భారతీయ సంస్కృతికి పండుగలే పట్టుకొమ్మలు మన పండుగలకు సంబంధించి ప్రతివిషయం ఎదో ఒక ఆధ్యాత్మిక భావనతో ముడిపడి ఉంటుంది. మన పురాణ గాధలు ఆధారంగా ఏర్పడిన పండుగలు చాలమటుకు ఋతు సంబంధితమైనవి. మనం జరుపుకునే ప్రతి పండుగకు ఏదో ఒక అర్ధం అంతర్లీనంగా కనిపిస్తుంది. 

ఈరోజు నుంచి ప్రారంభం అవుతున్న దేవీ నవరాత్రులు మన భారతదేశంలోని అన్ని ప్రాంతాలవారు నిష్టగా జరుపుకునే తొమ్మిది రోజుల అమ్మవారి పండుగ. ఈ సృష్టికి అమ్మ మూలం కాబట్టి ఆ అమ్మను జగన్మాతగా ఆరాధించడం వేద కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. 

ఆశ్వయుజమాసంలో అమ్మవారి ఆరాధనతో మొదలై కార్తీకంలో శివుడి అర్చనలతో మరింత హోరెత్తిపోయి ధనుర్మాసంలో మహావిష్ణువును సేవించడం ద్వారా మన భారతీయ ఆధ్యాత్మికత పరాకాష్టకు చేరుకుంటుంది. దసరా నవరాత్రి రోజులలో చేసే ఏ సాధన అయినా పని అయినా గొప్ప విజయాన్ని చేకూరుస్తుందని మన నమ్మకం. దేవి నవరాత్రుల ఉత్సవాలలో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో కొలవడం మన సాంప్రదాయం. అమ్మవారి ఈ తొమ్మిది రూపాలకు తొమ్మిది రకాల శక్తులు ఉన్నాయని మన పెద్దలు చెపుతారు.

ఈరోజు అమ్మవారిని ‘శైలపుత్రి’ గా ఆరాధిస్తాం. పర్వతరాజైన హిమ వంతుని కుమార్తెగా అమ్మవారు జన్మించడంతో అమ్మ శైల పుత్రిగా ఈరోజు ప్రప్రధమ పూజ అందుకుంటుంది. దక్షిణ హస్తంలో త్రిశూలం వామ హస్తంలో పద్మం అలంకరింపబడి ఉంటాయి. ఈరూపంలో అమ్మ దేవతల అందరి గర్వాన్ని అణిచి వేసింది అనే పురాణ కధలు ఉన్నాయి. ఈ తొమ్మిది రోజులలో జరిగే అర్చనలు - అలంకారాలు - నైవేద్యాలు – వాహనాలు వేరువేరుగా ఉంటాయి. ఈ తొమ్మిది రోజులను అమ్మవారిని  దర్శించుకునే వారికి సకల విజయాలు కలుగుతాయి అని మన నమ్మకం. ఈ శరన్నవరాత్రులను అత్యంత భక్తిగా మన తెలుగువారు జరుపుకోవడం ఈరోజు నుంచి ప్రారంభం అవుతూ ఉండటంతో దసరా హడావిడితో తెలుగు వారి ఇళ్ళు అమ్మవారి పూజలతో కళకళలాడుతూ ఉంటాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: