుతారు. చివర్లో చిరంజీవి రాకపోయుంటే ప్రేక్షకుడు పూర్తిగా నిద్రపోయేవాడు. ఇటు వినోదం లేకుండా అటు హీరోయిజం లేకుండా సన్నివేశాలు రాసుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటో రచయితలకే తెలియాలి. మాటల్లో పంచ్ తక్కువయ్యి ప్రాస ఎక్కువయ్యింది, ఇకనయిన ప్రాస వదిలేసి అర్ధవంతం అయిన సంభాషణలు రాసుకుంటారని ఆశిద్దాం. శ్రీను వైట్ల దర్శకత్వంలో చెప్పుకోదగ్గ లోపం ఎం కనపడలేదు చెప్పుకోదగ్గ గొప్పతనం కూడా ఎం లేదు. సినిమాటోగ్రఫీ అందించిన మనోజ్ పరమహంస పనితనం అద్భుతం అయన ఒక్కో ఫ్రేం ని చూపించిన విధానం చిత్ర కథనం లో లేని కొత్తదనాన్ని తెచ్చి పెట్టింది. ముఖ్యంగా విదేశాల్లో చిత్రీకరించిన పాటల్లో సినిమాటోగ్రఫీ వీనులవిందు. ఫైట్స్ కంపోజ్ చేసిన కిచ మరియు రామ్ లక్ష్మణ్ పనితనం గుర్తించాల్సిన అంశాలు మాములు ఫైట్స్ లా కాకుండా విభిన్నంగా కనిపిస్తాయి ఈ చిత్రంలో ఫైట్స్. సంగీతం అందించిన తమన్ పాటలు బాగున్నాయి దాన్ని చరణ్ తన డాన్సు తో మరో స్థాయికి తీసుకెళ్ళారు. కీలక సన్నివేశాలను తమన్ తన నేపధ్య సంగీతంతో నిలబెట్టారు. ఎడిటింగ్ ఇంకా చాలా బాగుందల్సింది చిత్రంలో చాలా అనవసరం అయిన సన్నివేశాలు కనిపిస్తాయి ఇవన్ని కత్తిరించి ఉండాల్సినవి. యూనివర్సల్ మీడియా వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. 

పెద్ద చిత్రం పండగకే రానవసరం లేదు అలాంటి చిత్రాలు ఎప్పుడు వస్తే అప్పుడే పండగ అని ఒక పెద్ద దర్శకుడు అన్నారు ఈ చిత్రం కూడా పండగ వంటిదే ముఖ్యమయిన కారణం చిరంజీవి దాదాపుగా ఆరేళ్ళ తరువాత మరోసారి తెర మీద కనిపించడం. ఆ ఐదు నిమిషాల కోసం కొన్ని లక్షల కళ్ళు వేచి చూస్తున్నాయి. ఈ చిత్రం ఎంత రాబడుతుంది అనేది అంచనా వెయ్యలేకపోవచ్చు కాని ఎందుకు అంటే మాత్రం మొదటగా చెప్పుకోవలసిన కారణం చిరంజీవి ఆ తరువాతనే చరణ్ ఫైట్స్, డాన్సు అయినా , చిత్రం మొదటి అర్ధ భాగం చాలా వినోదాత్మకంగా సాగిపోతుంది. బలమయిన కథ లేకపోవడంతో తడబడే అవకాశం తక్కువ ఉంది దర్శకుడికి ఏది తోచితే ఆ సన్నివేశం ఎక్కడపడితే అక్కడ ఉంచేయ్యచ్చు ఇదే సూత్రాన్ని దర్శకుడు పాటించారు. సన్నివేశాల మధ్యన పొంతన లేదు కాని బోర్ కొట్టనివ్వలేదు. రెడీ, డీ లా కాకపోయినా ఈ చిత్రం మరొక విధంగా ఆకట్టుకుంది. చిరంజీవి గారిని మరొక్కసారి తెర మీద చూడాలని చాలామందికి ఉంటుంది మీరు అందులో ఒకరు అయితే వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. ఈ పండక్కి కుటుంబంతో చూడదగ్గ చిత్రమే ఇది ... 

Ram Charan,Rakul Preet,Srinu Vaitla,DVV Danayya,SS ThamanComing Soon.....

మరింత సమాచారం తెలుసుకోండి: