హీరోలపై అభిమానం ఉండటంలో తప్పులేదని.. కానీ క్షణికావేశంలో ప్రాణాలు తీయడం లేదా.. ప్రాణాలు పోగొట్టుకోవడం వంటి చర్యలకు దిగవద్దని అభిమానులకు టాలీవుడ్ హీరో, జనసేన అధినేత, పవర్ స్టార్  పవన్ కల్యాణ్ సూచించారు. తమ హీరో గొప్పవాడంటే.. తమ హీరో గొప్పవాడంటూ కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో ఘర్షణకు దిగి.. ప్రాణాలు కోల్పోయిన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన చిత్తూరు జిల్లా తిరుపతి వచ్చారు. 


దుఃఖసాగరంలో మునిగిన వినోద్‌ కుటుంబసభ్యులను పవన్ కల్యాణ్ ఓదార్చారు. కొడుకును కోల్పోయిన ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వినోద్‌ మృతి తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. కోలార్ లో హత్యకు దారితీసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వినోద్‌ కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం పవన్ తన అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. అభిమానులు మితిమీరిన స్థాయికి వెళ్లి గొడవ పడి ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లాల్సిన యువకుడు విగతజీవిగా మారడం తల్లిదండ్రులకు తీరని శోకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వినోద్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.


చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన వినోద్ రాయల్, పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. పవన్ పై ఉన్న అభిమానంతో.. పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున ఏ కార్యక్రమం జరిగినా ముందుండేవాడు. ఈనెల 21న కర్ణాటకలోని కోలార్ లో పవన్ కల్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాడు. 


కార్యక్రమం తరువాత స్నేహితులంతా పిచ్చాపాటిగా మాట్లాడుకోసాగారు. మధ్యలో టాలీవుడ్ కు చెందిన మరో యంగ్ హీరో అభిమాని తమ హీరో గొప్పవాడని అనడంతో.. వినోద్, అతని మధ్య వాగ్వాదం జరిగింది. తమ హీరో గొప్పంటే, తమ హీరో గొప్పంటూ ఇద్దరూ గొడవ పడ్డారు. ఆవేశం ఆపుకోలేని యంగ్ హీరో అభిమాని కత్తితో వినోద్ ను పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ వినోద్ ను స్నేహితులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వినోద్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. 


హీరోలు, అభిమాన నటులపై అభిమానం ఉండవచ్చు కానీ, అది మితిమీరకూడదు అనడానికి వినోద్ రాయల్ ఘటన ఓ ఉదాహరణ. అభిమానులు.. ఇకనైనా అభిమానానికి హద్దులు పెట్టండి.. ఓ పని చేసే ముందు.. మీపై ఆధారపడిన వారి గురించి ఆలోచించండి. మీ అనాలోచిత, ఆవేశ నిర్ణయాలతో వారికి శోకాన్ని మిగల్చొద్దు. 


మరింత సమాచారం తెలుసుకోండి: