ఐఐటీ విద్యార్థులంటే.. ఇంజినీరింగ్.. లో అత్యంత నాణ్యమైన విద్యకు అర్హమైన వారు కింద లెక్క. అందుకే కాబోలు.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే తిరుగులేని రికార్డులను నమోదుచేసిన బాహుబలి.. రూపకర్త రాజమౌళికి.. ఆ విద్యార్థులకు తన అనుభవ పాఠాలు బోధించే అవకాశం వచ్చింది.  సుప్రసిద్ధ దర్శకుడు ఎస్ ఎస్  రాజమౌళి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన మద్రాస్ ఐఐటీ తన విద్యార్థులకు బోధించవలసిందిగా రాజమౌళికి ఆహ్వానం పలికింది. మంగళవారం ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం బాహుబలి దర్శకుడు రాజమౌళి అక్టోబర్ 17న సంస్థ విద్యార్థుల ముందు ప్రసంగించనున్నారు.


ఉపన్యాసం తర్వాత రాజమౌళి విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయత్నంతో తాను తీసిన బాహుబలి చిత్రం షూటింగ్ విశేషాలు, విజువల్ ఎఫెక్టులు, గ్రాఫిక్స్, వేలాది  మంది కళాకారులను ఒకే చోట నిర్వహించడం వంటి అంశాలపై రాజమౌళి మద్రాస్ ఐఐటీ విద్యార్థులతో ముచ్చటించనున్నారు. బాహుబలి సినిమాతో రాజమౌళి ప్రతిభ ప్రపంచానికంతటికీ తెలిసింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో అతి పెద్ద మోషన్ పిక్చర్‌గా ప్రశంసలు అందుకున్న బాహుబలి సినిమా రాజమౌళికి ఒక్కసారిగా అంతర్జాతీయ ప్రచారం లభించింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సాధిస్తుండగానే తమిళనాడులోని వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు పెట్టిన పరీక్షలో బాహుబలి సినిమా నిర్మాణంపై కొన్ని ప్రశ్నలు సంధించడం తెలిసిందే.


పలు భారతీయ భాషల్లో డబ్ చేయబడిన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా విడుదలై 600 కోట్ల రూపాయల పైగా వసూలు చేసింది. త్వరలో చైనా,జపాన్, కొరియా వంటి దేశాల్లో పది వేల థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: