మనదేశంలో ఏటా వందలాది సినిమాలు విడుదలవుతుంటాయి. అన్ని భాషల్లో కలుపుకుంటే ఈ సంఖ్యల వేలల్లోనే ఉంటుంది. కానీ తీరా అవార్డుల విషయానికి వస్తే మాత్రం.. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించదు. ఇండియాలో కలెక్షన్‌ లు బాగానే ఉన్నా.. విదేశీ సినిమా కేటగిరిలో మాత్రం కనీసం ఎంపిక అవడం కూడా గగమనే. కానీ చిన్న చిన్న దేశాలకు చెందిన మూవీస్ మాత్రం ఆస్కార్‌ బరిలో నిలవడమే కాదు.. అవార్డులను కూడా కైవసం చేసుకుంటాయి. మరి భారతీయ సినిమాకు అంత సీన్‌ లేదా..? ఎందుకు మన దర్శకులు ఉత్తమ చిత్రాలను తెరకెక్కించలేకపోతున్నారు ?


ఆస్కార్‌ అవార్డు సాధించడమంటే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడమే. కానీ మన భారతీయ సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా అవార్డు రేసులో కనిపించవు. మన సినిమాలకు సంబంధించిన ఊసే వినిపించదు. ఒకటి రెండు మినహా ఆస్కార్‌ స్థాయి సినిమాలు ఇప్పటి వరకు తీసిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఆ సెలక్టెడ్‌ మూవీస్‌ కూడా ఇతర దేశాలతో పోటీ పడలేక మధ్యలోనే వెనుదిరిగే పరిస్థితి ఇండియన్స్‌ సినిమాలది.


1957 నుంచి 2016 వరకూ దాదాపు ఈ అరవై సంవత్సరాల్లో ఇండియా తరపు నుంచి ఆస్కార్ ఫారెన్ ఫిల్మ్ క్యాటగిరీ అవార్డు కోసం ఎనిమిది తమిళ సినిమాలు పోటీ పడ్డాయి. అదే విధంగా టాలీవుడ్‌ నుంచి కే. విశ్వనాథ్‌ డైరెక్ట్‌ చేసిన స్వాతిముత్యం గతంలో ఆస్కార్‌ స్ర్రీనింగ్‌ కమిటీ ముందుకు వెళ్లింది. హిందీ విషయానికి వస్తే గత ఏడాది సరబ్‌ జిత్‌, ఎంస్‌ ఎస్‌ ధోనీ అన్‌ టోల్డ్‌ స్టోరీలు ఆస్కార్‌ విదేశీ కేటగిరిలో పోటీ పడ్డాయి. అంతకు ముందు కూడా కొన్ని సినిమాలు ఎంపికైనా ఒక్కటి కూడా అత్యున్నత పురస్కారాన్ని అందుకోలేక పోయాయి.


ఒకవైపేమో మన సినిమా ప్రపంచ స్థాయికి చేరిపోయిందని చెబుతుంటారు మనవాళ్లు.. హాలీవుడ్ స్థాయిని మించిపోయామని.. ఇండియన్‌ సినీ ప్రభ అంతరిక్ష స్థాయిలో వెలిగిపోతోందని.. మనోళ్లు అద్భుతాలు చేస్తున్నారని.. ప్రపంచ దృష్టినే ఆకర్షిస్తున్నారని.. అనే మాటలూ తరుచుగా వినిపిస్తూ ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఆడియో విడుదల వేడుకల్లో వినిపించే భజంత్రీ మాటలే అని చెప్పక తప్పదు. చరిత్రంతా తిప్పి చూస్తే..ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు ఆస్కార్‌ అవార్డు ఎంపిక కోసం స్ర్కీనింగ్‌ దశ వరకు వెళ్లాయి. కానీ తీరా ఆయా అంశాల్లో సెలెక్ట్‌ అవక ఇంటిముఖం పడుతున్నాయి. గత ఏడాది తమిళ్‌ హీరో ధనుష్‌ నిర్మించిన విసారణై విదేశీ కేటగిరిలో ఆస్కార్‌ బరిలో నిలిచింది. అంతకు ముందు కూడా ఒకటి రెండు సినిమాలు ఆస్కార్‌ కమిటీ ముందుకు వెళ్లినా.. వారి స్థాయిని అందుకోలేక వెనుదిరిగాయి.


మలయాళీ సినిమాలు రెండుసార్లు ఆస్కార్ అవార్డు రేసుకు వెళ్లగా.. మరాఠ చిత్రాలైన కోర్ట్, దాని కన్నా ముందు హరిశ్చంద్రా ఫ్యాక్టరీ, శ్వాస్ అనే సినిమాలు కూడా ఆస్కార్ బరిలో నిలిచాయి. గుజరాతీ, బెంగాళీ చిత్ర పరిశ్రమల నుంచి వచ్చిన సినిమాలు కూడా ఈ విదేశీ సినిమా కేటగిరిలో నామినేట్‌ అయ్యాయి. కానీ వీటిలో దేనికి కూడా అత్యుత్త చిత్రంగా నిలిచే అర్హత లేదన్నది ఆస్కార్‌ స్క్రీనింగ్‌ కమిటీ అభిప్రాయం. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది..? ఆ స్థాయిలో మన దగ్గర కథ, కథనాలు తయారు చేసేవారు లేరా..? ఆ రేంజ్‌ మూవీస్‌ ను మన డైరెక్టర్స్‌ తీయలేరా.? అసలు మనది ప్రయత్న లోపమా.. లేక చిత్తశుద్ధి లేదా..? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.


వాస్తవానికి మన దేశంలో ఏ ఒకరిద్దరో మినహాయించి ప్రయోగాత్మక పాత్రలు చేయడానికీ ఏ హీరో ముందుకు రారు, అలాంటి సినిమాలకు అనుకున్నమేర ప్రోత్సహమూ మన దగ్గర ఉండదు. ఇక రచయిత, దర్శకులు కూడా ఆయా హీరోల ఇమేజ్‌ ను దృష్టిలో ఉంచుకునే కథలు సిద్ధం చేస్తుంటారు. అదీగాక హిట్టైన ఫార్ములా..లేక హీరోలు ప్రాధాన్యతను ఇస్తూ ఉండటంతో.. ప్రయోగాత్మక చిత్రాలకు ఆస్కారం లేకుండా పోతోందన్నది సినీ విమర్శకుల మాట.


తెలుగు విషయానికి వస్తే.. ఎస్‌ ఎస్‌ రాజమౌళి డైరెక్ట్‌ చేసిన బాహుబలి తెలుగులోనే కాదు అన్ని భారతీయ భాషల్లోనూ సూపర్‌ హిట్‌ మూవీగా నిలిచింది. నిర్మాతలకు కోట్ల రూపాయలు సంపాదించి పెట్టింది. బాలీవుడ్‌ జనాలు కూడా ఈ సినిమాను చూసీ వాహ్వా అన్నారు. అటు చైనా నుంచి జపాన్‌ వరకు, ఎన్నో ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ లో అవార్డులను కైవసం చేసుకుంది. ఈమూవీ చూసిన వారంతా విజువల్స్‌ వండర్‌ గా అభివర్ణించారు. కానీ తీరా ఆస్కార్‌ రేస్‌ లో మాత్రం వెనుకపడిపోయింది. విదేశీ చిత్రాల కేటగిరిలో ఏ అంశంలోనూ పోటీలో నిలువలేక పోయింది. 


ఇండియన్ మూవీస్‌ ఆస్కార్‌ సాధించ పోవడానికి కారణమేంటి..? మన సినిమాలు ఆ స్థాయిలో ఉండడం లేదా..? లేకా మన సినీ ఇండస్ట్రీ పెద్దలు లాబీయింగ్‌ చేయడంలో విఫమవుతున్నారా..? ఇండియాను ఆస్కార్‌ ఇంకెన్నాళ్లకు వరిస్తుంది. మరెన్నాళ్లు ఎదురుచూపులు.. అంటే ఎవరి దగ్గర సమాధానం లేదనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: