జూనియర్ కొరటాల శివల కాంబినేషన్ లో ప్రారంభం కాబోతున్న ‘జనతా గ్యారేజ్’ సినిమాకు ప్రారంభం కాకుండానే ఒక అనుకోని సమస్య వచ్చి పడింది.సామాన్యంగా టాప్ హీరోల కొత్త సినిమాలు ప్రారంభం అవుతున్నాయి అని వార్తలు వస్తే చాలు ఆ కొత్త సినిమా పేరుతో అభిమానులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో దానికి సంబంధించిన సంబరాలు జరుపుకుంటూ ఆ సినిమాల పేర్లతో అభిమానుల అత్యుత్సాహంతో కొన్ని ఫ్యాన్స్ పేజీలు వెబ్ మీడియాలో ఓపెన్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు అటువంటి పరిస్థితి జూనియర్ ‘జనతా గ్యారేజ్’ సినిమాకు ఏర్పడి ఈసినిమా పేరుతో జూనియర్ అభిమానులు ట్విట్టర్ ,ఫేస్ బుక్ లలో విచ్చలవిడిగా ఫ్యాన్స్ పేజీలు ఓపెన్ చేసేస్తున్నారు. దీనితో షాక్ అయిన ఈసినిమా నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో జూనియర్ నటిస్తున్న 26వ సినిమాకు సంబంధించి ఫేక్ ఎక్కౌంట్స్ చాల కనిపిస్తున్నాయి అటువంటివి కనపడితే మాకు రిపోర్ట్ చేయండి అంటూ ట్విట్ చేసారు.
దీనిని బట్టి చూస్తూ ఉంటే టాప్ హీరోల సినిమాలకు పైరసీ సమస్యలే కాకుండా ఫేక్ ఎకౌంట్స్ సమస్యలు ఏ విధంగా వేదిస్తున్నాయో అర్ధం అవుతుంది. ఈ వార్తలు ఇలా ఉండగా జూనియర్ ‘జనతా గ్యారేజ్’ మూవీ షూటింగ్ ఈ నెల 10 నుండి ఆరంభం కావలసి ఉన్నా ఈసినిమాకు సంబంధించి సెట్టింగ్ ఇంకా పూర్తికానందున ఫిబ్రవరి 25కు ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిటింగ్స్ కూడ మొదలైన నేపధ్యంలో అన్నీ కుదిరితే ఇదే సంవత్సరం చివర్న ఈ సినిమాను విడుదల చేసే ఉద్దేశ్యంలో ఈ సినిమా దర్శక నిర్మాతలు ఉన్నట్లు టాక్..