సినిమాలకు జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డుల నుండి హాలీవుడ్ ఆస్కార్ అవార్డుల వరకు ఎదో ఒక అవార్డు వస్తే చాలు అని ఎందరో దర్శకులు నటీనటులు ఆశిస్తూ ఉంటారు. అయితే తన దృష్టిలో అవార్డులకు విలువలేదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి మాటలు యధాలాపంగా అన్నవా ? లేదంటే భారత్ నుండి ఆస్కార్ అవార్డు ప్యానల్ కు ఎంపిక అయిన సినిమాల లిస్టులో తన ‘బాహుబలి’ లేనందుకు కోపంతోనా అనే సందేహం రాజమౌళి మాటలు బట్టి వ్యక్తం అవుతోంది.

ఎంత ప్రముఖ స్థానంలో ఉన్నా కమర్షియల్ దర్శకుడు అయినా తన కృషికి ఎంతో కొంత అవార్డుల రూపంలో గుర్తింపు రావాలని కోరుకుంటాడు. అయితే దీనికి భిన్నంగా రాజమౌళి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ అవార్డులను వాటిని ఎంపిక చేసే క్రిటిక్స్ ను టార్గెట్ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. కేరళలోని రాజమౌళి సన్నిహిత మిత్రుడు మరియు ప్రముఖ ఆర్దోపెడిషియన్ అయిన ఒక డాక్టర్ కుమార్తె పెళ్ళికి వచ్చిన రాజమౌళి తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఈ కామెంట్స్ చేసాడు.

త్వరలో జరగబోతున్న ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమి’ అవార్డ్స్ కు సంబంధించిన 14 విభాగాలలో ‘బాహుబలి’ ఎంపిక అయిన విషయాన్ని మీడియా రాజమౌళి దృష్టికి తీసుకు వస్తూ ఎన్ని అవార్డులు వస్తాయి అని మీడియా ప్రతినిధులు రాజమౌళిని ప్రశ్నించినప్పుడు రాజమౌళి ఈ ఘాటైన వ్యాఖలు చేయడమే కాకుండా తాను ఎటువంటి అవార్డు ఫంక్షన్స్ కు హాజరుకాను అని కామెంట్స్ చేశాడు. అయినా తన యూనిట్ సభ్యులకు వీలైనన్ని ఎక్కువ అవార్డులు రావాలని కోరుకుంటున్నాను అని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు జక్కన్న.

ఇదే సందర్భంలో 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రాజమౌళి తీస్తాడు అని ప్రచారం జరుగుతున్న ‘గరుడ’ సినిమా గురించి ప్రస్తావించినప్పుడు తాను అంత భారీ బడ్జెట్ సినిమా గురించి కలలో కూడ ఊహించు కోవడం లేదని ప్రస్తుతం తన దృష్టి అంతా ‘బాహుబలి 2’ పైనే ఉంది అంటూ ‘గరుడ’ పై వస్తున్న వార్తలను కొట్టివేసాడు రాజమౌళి. ఈ సంచలన దర్శకుడు అవార్డ్స్ పై ఈ కామెంట్స్ చేసినా భవిష్యత్ లో ‘బాహుబలి’ కి సంబంధించి ఉత్తమ దర్శకుడుగా ప్రభుత్వ అవార్డులు రాజమౌళికి లభిస్తే ఆ అవార్డుల ఫంక్షన్ కు రాజమౌళి హాజరు అవుతాడా ? లేదా  అన్నది చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: