గతవారం కాస్త తగ్గిన ‘ఢమరుకం’ కలెక్షన్లు మళ్లీ పుంజుకున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గతవారం విడుదలైన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, అంతకుముందు విడుదలైన ‘కృష్ణం వందే జగద్గురం’ చిత్రాలే ఇందుకు కారణం అంటున్నారు ట్రేడ్ పండితులు. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్రం బాగుందని అందరూ అంటున్నా అనుకున్న స్థాయిలో జనాలని థియేటర్లకి రప్పించలేకపోతోంది. కథ బాగున్నప్పటికీ కథనం మరీ నెమ్మదిగా సాగడమే ఇందుకు కారణం అంటున్నారు. ఈ చిత్రం కంటే ముందు విడుదలైన ‘కృష్ణం వందే జగద్గురం’ కలెక్షన్లు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ‘ఢమరుకం’ చిత్రానికి వాతావరణం కలిసొచ్చింది అంటున్నారు. ఇప్పటికే నాగార్జున కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది ఢమరుకం. సంక్రాంతి లోపు విడుదలయ్యే భారీ చిత్రాలేవీ లేవు కాబట్టి ఈ చిత్రం ప్రమోషన్ మరికాస్త పెంచితే బాగుంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. 

మరింత సమాచారం తెలుసుకోండి: