ప్రపంచంలో దేనికైనా విలువు కట్టొచ్చుకాని మనస్పూర్తిగా నవ్వే నవ్వుకు విలువ కట్టలేం..ఎందుకంటే అది చాలా అరుదుగా వస్తుంది. మనస్పూర్తిగా నవ్వే నవ్వులో ఎలాంటి కల్మషం, భయం, బెరుకు అనేవి ఉండవు. అందుకే పెద్దలు అంటారు నవ్వు..నవ్వించు...నవ్వులు పంచు.  ఈ కాన్సెప్ట్ ఆ తరం చిత్రాలు తీసే దర్శకులు, నిర్మాతలు, నటులు బాగా వంట పట్టించుకున్నారు. అందుకే అప్పటి చిత్రాల్లో నవ్వు ఎంతో ఆరోగ్యవంతంగా ఉండేది..పలానా నటులు తెరపై కనిపిస్తే చాలు ప్రశాంతంగా కాసేపు మనసారా నవ్వించి పోతారు అన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉండేది.  అందుకే అలనాటి నటులు రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య,పద్మనాభం,రాజబాబు, అంజిగాడు,పేకేటి శివరావ్, గిరిజ,సూర్యాకాంతం,గీతాంజలి లాంటి నటులు హాస్యానికి చిరునామాగా ఉండేవారు. 


 మాయాబజార్లో ఘటోత్కచుణ్ణి, నీలి గోళా ల్లాంటి కళ్ళు అటు ఇటు తిప్పు కుంటూ కళ్ళు అవసరమైతే నోరూ కూడా తెరుచుకొని ఇండియా లోనే కాదు  నేడు  తానున్న జర్మనీ లో కూడా వదల కుండా చూస్తుంది వింటుంది. మా పాప ఆకాంక్ష  ఎందు కంటారు?  ఆ సినిమాల్లోని చక్కిలిగింతలు పెట్టే కొంగ్రొత్త పుంతలు త్రొక్కిన హాస్యరసం. ఈ ఆస్వాదన ప్రేక్షకుని మనసుకు రసా స్వాధన, తనువుకు పులకింత, కనులకు మనోహరం, ముఖానికి మందహాసం, శ్రవణాలకు ఆనందం, స్వప్నాల్లో మనసుకు అహ్లాదం, దేహానికి విశ్రాంతిని తుదకు ఖర్చుకు ప్రతిఫలం పంచేవి.


గుండమ్మ కథ.


 

అహ్లాద హాస్యం  పండించిన  తొలి నాలుగు  దశాబ్ధాల సినిమా:


ముచ్చటైన సినిమా 1955 లో విజయా వారే ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన మిస్సమ్మ. ఇందులో కూడా హాస్యానికి ప్రత్యేక ట్రాక్ లేదు. కథా, కథనం సామాజిక అంశాలే సునిశిత హాస్య ప్రవాహాన్ని సృష్టిస్థాయి.  ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, సావిత్రి, జమున ఎస్.వి.ఆర్ లాంటి హేమా హెమీలు  ప్రధాన హాస్య నటులు రేలంగి, రమణారెడ్డిని మరిపించి మనల్ని మురిపించారు. 


మిస్సమ్మ



మరో మాయాజలతారు మాయాబజార్ 1957 లో విజయా ప్రొడక్షన్స్ కె.వి.రెడ్డి దర్శకత్వంలో నిర్మించారు. ఇందు లో హాస్యాన్ని సినిమా నుండి వేరు చేయలేము. అందరు నటులూ హాస్యాన్ని రసవత్తరంగా పండించారు. ఎస్.వి.ఆర్, సావిత్రి, ఎన్.టి.ఆర్, ప్రధాన హాస్యనటుడు రేలంగిని మించి ఈ హాస్యాన్ని పండించారు. ఫ్రెష్నెస్...తాజాదనం...అహ్లాదం పంచే హాస్యం....బోరు కొట్టకపోవటం... చివరికి పసి కూనల్ని సైతం పరవశింప  చేసే చైతన్యం ఈ సినిమా  స్వంతం.  దర్శకుడు  కె.వి. రెడ్డి  ఈ  సినిమా  కోసం  ఒక  సంవత్సరం పాటు “ప్రీ-ప్రొడక్షన్”  పై పని చేశారు.  స్క్రిప్ట్  తీర్చిదిద్దారట.  ఈ సినిమా ని మనసారా చూసి, ఇంకా కొంత వినోదాన్ని తనతో  వెంట బెట్టుకెల్తాడు  ఇంటికి  ప్రేక్షకుడు.


అప్పుచేసి పప్పుకూడు



తెలుగులో పూర్తి హాస్యరస చిత్రం గా 6 దశాబ్ధాలు గా చెప్పుకొనే సినిమా "అప్పుచేసి పప్పుకూడు". తెలుగు సినిమాల హాస్య రసానికి సంభందించినంతవరకు ఈ సినిమా ఒక డిక్షనరీ (నిఘంటువు) గా చెప్పోచ్చు. ఈ సినిమా విజయ వాహిని స్టూడియోస్ బానర్ పై ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వములో 1959 లో వచ్చిన సంక్రాంతి సంబరం. ఈ సినిమా చూడని యువత నాడు లేదంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎన్.టి.ఆర్, ఎస్.వి.ఆర్, సావిత్రి, జమున, జగ్గయ్య, సి.ఎస్.ఆర్, సుర్యాకాంతం, ముక్కామల, రేలంగి, రమణారెడ్డి,అల్లు  రామలింగయ్య, శివ రావు, గిరిజ, ఆర్. నాగేశ్వరరావు నటీనటులుగా హాస్య రసవానలో జనాన్ని తడిపేశారు. ప్రముఖ హాస్యనటవర్గం రెలంగి, రమణారెడ్ది, అల్లు, గిరిజల హాస్యం తారస్థాయికి చేర్చితే అంతర్లీనంగా ఇతర స్తార్-కాస్ట్ హాస్యాన్ని చిరుజల్లులు తుంపరలు బిందువులు గా అందిస్తే ప్రేక్షక జనావళి హాస్య వర్షంలో తడి తడి చిత్తడై పోయారు. నిజంగా సంక్రాంతి పండగంతా హాస్యం తోనే గడచిపోయింది. ఈ సినిమాలో వెగటులేని హాస్యం సమాజలో వస్తున్న విపరీత పోకడలపై సెటైరికల్ గా ఉంటుందే తప్ప మలిన సృంగారం భూతులు ద్వందార్ధాలు లేకుండా హాస్య రసాన్ని పంచటం దర్శకుని గొప్పదనమే. 




మరో అద్భుత  హాస్యరస చిత్రం 1962 లో విజయా వారు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వము లో నిర్మించిన  గుండమ్మ కథ. ఈ సినిమాలో కూడా హాస్యం ( బిల్ట్-ఇన్)  ప్రత్యేక హాస్యం  ట్రాక్ లేదు. అందరూ అంటే ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్, సావిత్రి, జమున, ఎస్.వి.ఆర్, సూర్యాకాంతం, చాయాదేవి, హరనాధ్ ఇంకా మిగిలిన వారంతా ప్రధాన హాస్య నటుడు రమణారెడ్డిని మించి హాస్యరసాన్ని కడు రసాత్మకంగా పోషించారు. ఈ సినిమాలో ఒక ప్రధాన కథానాయకుడే కడుపుబ్బే హాస్యం నటించారు. హాస్యమేకాదు నవరసాలు వరదై ప్రేక్షకుల మనస్సులో సునామీ సృష్టించాయి.




తొలితరం నటులందరూ అన్నీ పాత్రలు పోషించినా పూర్తి హాస్య పూరిత పాత్రలకే పరిమితమైన నటులు రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, రాజబాబు, శివరావు, బాలకృష్ణ సూర్యాకాంతం, చాయాదేవి,  గిరిజ, గీతాంజలి, రమాప్రభ, చలం, అల్లు రామలింగయ్య  ముఖ్యహాస్య నటీ నటులుగా రాణించారు. చలం హాస్య కథానాయకుడు గా తెలుగులో కొన్ని ఆణిముత్యాల నందించాడు మట్టిలో మాణిక్యం, తోట రాముడు, బొమ్మా-బొరుసా, చైర్మన్ చలమయ్య చెప్పుకోదగ్గ మరపురాని సినిమాలు.




పై సినిమాలన్నీ,  కుటుంబమంతా కలసి మెలిసి చూసి, హాస్యం ఆస్వాదించటానికి కారణం అపహస్యం  లేక పోవటమే.  నాటి  సినిమాల కు నేపద్యం సమకాలీన సమాజమే. సమా జములోని సంఘటనల ల్లోంచి పుట్టిన సహజ హాస్యాన్ని కథా, కథనంలో మిళితం చేసి సహజ  హాస్య రసాను భూతిని కలిగించారు. 




బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (బి.ఎన్.రెడ్డి) ఆలూరి చక్రపాణి  ఆద్వర్యంలో విజయా ప్రొడక్షన్స్ వారు హాస్యాన్ని అమృతప్రాయంగా భావించారు. ఆరేడు దశాబ్ధాలుగా వీరి తదనంతరం కూడా విజయా సంస్థ విజయవంతంగా సినిమాలు నిర్మించారు. 24 ఫ్రేంస్ లో వీరు నిష్ణాతులే. మనం హాస్యం గురించి మాట్లాడు తున్నాం కనుక హాస్యానికి ఒక రూపు, రేఖా ఇచ్చిన గణనీయనిర్మాతలు విజయాసంస్థ. వీరి దర్శకులు ఎల్.వి ప్రసాద్, కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావులు కూడా అద్భుత హాస్యాన్ని రూపుదిద్దిన తొలితరం దర్శకులే.



మరింత సమాచారం తెలుసుకోండి: