ఎబ్బే.. ఈ టాలీవుడ్ సినీ కథా రచయితలున్నారు చూశారూ.. బొత్తిగా సరుకు లేకుండా పోయిందండీ, వీళ్ల కథలను నమ్ముకుని నా 150 సినిమాను ఎలా తీసేదీ.. ఎలా బతికి బట్టకట్టేదీ.. ఇదీ 35 ఏళ్ల నటనా జీవితంలో 149 సినిమాలు తీసి 150వ సినిమా కోసం కొన్ని సంవత్సరాలుగా మల్లగుల్లాలు పడుతున్న ది గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి మనోగతం. టాలీవుడ్‌లో ప్రస్తుతం నాణ్యమైన రచయితలు కరవయ్యారన్నది ఆయన ఆరోపణ.

 

గతంలో యండమూరి వీరేంద్రనాథ్, సత్యానంద్, పరుచూరి బ్రదర్శ్ వంటి గొప్ప రచనా సామర్థ్యం ఉన్న రచయితలతో పనిచేసి అద్భుత విజయాలు సాధించిన చిరంజీవి కథ చెబుతా వినండి సారూ అంటూ తనవద్దకు వస్తున్న కథకుల్ని చూసి ఠారెత్తిపోతున్నారని ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది. ఇదే విషయాన్ని తన స్నేహితులు, నిర్మాతలతో ముచ్చటిస్తూ ఈరోజు తెలుగు చిత్రపరిశ్రమ మేటి రచయితలను కోల్పోయిందని తేలిగ్గా మాట్లాడుతున్నారని సమాచారం.

 

తన 150వ సినిమా కోసం పలువురు ప్రముఖ రచయితలతో కథా చర్చలకు కూర్చున్న చిరంజీవి వారు వండి చూపించిన కథలతో విసిగిపోయారని తెలుస్తోంది. తర్వాత ఇదే విషయాన్ని తన స్నేహితులతో ప్రస్తావిస్తూ టాలెంట్ అంతా ఎక్కడ పోయింది అని చిరంజీవి అడుగుతున్నారని తెలిసింది. ఇంతవరకు ఏ రచయితా తనకు 150వ సినిమా కోసం సంతృప్తికరమైన కథను చెప్పలేకపోయారని చిరంజీవి వ్యాఖ్యానించారట.

 

ఇటీవలికాలంలో పూరి జగన్నాథ్, కోన వెంకట్, ఆకుల శివ, పరుచూరి బ్రదర్స్, చిన్ని కృష్ణ వంటి ప్రముఖ దర్శకులు, రచయితలతో సిట్టింగ్ వేసి కథలు విన్న చిరంజీవికి తన అంచనాలకు తగిన కథతో ఎవరూ ముందుకు రాకపోవడంతో తీవ్రమైన ఆశాభంగానికి గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. కేవలం కథ సిద్ధంగా లేకపోవడం వల్లే డిసెంబర్‌లో ప్రారంభించాల్సిన తన కొత్త సినిమాకు ప్రయత్నాలను చిరంజీవి దాదాపుగా వదులుకున్నారని భోగట్టా.

 

పైగా బ్రూస్‌లీ సినిమా అట్టర్ ప్లాఫ్‌తో బొక్క బోర్లాపడి విదేశాలకు చెక్కేసి ఇటీవలే తిరిగొచ్చిన సుపుత్రుడు రామ్ చరణ్ తన తండ్రి స్థాయికి, లావుకు తగిన కథను సిద్ధం చేసేందుకు కొంతమంది బాలీవుడ్ రచయితలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: