నిన్న చిరంజీవి హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్ లో ఏర్పాటు చేసిన అభిమానుల సమావేశంలో తన 150వ సినిమా గురించి ప్రకటించడమే కాకుండా ఆ సినిమాకు ‘కత్తిలాంటోడు’ అన్న టైటిల్ ను పెడుతున్నట్లుగా సూచన ప్రాయమైన లీకులు ఇవ్వడంతో మెగా అభిమానులంతా జోష్ లో ఉన్నారు. అయితే ఈ టైటిల్ న్యూస్ బయటకు వచ్చి ఒక్కరోజు పూర్తి కాకుండానే ఈ టైటిల్ పై ఘాటైన విమర్శలు చేస్తూ చాల మంది వెబ్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

చిరంజీవి తన 150వ సినిమా గురించి వందల సంఖ్యలో కథలు విని చిట్ట చివరకు ఒక కోలీవుడ్ టాప్ హీరో సినిమా పై మోజుపడి రీమేక్ చేయడమే ఆశ్చర్యం అనుకుంటే ఆ ‘కత్తి’ సినిమా పేరు గుర్తుకు వచ్చేలా ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ తప్ప మరే టైటిల్ చిరంజీవికి వినాయక్ లతో పాటు వారి క్రియేటివిటీ టీమ్ కు వేరే పేరు తట్ట లేదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే విడుదలైన ‘స్పీడున్నోడు’ ‘దమ్మున్నోడు’ తో పాటు విడుదల కాబోతున్న ‘సరైనోడు’ టైటిల్స్ మాదిరిగా ఏ మాత్రం పసలేని ‘కత్తిలాంటోడు’ చిరంజీవికి ఎక్కడ దొరికిoది అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఇప్పటికే తమిళ దర్శకుడు మురగ దాస్ చిరంజీవికి ‘కత్తి’ సినిమా రీమేక్ నప్పదు అని ఓపెన్ గా కామెంట్ చేసినా పట్టించుకోకుండా అడుగులు వేస్తున్న చిరంజీవి తన 150వ సినిమా టైటిల్ విషయంలో కూడ పొరపాట్లు చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

చిరంజీవి అభిమానులు మెగా స్టార్ 150వ సినిమాకు  ‘ఠాగూర్’ ‘స్టాలిన్’ లాంటి టైటిల్ పెడతారు అని ఆశిస్తే చప్పగా ఉన్న ‘కత్తిలాంటోడు’ టైటిల్ పెట్టారని తెలుసుకుని బయటకు చెప్పలేకపోయినా లోలోపల తల పట్టుకుంటున్నారని టాక్. మరి ఈ విమర్శలు చిరంజీవి దృష్టి వరకు వెళితే ఈ టైటిల్ మారుస్తారేమో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: