నిన్న మహాశివరాత్రి సందర్భంగా దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి 2’ విశేషాల పై  అనేక ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. యాంకర్ సుమ రాజమౌళితో జరిపిన ప్రత్యేకమైన ఈ ఇంటర్వ్యూను నిన్న ప్రముఖ ఛానల్స్ అన్నీ ప్రసారం చేసాయి.  

ఈ ఇంటర్వ్యూలో ఈమూవీకి సంబంధించిన అనేక విషయాలను రాజమౌళి షేర్ చేసుకున్నాడు. మొదట్లో ఈసినిమాలో అమరేంద్ర బాహుబలి కొడుకు పాత్రలో నటించిన ప్రభాస్ కు ‘శివుడు’ అన్న పేరుకు బదులు  ‘నంది’ అన్న పేరు పెట్టాలనే ఆలోచనలు వచ్చినట్లు తెలిపాడు. అయితే తనను తన ఇంటిలోని వారు అంతా ‘నంది’ అని పిలుస్తారు కాబట్టి తన ముద్దుపేరు ప్రభాస్ కు బాగుండదు అని భావించి ప్రభాస్ కు శివుడు అన్న పెట్టిన విషయాన్ని బయట పెట్టాడు. 

ఇదే ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ‘బాహుబలి 2’ రిలీజ్ డేట్ పై మరొక ట్విస్ట్ ఇచ్చాడు.  ఈసినిమా విడుదల డేట్ ను చెప్పండి అని సుమ స్పష్టంగా అడిగినప్పుడు అది శివుడు ను అడగండి అని రాజమౌళి ఈ ఇంటర్వ్యూలో అనడం బట్టి ‘బాహుబలి 2’ రిలీజ్ డేట్ పై మళ్ళీ రాజమౌళి ఆలోచనలు మారుతున్నాయా అని అనిపించడం సహజం. ఇది ఇలా ఉండగా శివరాత్రి సందర్భంగా ఈమూవీకి సంబధించిన మరొక లేటెస్ట్ స్టిల్ ను విడుదల చేసి ప్రభాస్ అభిమానులకు జోష్ ను పెంచాడు రాజమౌళి.

భారీ ఏనుగు తొండం మీద హీరో ప్రభాస్ మాంచి రాజసమైన ఫోజ్ ఇస్తున్న పోస్టర్ ను నిన్న విడుదల చేసారు. నిన్న మహాశివరాత్రి కావడంతో రాజమౌళి తనకు కలసి వచ్చిన శివుడు సెంటిమెంట్ తో ‘బాహుబలి 2’ ప్రమోషన్ ను అధికారికంగా మొదలు పెట్టాదనుకోవాలి. అయితే ఫిబ్రవరి చివరికి వచ్చేసినా ఈసినిమా రిలీజ్ డేట్ గురించి రాజమౌళి ఇంకా ఎప్పుడు అన్నది స్పష్టమైన క్లారిటీ ఇవ్వక పోవడంతో ఈ ఇంటర్వ్యూ చూసినవారికి రాజమౌళి ‘బాహుబలి 2’ యాక్షన్ ప్లాన్ మారిందా అని అనిపించడం సహజం..   


మరింత సమాచారం తెలుసుకోండి: