పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభ తరువాత పవన్ ను టార్గెట్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీల నాయకుల మాటల దాడి కొనసాగుతూ ఉంటే పవన్ కు నేనున్నాను అంటూ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు రంగంలోకి దిగడం సంచలనంగా మారింది.  తెలుగు సినిమా రంగానికి సంబంధించి పవన్ తిరుపతి మీటింగ్ తరువాత బహిరంగంగా పవన్ కు వత్తాసు పలుకుతూ రంగంలోకి దిగిన మొట్టమొదటి సినిమా సెలెబ్రెటీగా సంపూ ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసాడు. 
 
ఆంధ్రప్రదేశ్‌ కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటూ సంపూ చేసిన ట్విట్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.   అయితే ట్విస్ట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచిస్తున్న సంపూర్ణేష్‌ పుట్టి పెరిగింది తెలంగాణలోనే అన్న విషయం ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

'నేను తెలంగాణకు చెందినవాడ్ని అయినా పొరుగు రాష్ట్రంలోని తెలుగు ప్రజల కోసం పోరాడదలుచు కున్నాను. పవన్‌కళ్యాణ్‌, ప్రత్యేక హోదా కోసం నినదించిన తర్వాతే అక్కడి సమస్య తీవ్రత నాకు అర్థమయ్యింది.  ప్రతి తెలుగువాడూ ఈ విషయంలో పవన్‌కళ్యాణ్‌కి మద్దతివ్వాలి.  ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. నా వరకూ నేను పవన్‌కళ్యాణ్‌తో గొంతు కలపదలచుకున్నాను.  ప్రత్యేక హోదా నినాదాన్ని కేంద్రానికి వినిపించేందుకు పవన్‌తో కలిసి ముందడుగు వేస్తాను'  అంటూ సోషల్‌ మీడియా ద్వారా తన మనసులో మాట బయటపెట్టాడు ఈ బర్నింగ్ స్టార్.

అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో సినీ పరిశ్రమ స్పందించాల్సిన పరిస్థితి ఆసన్నంమైందని తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రేక్షకులు కూడ టిక్కెట్లు కొని సినిమాలు  చూడ్డం వల్లే టాలీవుడ్ అభివృద్ధిలోకి రావడమే కాకుండా మరెందరో కళాకారులు వెలుగులోకి వచ్చిన సందర్భాన్ని మరిచి పోకూడదు అంటూ సంపూర్ణేష్‌ ఇచ్చిన ట్విస్ట్ కు టాలీవుడ్ లోని చాల వర్గాలు షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

గతంలో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరిగినప్పుడు సినిమా రంగానికి చెందిన కొతమంది ప్రముఖులు ప్రత్య్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బహిరంగంగా సపోర్ట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజన తరువాత సీమాంద్ర ప్రజలు స్పెషల్ స్టేటస్ కోసం అనేక సార్లు ఉద్యమాలు బంద్ లు చేసినా టాలీవుడ్ సినిమా రంగానికి సంబంధించి ఒక్క హీరో శివాజీ తప్ప మరెవ్వరూ సీమాంద్ర ప్రజలకు బహిరంగంగా మద్దతు పలుకుతూ మాట్లాడిన సందర్భాలు లేవు.

ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న టాప్ హీరోలు అంతా సీమాంద్ర ప్రాంతానికి చెందిన వారే అయినా ఏ ఒక్క టాప్ హీరో కనీసం సంపూర్ణేష్‌  స్పందించిన స్థాయిలో బహిరంగంగా స్పందించలేదు అన్నది వాస్తవం.  పవన్ తన మౌనాన్ని వీడి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ విషయంలో స్పందించడానికి రెండు సంవత్సరాల సమయం తీసుకుంటే కేవలం పవన్ ఉపన్యాసం విని సంపూ రెండు రోజులలో స్పందించడం ఒక విధంగా రికార్డు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: