చిరంజీవి 150వ సినిమాగా ‘కత్తి’ రీమేక్ అవడం మెగా స్టార్ వీరాభిమానులలో ఒక వర్గానికి ఇష్టం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. చిరంజీవి అభిమానులు అంతా తమ మెగా స్టార్ 150వ సినిమా గురించి ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటే ఈ వీరాభిమానులలోని ఒక వర్గం ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఒక సెంటి మెంట్ అని అంటున్నారు.

చిరంజీవి నాలుగు దశాబ్దాల కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. అయితే ఇప్పటి వరకు చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన చాల సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మిగిలిపోయాయి. టాప్ హీరోలు డిఫరెంట్ షేడ్స్ తో ద్విపాత్రాభినయం చేసినప్పుడు ఆ హీరోల అభిమానులు బాగా ఆనంద పడతారు. అయితే దీనికి భిన్నంగా చిరంజీవి అభిమానులకు భయంతో కూడుకున్న సెంటిమెంట్ ఉంది.

చిరంజీవి ఇప్పటి వరకు ద్విపాత్రాభినయం చేసిన సినిమాలో ‘అందరివాడు’, ‘ముగ్గురు మొనగాళ్ళు’, ‘స్నేహం కోసం’, నకిలీమనిషి’, ‘శివుడు శివుడు’, ‘సింహపురి సింహం’, ‘రిక్షా వాడు’ సినిమాలు అన్నీ కూడ భయంకరమైన ఫ్లాప్ రికార్డులను సొంతం చేసుకున్నాయి. దీనితో చిరంజీవికి ద్విపాత్రాభినాయాలు అచ్చి రావు అన్న సెంటిమెంట్ కు మెగా అభిమానులు వచ్చేశారు.

అయితే ఎన్నో ఆలోచనలు చేసి మరెందరో రచయితలు చెప్పిన కథలు విని చిట్టచివరకు ‘కత్తి’ రీమేక్ కు ఓకె చెపితే ఈసినిమా కథలో కూడ ద్విపాత్రాభినయం ఉండటంతో షాక్ అయిన మెగా అభిమానులు ఈ సెంటిమెంట్ ను గుర్తుకు చేస్తూ దర్శకుడు వినాయక్ కు మెసేజ్ లు పెడుతున్నట్లు టాక్. అయితే ఈ అనుకోని సెంటిమెంట్ తన దృష్టి వరకు రావడంతో వినాయక్ ‘కత్తి’ సినిమా కథలో ద్విపాత్రాభినయం లేకుండా కథ నడవని నేపధ్యంలో చిరంజీవి అభిమానులు తెర పైకి తీసుకు వచ్చిన సెంటిమెంట్ ను ఎలా అధిగమించాలీ అని తన రైటర్ టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: