మెగా కుటుంబానికి దేవిశ్రీ ప్రసాద్ కి ఉన్న సాన్నిహిత్యం ఈనాటిది కాదు. దేవిశ్రీ చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు తన తండ్రి సత్యమూర్తితో కలిసి చిరంజీవి ఇంటికి తరుచు వెళ్ళడమే కాకుండా చిరంజీవి పాటలకు చిరంజీవి ఎదురుగానే డాన్స్ చేసి చూపించిన సాన్నిహిత్యం దేవిశ్రీ ప్రసాద్ సొంతం. అటువంటి దేవిశ్రీ హీరో అవ్వడానికి రామ్ చరణ్ అడ్డుగా నిలుస్తున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే దేవిశ్రీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేయడానికి అవసరమైన కథను దర్శకుడు సుకుమార్ రెడీ పెట్టడమే కాకుండా ఆ సినిమాకు దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరించే ప్రాజెక్ట్ ను ఖరార్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ తరువాత దేవిశ్రీ తండ్రి సత్యమూర్తి చనిపోవడం ఆతరువాత డి ఎస్ పి తాను సంగీత దర్శకత్వం వహించే సినిమాలలో బిజీ అయిపోవడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. 

అయితే సుకుమార్ దేవిశ్రీల కాంబినేషన్ లో మూవీ ఈ సంవత్సరాంతంలో ప్రారంభం అవ్వడానికి రంగం సిద్ధం అవుతున్న నేపధ్యంలో అనుకోకుండా రామ్ చరణ్ సుకుమార్ చెప్పిన కథకు ఒకే చెప్పడంతో సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ సినిమాను పక్కకు పెట్టి ఇప్పుడు చరణ్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ కి తీసుకు వచ్చాడు. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం చరణ్ సుకుమార్ ల మూవీ చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగష్టు 22న ప్రారంభం కాబోతోంది. 

దీనితో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే మూవీ ప్రాజెక్ట్ ఇక శాస్వితంగా అటక ఎక్కినట్లే అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఇది ఇలా ఉండగా దేవిశ్రీ ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా చిరంజీవి 150వ సినిమాకు బాలకృష్ణ 100వ సినిమాకు సంబంధించిన ట్యూన్స్ ను కంపోజ్ చేస్తూ బిజీగా మారిపోయాడు దేవిశ్రీ..


మరింత సమాచారం తెలుసుకోండి: