బాహుబలి 1 రిలీజ్ కావడం.. రికార్డ్ లు బద్ధలు కొట్టడంతో.. అందరి చూపు తరువాత రాబోయే బాహుబలి-2పై పడింది. 
బాహుబలి 2 స్టోరీ లైనప్ ఏంటి? ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపుతాడనేది అర్ధం కాక అభిమానులు బుర్ర బద్ధలు కొట్టుకున్నారు. ఎవరికి తోచిన కథనాలు వారు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో బాహుబలి 2 స్టోరీ ఇదేనంటూ చాలా స్టోరీలు సోషల్ మీడియాలో హల్ చేశాయి. అయితే అవి నమ్మశక్యం కాకపోవడంతో అంతా లైట్ తీసుకున్నారు. తాజాగా బహుబలి-2 స్టోరీ ఇదేనంటూ ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా ఆస్టోరి బాహుబలి 1 ఎండింగ్ తో ప్రారంభమవడంతో.. ఇదే కరెక్ట్ స్టోరి అనే వాదనకు బలం పెరుగుతోంది. 


సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కథనం ప్రకారం.. బాహుబలి 2.. బాహుబలి 1 క్లైమాక్స్ లో కట్టప్ప, అమరేంద్ర బాహుబలిని తానే పొడిచానని చెప్పడంతో ప్రారంభమౌతుంది. తరువాత మిగిలిన స్టోరీని బాహుబలి కొడుకైన శివుడికి చెబుతాడు. కాలకేయుడిని యుద్ధంలో అంతమొందించడంతో.. శివగామి తీర్పు మేరకు మాహిస్మతి రాజ్యానికి అమరేంద్ర బాహుబలి రాజవుతాడు. రాజ్యపీఠం తన కొడుకు భల్లాలదేవకు దక్కకపోయే సరికి.. బిజ్జల దేవ కోపంతో రగిలిపోతాడు. అమరేంద్ర బాహుబలి పాలనలో మాహిస్మతి సామ్రాజ్యం సుఖసంతోషాలతో తులతూగుతూ ఉంటుంది. మాహిస్మతి రాజ్యానికి సమీపంలో ఉన్న కుంతల రాజ్యం ఉంటుంది. దానికి దేవసేన మహారాణి. రాజ్యంలో ఆమె చెప్పిందే వేదం, చేసిందే చట్టం. కుంతల రాజ్యంపై చిన్న చిన్న రాజ్యాలు జరిపే దాడిని దేవసేన సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఒక అనుకోని ఘటనలో దేవసేనను, అమరేంద్ర బాహుబలి చూస్తాడు. అక్కడి నుండి వారిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. 


బాహుబలి, దేవసేనను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న భల్లాల దేవ.. తాను కూడా ఆమెను ఇష్టపడతాడు. కొడుకు మనసును గ్రహించిన బిజ్జల దేవ .. కుంతల రాజ్యానికి వర్తమానం పంపుతాడు. దేవసేన నిరాకరిస్తుంది.  బాహుబలి, భల్లాల దేవ, శివగామి వ్యవహారంపై బిజ్జల దేవ, శివగామితో చర్చిస్తాడు. సొంత కొడుకైన భల్లాలదేవని రాజును చేస్తానని మాట ఇచ్చి తప్పావని శివగామిని ఎత్తిపొడుస్తున్నాడు. ఇప్పుడు మన కొడుకుకు ఇష్టమైన ఆ దేవసేనను, నువ్వు పెంచిన బాహుబలి కూడా ఇష్టపడుతున్నాడు. ఈ విషయంలో కొడుకుకు ఏం న్యాయం చేస్తావో చెయ్యి అంటూ నిలదీస్తాడు. ఏం చెప్పాలో తెలియక శివగామి ఆలోచనలో పడుంది. 


తన అన్న ప్రాణాలు తీసిన మాహిస్మతి రాజ్యంపై కాలకేయుడు తమ్ముడు నింజా(చరణ్ దీప్) పగతో రగిలిపోతుంటాడు. కుంతల రాజ్యం నుండి విదేయుడు (సుబ్బరాజు) బిజ్జల దేవ పంపిన వర్తమానానికి, ప్రతివర్తమానం తీసుకుని మాహిస్మతి రాజ్యానికి వస్తాడు.  బిజ్జల దేవ పంపిన వర్తమానాన్ని కుంతల రాజ్య రాజు తిరస్కరించినట్లు చెబుతాడు. ఆ సభలో విదేయుడిపై భల్లాల దేవ దాడి చేయబోతే.. బాహుబలి అడ్డుకుంటాడు. విదేయుడిని కాపాడుతాడు. దీంతో బిజ్జల దేవ సభలో గొడవను రాజేస్తాడు. శివగామి ఏమీ మాట్లాడకుండా జరుగుతుందంతా చూస్తూ ఉంటుంది. దేవసేనతో పెళ్లి విషయాన్ని తన తల్లి శివగామి నిర్ణయానికి వదిలేస్తున్నానని, ఆమె నిర్ణయం శిరోధార్యమని బాహుబలి చెబుతాడు. శివగామి తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తుండగా.. రాజ్యం కావాలో.. ప్రేమ కావాలో  తేల్చుకోమని ఆమె బాహుబలి నిర్ణయానికే వదిలేస్తుంది.


బాహుబలి ఏం కోరుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. ప్రేమే కావాలని ప్రకటిస్తాడు. బాహుబలి నిర్ణయంతో మాహిస్మతి రాజ్య ప్రజలు కంగుతింటారు. రాజ్యం వదిలి వెళ్లొద్దని వేడుకుంటారు. తమకు బాహుబలి కావాలని నినదిస్తారు. కానీ బాహుబలి మాత్రం  మాహిస్మతి రాజ్యాన్ని వీడి.. బౌద్ధ మటానికి బయల్దేరతాడు. విషయం తెలుకున్న దేవసేన బాహుబలికి తోడుగా వెళ్తుంది. అక్కడ బాహుబలి, దేవసేన పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తుంటారు. దేవసేన గర్భవతి అవుతుంది.


బాహుబలి రాజ్యాన్ని వీడి పోవడంతో.. రాజ్యమంతా భల్లాల దేవ ఆధీనమౌతుంది. ఆ సమాచారమందుకున్న కాలకేయ రాజు నింజా మాహిస్మతి రాజ్యంపై యుద్ధానికి దిగుతాడు. భల్లాల దేవ నేతృత్వంలోని మాహిస్మతి సైన్యం కాలకేయ సైన్యంతో యుద్ధం చేస్తుంది. మొదటి రెండు రోజులు మాహిస్మతి సైన్యం పరాభవాన్ని చవిచూస్తుంది. కాలకేయ సైన్యం చేతిలో మాహిస్మతి సైన్యం సగం మందికి పైగా చనిపోతారు. మాహిస్మతి రాజ్యం కాలకేయ వశం కాబోతున్న తరుణంలో శివగామి బాహుబలికి వర్తమానం పంపుతుంది. గర్భవతి అయిన దేవసేనతో కలిసి బాహుబలి మాహిస్మతి రాజ్యానికి వస్తాడు. కాలకేయ సైన్యంపై యుద్ధంలో.. మాహిస్మతి రాజ్యానికి, కుంతల రాజ్యం సహాయం చేస్తుంది. మరోవైపు బాహుబలి తిరిగి రావడంతో.. మాహిస్మతి రాజ్యాధికారం తమ చేతి నుండి ఎక్కడ జారిపోతుందోనని భల్లాలదేవ, బిజ్జల దేవ భయపడుతుంటారు.


బాహుబలిని చంపాలని, మాహిస్మతి రాజ్యానికి నమ్మని బంటులా ఉండే కట్టప్పని, భల్లాల దేవ, బిజ్జల దేవ ఆదేశిస్తారు. రాజు చెప్పిందే వేదంగా భావించే కట్టప్ప అందుకు అంగీకరిస్తాడు. యుద్ధంలో కాలకేయ సైన్యంపై మాహిస్మతి రాజ్యం విజయం సాధిస్తుంది. యుద్ధ సమయంలోనే బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు. బాహుబలి మరణ వార్తతో మాహిస్మతి రాజ్యంలో విషాద చాయలు కమ్ముకుంటాయి. దేవసేన తొమ్మిదినెలల నిండు గర్భిణి కావడంతో.. శివగామి దగ్గరుండి చూసుకుంటుంది. బాహుబలిని ఆదరించిన వారందరిని భల్లాల దేవ హింసించడం మొదలు పెడతాడు. తనను కాదని బాహుబలిని పెళ్లి చేసుకున్న దేవసేనను చెరసాలలో బంధిస్తాడు. దేవసేనకు బిడ్డ పుట్టడంతో.. ఆ బిడ్డను శివగామి పెంచుతుంది. బాహుబలి బిడ్డను చంపాలన్న భల్లాలదేవ కుట్రను కట్టప్ప.. శివగామికి చేరవేస్తాడు. అలాగే బాహుబలిని తన భర్త, కొడుకు కలిసి చంపించారని శివగామికి తెలుస్తుంది. 


బాహుబలి బిడ్డకు ప్రాణహాని తప్పదని భావించిన శివగామి బిడ్డతో రాజ్యం నుండి పారిపోతుంటే.. భల్లాలదేవ సైన్యం ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు. ఆ పోరు శివగామి సైనికులను చంపి.. నది దాటే ప్రయత్నంలో బిడ్డను చేతిలో పట్టుకుని చనిపోతుంది. ఆ బిడ్డను జలపాతానికి దిగువున వుండే గూడెం పెద్ద పెంచి పెద్దచేస్తుంది. అక్కడితో కట్టప్ప బాహుబలికి జరిగిన అన్యాయాన్ని గురించి శివుడికి చెబుతాడు. 


తన కొడుకు బద్రుడి శిరచ్ఛేదనం చేసిన శివుడిపై భల్లాల దేవ పగతో రగిపోతుంటాడు. మరోవైపు తన భర్త బాహుబలిని చంపి, తనను చెరసాల పాలు చేసిన భల్లాలదేవపై దేవసేన కూడ కసితో వుంటుంది. శివుడు తనకంటూ ఓ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. శివుడికి కుంతల రాజ్యం తోడవుతుంది. అప్పటి వరకు మాహిస్మతి రాజ్యానికి నమ్మినబంటుగా ఉన్న కట్టప్ప.. శివుడి వైపు మారిపోతాడు. వాళ్లకి ఆయుధాలు సరఫరా చేసే వ్యక్తి కిచ్చా(సుదీప్) సహాయం చేస్తాడు.  శివుడికి, మాహిస్మతి రాజ్యానికి జరిగిన పోరులో.. భల్లాల దేవ ఓడిపోతాడు. దీంతో.. మాహిస్మతి రాజ్యంలో అందరూ చూస్తుండగా.. భల్లాల దేవుడ్ని చితిమీద పడుకోబెట్టి..... దేవసేన సజీవ దహనం చేస్తుంది. కొడుకు మృతిని తట్టుకోలేక బిజ్జల దేవ కూడా కన్నుమూస్తాడు. శుభం కార్డు పడుతుంది.


సోషల్ మీడియా వైరల్ లా మారిన ఈ స్టోరీ.. పక్కా బాహుబలి 2 స్టోరీ అవునో కాదో తెలియాలంటే.. 2017 ఏప్రిల్ 28 వరకు 
ఆగాల్సిందే. బాహుబలి సినిమా స్టోరీ బయటకు రాకుండా.. దర్శకుడు రాజమౌళి.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులను కూడా పూర్తిగా నమ్మలేదు. కొంత మందికి మాత్రమే సినిమా లైనప్ ను చెప్పి.. వారు ఎవరితో చెప్పకుండా ప్రమాణం చేయించుకున్నాడట. 



మరింత సమాచారం తెలుసుకోండి: