ఖైదీ నెం. 150 సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తనలో ఊపు ఏమాత్రం తగ్గలేదని చిరు మరోసారి నిరూపించుకున్నారు. ఐతే.. చిరంజీవికి విజ్ఞప్తి అంటూ ఓ అభిమానుల పేరుల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఈ పోస్టుపై అనుకూల, ప్రతికూలవాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పోస్ట్ మీ కోసం.. 
 


చిరంజీవి గెలిచారు - అభిమానులు ఓడిపోయారు
.. ఏదైనా వృత్తిలో ఒక స్థాయికి వెళ్లే వరకు డబ్బు సంపాదన ముఖ్యం. డబ్బు తర్వాత పేరు కోసం తపించాలి. ఉన్నత శిఖరాలకు చేరుకున్నాకా సంతృప్తి కోసం పనిచేయాలి. కానీ చిరంజీవి ఏం చేశారు? ఈ సినిమాతో ఏం సాధించారు?  30 ఏళ్ల నటప్రస్థానంలో చేయలేనిది 150వ సినిమాలో ఏం చేశారు? పదేళ్ల తర్వాత బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ వచ్చి ఇతర హీరోలు చేయలేనిది ఏం చేశారు? పదేళ్లు ఆశగా ఎదురుచూసిన అభిమానులకు ఏం ఇచ్చారు? స్టంట్లు, స్టెప్పుల్లో తనను కొట్టే వాడే లేడని ఇప్పుడు కొత్తగా ఎస్టాబ్లీష్ చేసుకోవాలా?



పాతికేళ్ల క్రితమే డాన్సులు, ఫైట్లలో చిరు నెంబర్‌ వన్‌. చిరంజీవి అంటే ఫైట్స్‌, డాన్స్‌ ఒక్కటేనా? దీనికా పదేళ్లు ఆగింది? తమిళం వాళ్లు నలిపేసిన సినిమా. అనేక సినిమాల్లో వాడేసిన రొటీన్ ఫార్ములా. కార్పోరేట్లు, కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా నిలబడి, కలబడిన ఖలేజా, రామయ్య వస్తావయ్యా, రఘువరన్‌ బీటెక్‌, బన్నీ ఇలాంటివి ఎన్ని సినిమాలు లేవు? ఒకరి స్థానంలోకి ఇంకొకరు ప్రవేశించడం బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి ఉన్నదే కదా. పద్మభూషణ్‌ చిరంజీవి గారు, 61న్నర ఏళ్ల వయస్సులో అమ్మడూ..కుమ్ముడూ ఏంటి మాస్టారు?



అమితాబ్‌ సాబ్‌ను చూడండి. మీలాగే ఇండస్ట్రీని రూల్‌ చేశారు. వయస్సుతో పాటు హుందా పాత్రల్లో ఒదిగిపోతున్నారు. అమీర్‌ఖాన్‌ ఒక పీకే, ఒక దంగల్‌ చూడండి. వాళ్లకంటే మా దృష్టిలో మీరే ఉన్నతులు. అలాంటి మీ నుంచి ఇలాంటి సినిమానా? ఖైదీ 150 బాగోలేదనో ఇంకోటో మా బాధ కాదు. రొటీన్‌ స్టోరీ, డాన్సులు, ఫైట్స్‌ గట్రా సూపర్‌. కానీ అసంతృప్తిగా ఉంది సార్‌. 
ఎంతకాలం మీ నామస్మరణ చేశాం? మళ్లీ మీరు సినిమాలు చేయాలి అని సోషల్‌ మీడియా గోడలపై రాశాం, గొంతెత్తి కూసాం. పది సంవత్సరాలు అంటే మనిషి జీవితంలో అత్యంత విలువైన కాలం 150వ సినిమా అంటే ఓ హీరో కెరియర్‌లో అత్యంత విలువైన ఘట్టం. 61 సంవత్సరాల 4 నెలల 20రోజులు అంటే షష్ఠిపూర్తి దాటిన వయస్సు. 30ఏళ్ల సినీజీవితంలో ఎన్నో మైలురాళ్లు, గొప్ప పాత్రలు భారతదేశ అత్యున్నత పౌరపురస్కారాల్లో 3వ ఉన్నత పురస్కారం. ఓ ఏడాది ముందు నుంచీ వర్కవుట్‌ చేస్తే ఎంత గొప్ప కథను సిద్ధం చేయాలి?



చిరంజీవి సినిమా అంటేనే ఒక సంచలనం. అలాంటిది 150 అంటే????? ఏంటన్నయ్యా అంత మూస సినిమా తీశారు? దేని గురించి చెప్పుకోవాలి? ఏ విషయంలో ట్రెండ్‌ సెట్టర్‌లా ఉందన్నయ్యా? ఇంకా మీ నుంచి ఏదో ఆశించాం. ఆ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అయినా బాగుండేది అన్నియ్యా. కలెక్షన్లు బాగున్నాయి. సినిమా రైట్స్‌ లాభదాయకంగా అమ్ముడుపోయాయి.
మీరు ఆడిన సేఫ్‌ గేమ్‌లో మీరు- చరణ్‌ బాబు గెలిచారు కానీ మేమే ఓడిపోయాం అన్నయ్యా! ఉయ్‌ ఆర్‌ వెరీ సారీ



మరింత సమాచారం తెలుసుకోండి: