తెలుగు ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను ఈ సంవత్సరం అల్లు అర్జున్ కి సరైనోడు చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందించాడు. అయితే తాజాగా బోయపాటిపై  అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీరాజ్ బోయపాటిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ విరుచుకుపడ్డాడు.  2015 గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట అంశం సినీ దర్శకుడు బోయపాటి శ్రీనును ముఖ్య కారకుడని ఆయన ఆరోపిస్తున్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పుష్కర తొక్కిసలాట సమయంలో బోయపాటి శ్రీనివాస్ వద్ద మైక్ ఉందని, ఆయన భక్తులను వదలండీ అనగానే పుష్కరాల రేవు గేట్లు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందారని వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వచ్చి మైక్ తీసుకొని భక్తులను ఘాట్‌లోకి వదలమని చెప్పడానికి అతనికి ఏ అర్హత ఉందని ప్రశ్నించారు. ఆయన చేతికి మైక్ ఇచ్చిన సమాచార శాఖ కమిషనర్, కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎస్పీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో 2015 జూలై 21 వ తేదీన ఫిర్యాదు చేశామని, దానికి త్రీటౌన్ సీఐ శ్రీరామ కోటేశ్వరరావు రశీదు ఇచ్చారన్నారు. పుష్కర తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్‌కు కూడా ఎఫ్‌ఐఆర్ కాపీని పంపలేదని తెలిపారు.

దురదృష్టవశాత్తు పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు పొగొట్టుకోవడంతో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇప్పుడు శ్రీరాజ్ ఆ కార్యక్రమంలో పర్యవేక్షణ టీంలో ఉన్న బోయపాటిపై ఆరోపణలు గుప్పించారు. మరి క్రిమినల్ కేసులు పెట్టాలన్న వ్యాఖ్యల నేపథ్యంలో దర్శకుడు బోయపాటి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: